Vivek Ramaswamy: అప్పుడలా.. ఇప్పుడిలా! మాట మార్చిన వివేక్ రామస్వామి.. అందుకు సుముఖత!
ABN, First Publish Date - 2023-08-27T07:36:38+05:30
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి, ట్రంప్ సర్కారులో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తారా..? ఈ ప్రశ్నకు కొన్నిరోజుల క్రితం కచ్చితంగా చేయనని తేల్చిచెప్పిన వివేక్, తాజాగా మాత్రం అందుకు సుముఖంగా ఉన్నట్లు సూచనలిచ్చారు.
వాషింగ్టన్/లండన్, ఆగస్టు 26: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి, ట్రంప్ సర్కారులో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తారా..? ఈ ప్రశ్నకు కొన్నిరోజుల క్రితం కచ్చితంగా చేయనని తేల్చిచెప్పిన వివేక్, తాజాగా మాత్రం అందుకు సుముఖంగా ఉన్నట్లు సూచనలిచ్చారు. ఒకవేళ మీ పార్టీ నుంచి మీకు నామినేషన్ దక్కకపోతే మీరు ట్రంప్ సహాయకుడిగా ఉండేందుకు సిద్ధమేనా అంటూ బ్రిటన్‌కు చెందిన జీబీ న్యూస్ సంస్థ ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘నా పోటీ కేవలం నా ఒక్కడి గురించే కాదు. ఒకవేళ నా స్వార్థం గురించే అనుకుంటే.. ఇంత చిన్న వయసులో ఉపాధ్యక్ష పదవి దక్కడం చాలా మంచిదే. కానీ ఇది నా దేశాన్ని పునరుద్ధరించడానికి, పునరేకీకరించడానికి మాత్రమే. శ్వేతసౌధం నుంచి ఈ ఉద్యమానికి నేతగా వ్యవహరిస్తే అది నెరవేరుతుంది. నేను ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చాను. ట్రంప్ వయసుకు సగం వయసు నాది. కానీ అత్యంత విలువైన సలహాదారుగా ఉండే విషయంలో నేను ఆయన్ను అడుగుతాను’’ అని వివేక్ వెల్లడించారు. ఇటీవల జరిగిన తొలి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థుల చర్చలో రామస్వామి అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌నకు మద్దతు విషయంలో ఇతర అభ్యర్థులతో పోలిస్తే, రామస్వామి మరింత బలంగా తన వాదనను వినిపించారు.
Updated Date - 2023-08-27T07:37:58+05:30 IST