NRI: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు
ABN, First Publish Date - 2023-05-06T13:46:43+05:30
సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో 2023 మే 1వ తేదీన మేడే వేడుకలు ఘనంగా జరిగాయి.
-కార్మికులకు శుభవార్తనందించిన సింగపూర్ తెలుగు సమాజం
సింగపూర్ సిటీ: సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో 2023 మే 1వ తేదీన మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. సింగపూర్ తెలుగు సమాజం (Singapore Telugu Society) ఆధ్వర్యంలో సింగపూర్‌లోని తెరుసన్ రిక్రియేషన్ సెంటర్‌లో పాటలు, డాన్స్, మ్యాజిక్, వెంట్రిలాక్విజం, మెంటాలిజం, లేజర్ షో వంటి వివిధ వైవిధ్యభరిత సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత ఘనంగా జరిగాయి. సుమారు 700 మంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజాకవి, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత, గాయకుడు, తెలంగాణ శాసనమండలి సభ్యులు శ్రీ గోరటి వెంకన్న హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకన్న తన పాటలతో, చక్కని ఉపన్యాసంతో సభికులను ఉత్తేజపరుస్తూ అలరించారు. ప్రముఖ జానపద గాయని చైతన్య తనదైన రీతిలో జానపద గీతాలతో అలరించారు. వైవిధ్య కళాకారుడు రవి పిల్లల్ని, పెద్దల్ని తన మాయాజాలంతో అందర్నీ మంత్రముగ్ధులను చేశారు. తరవాత డాన్స్, పాటలు, ఇతర వినోదభరిత కార్యక్రమాలతో అనేకమంది శ్రామిక సోదరులు అత్యంత ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో కార్మిక సోదరుల కోసం 3 వారాంతాల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్ పోటీలు అందరినీ ఏకతాటిపైకి తెచ్చాయి. పోటీల్లో గెలిచిన వారికి గోరెటి వెంకన్న చేతుల మీదుగా బహుమతుల్ని, ప్రైజ్ మనీని అందించారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రవాసాంధ్ర వ్యవహారాల సలహాదారు, మాజీ పార్లమెంట్ సభ్యులు జ్ఞానేంద్రరెడ్డి హాజరయ్యారు. అందరికీ శుభాకాంక్షలు తెలపటంతో పాటు, అందరినీ ఒకతాటి మీదకు తీసుకొచ్చి కార్మిక సోదరులకు తెలుగు సమాజం చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఏపీయన్నార్టి ప్రవాస భీమా గురించి వివరించటంతో పాటు ప్రభుత్వం అవసరమైనప్పుడు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అలాగే సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వివిధప్రాంతాలకు విమానసర్వీసులకై తన పరిధిలో కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. తెలుగులో కార్మిక సోదరుల వృత్తి నైపుణ్య పరీక్షలకై తెలుగు సమాజం కార్యవర్గం చేస్తున్న కృషి ఫలించిందని, తొలిదశలో 5 కోర్సులు ఆమోదం పొందాయని హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. సింగపూర్ చరిత్రలో ఇదే మొట్ట మొదటిసారి కావటం విశేషం. అలాగే సింగపూర్‌లో నివసించే వలస కార్మిక సోదరులకు అనుకోకుండా దురదృష్టవశాత్తు జరిగిన పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలపు ప్రయోజనం కలిగేలా స్ధిరమైన భీమా ప్రణాళికపై సింగపూర్ తెలుగు సమాజం గత కొంతకాలంగా పనిచేస్తుందన్నారు. ఆ ప్రణాళికను భారతదేశ హై కమీషన్ దృష్టికి తీసుకువెళ్ళడంతో వారు కూడా ఈ బీమా ప్రయోజకుల పరిధిని పెంచేందుకు వారే చొరవ తీసుకుని మరింత ముందుకు తీసుకొని వెళ్ళి ఒకవిధంగా కృతార్థులు అయ్యారని తెలిపారు. ప్రస్తుతానికి కొత్తగా ఇక్కడకు వచ్చేవారు ఈ నూతన బీమా పరిధిలోకి వచ్చేవిధంగా అనుమతులొచ్చినప్పట్టకీ ఇప్పటికే ఇక్కడ నివశిస్తున్న కార్మిక సోదరులను కూడా ఈ భీమా పరిధిలోకి వచ్చే విధంగా వివిధ శాఖలకు సంబంధించిన అనుమతుల పక్రియ చివరి దశకు వచ్చిందని సింగపూర్‌లోని భారత హై కమీషనర్ పెరియసామి కుమారన్ ఈ అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం నాడు ప్రకటించారు.
ఈ కార్యక్రమాన్ని విజయంతం కావడానికి సహకరించిన అందరికీ, హాజరైనవారికీ, ముఖ్యంగా స్పాన్సర్స్‌కు, క్రీడాకారులకు నిర్వాహకులు మేరువ కాశిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయగా సుమారు 3,700 మంది వీక్షించారు. భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాల్ని తెలుగు సమాజం నిర్వహిస్తుందని, ఈ నూతన కమిటీ గతంలో సాధించిన విజయాల్ని పునాదిగా చేసుకొని మరెన్నో వినూత్న కార్యక్రమాల్ని చేపట్టబోతున్నట్లు గౌరవ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి తెలిపారు.
Updated Date - 2023-05-06T13:46:43+05:30 IST