NRI: దుబాయిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
ABN, First Publish Date - 2023-01-17T17:32:08+05:30
అరబ్బు దేశాలలో తెలుగు ప్రవాసీయులు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన సంక్రాంతిని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఆధునిక యాంత్రిక కాలంలో పండుగలు, ఆచార సంప్రదాయాలు క్రమేణా కనుమరుగవుతున్నాయి. ఆధ్యాత్మిక లేమితో అసలైన పండుగ ఆచారాలు కళ తప్పుతున్నాయి ఇక విదేశాలలో అందునా గల్ఫ్ దేశాలలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఏ దేశమేగినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ అరబ్బు దేశాలలో(Arab Nations) కూడా తెలుగు ప్రవాసీయులు(Telugu NRIs) తమకు అత్యంత ప్రీతిపాత్రమైన సంక్రాంతిని(Sankranti Celebrations) ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. దుబాయిలో(Dubai) మాతృభూమి కంటే కూడా మెరుగ్గా, పూర్తి ఆచార వ్యవహారాలతో గోదాదేవి, శ్రీరంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహించారు. సంక్రాంతి అంటే స్వదేశంలో కోడిపందేలపై ఆసక్తి విదేశాలలో సినిమా పాటలపై మోజు కనిపిస్తాయి కానీ ధనుర్మాసంలో గోదాదేవి, శ్రీరంగనాథుల కళ్యాణ మహోత్సవంపై ఉండదు.
ఈ నేపథ్యంలో దుబాయిలోని తెలుగు ప్రవాసీయులు ధార్మిక ఆచారాలతో, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్ర్తోక్తంగా జరుపుకొన్న సంక్రాంతి పండుగ స్వదేశంలోని వేడుకల సంబరాన్ని కూడా అధిగమించింది. దుబాయిలోని తెలుగు అసోసియేషన్, రాస్ అల్ ఖైమాలోని తెలుగు తరంగిణి అనే తెలుగు ప్రవాసీ సంఘాల అధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలు మైథిలీ మోహన్ ప్రార్థన గీతంతో ప్రారంభమై తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో జరిగాయి.
భోగి మంటలు, తిరుప్పావై అనంతరం, సంప్రదాయం – దుబాయి పక్షాన పి. భరద్వాజ ఆచార్య నేతృత్వంలో హరీష్ ప్రభు, మోహన్‌ల సహకారంతో నిర్వహించిన శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం, అర్చనలు ఆద్యంతం భక్తి పారవశ్యంతో కన్నుల పండువగా జరిగాయి. కళ్యాణ మహోత్సవంలో ఇందిరా విజయలక్ష్మిల అన్నమయ్య కీర్తనలు, తన్మయి విద్యార్థుల కూచిపూడి నృత్యాలు, ఇస్కాన్ వారి భజనలు, చందామేళం అందరినీ ఆకట్టుకుంది. ఇస్కాన్ పక్షాన హెచ్.జి. జగత్ శక్తి, హెచ్.జి. మురళీచరన్ దాస్‌లు సందేశాన్ని ఇచ్చారు.
శ్రీ గోదారంగనాథస్వాముల పల్లకీ సేవలో భక్తులందరూ భక్తి పారవశ్యంతో పాల్గొన్న తీరు పల్నాడులోని కోటప్పకొండల ప్రభల తీరును మరిపించింది. ఎడారి నాట బతుక వచ్చిన చోట కొత్త అల్లుళ్ళ సందడులు, బావామరదళ్ల సరసాలు లేకున్నా భోగి మంటలు, పసందైన పిండి వంటలు, కొత్త బట్టల వయ్యారాలతో దుబాయి తెలుగు ప్రవాసీయులు సంక్రాంతికి వన్నెలు తీసుకువచ్చారు.
వివిధ ఆచార వ్యవహారాలతో లక్ష్మినంద (రాజమండ్రి), తనుజా రాజేశ్ (తిరుపతి), శోభా సురేశ్ (వైజాగ్), మైథిలీ మోహన్ (తిరుపతి) అందర్నీ అలరింపజేసారు. మహిళలు ముగ్గులు వేస్తుండగా రామదాసు కీర్తనలు, హరినామ సంకీర్తనలతో కాలికి గజ్జెకట్టి తంబుర మీటుతూ, తలపై అక్షయ పాత్రతో చేతిలో చిడతలతో హరిదాసులుగా కోనేటి దకసాయి నర్సింహా, మను ప్రగాడ, మీసాల మెహర్ శాశంక్ పాత్రలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్, అంతర్జాతీయ ఆర్యవైశ్య సంఘం (WAM) కార్యనిర్వహక అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ కార్యక్రమంలో పాల్గొని భోగి పళ్ళు పోయించుకున్న చిన్నారులను ఆశీర్వదించి బహుమతులను అందించారు. భోగి పళ్ళను శివానందం, ప్రసాద్‌లు ప్రత్యేకంగా భారతదేశం నుండి తెప్పించారు.
తెలుగు తరంగిణి అధ్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేష్, ఉపాధ్యక్షులు ముసునూరి సాయికృష్ణ మోహన్, కార్యదర్శులు రాజేష్ ఛామర్తి, సత్యానంద కోకా, సి.హెచ్. శ్రీనివాస్, వెంకీ నాయుడు, శివానంద్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు దినేష్ ఉగ్గిన, ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా, మోహన కృష్ణ, విజయ్ భాస్కర్, శరత్చంద్ర యెల్చురి, పద్మలత నగేష్ కార్యక్రమాన్ని సమన్వయం చేసినట్లుగా నిర్వహకులు తెలిపారు. తెలుగు సంస్కృతి, కళలకు తాము ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని దుబాయి తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు దినేష్ ఉగ్గిన, తెలుగు తరంగిణి అధ్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేశ్ ఈ సందర్భంగా తెలిపారు.
ఫొటో గ్యాలరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - 2023-01-17T17:34:27+05:30 IST