Telugu Man: సౌదీలో తెలుగు ప్రవాసుడు చేసిన చిన్న తప్పు.. పరాయిగడ్డపై పెద్ద చిక్కునే తెచ్చి పెట్టింది..!
ABN, First Publish Date - 2023-02-24T12:33:16+05:30
ఏదైనా పండును దొంగతనంగా తింటే .. మన దేశంలో అయితే, చీవాట్లు పెట్టి వదిలేస్తారు లేదా డబ్బులు వసూలు చేస్తారు కానీ, సౌదీ అరేబియాలో..
నారింజ పండ్లను తిన్నందుకు జైలు శిక్ష, జరిమానా
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): ఏదైనా పండును దొంగతనంగా తింటే .. మన దేశంలో అయితే, చీవాట్లు పెట్టి వదిలేస్తారు లేదా డబ్బులు వసూలు చేస్తారు కానీ, సౌదీ అరేబియాలో ఏకంగా జైలుకే పంపిస్తారు. ఆపై భారీ జరిమానా కూడా విధిస్తారు. గల్ఫ్‌లో ఉపాధి కోసం వెళ్లిన తెలంగాణ ప్రవాసీయునికి ఇదే అనుభవం ఎదురైంది. బండిపై చేతికి అందిన రెండు నారింజ పండ్లను దొంగతనంగా తిన్నందుకు జైలు పాలయ్యాడు. ఆపై తాత్కాలికంగా విడుదలైనా కోర్టు ప్రయాణంపై నిషేధం విధించడంతో స్వదేశానికి వెళ్లలేక, మరో వారంలో వీసా గడువు ముగియనున్న నేపథ్యంలో సౌదీ అరేబియాలో ఉండే పరిస్థితి లేక నానా అగచాట్లు పడుతున్నాడు. సిద్దిపేట జిల్లా గన్నేరువరం మండలానికి చెందిన బూర్ల ప్రభాకర్ (56) చాలాకాలంగా సౌదీ అరేబియాలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఒకరోజు అనుకోకుండా తాను పని చేస్తున్న అంగడిలో బండిపై రెండు నారింజ పండ్లను తీసుకుని తిన్నాడు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేయగా న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్షతో పాటు వేయి రియాల్స్ (భారత కరెన్సీలో రూ.22 వేలు) జరిమానా విధించింది. జైలు శిక్ష అనుభవిస్తుండగా కంపెనీ పై కోర్టుకు వెళ్లగా 14 రోజుల శిక్ష అనంతరం ప్రభాకర్‌ను తాత్కాలికంగా విడుదల చేసింది. ఈ ఘటన జరిగి రెండేళ్లకు పైగా అయింది. కేసు హైకోర్టు వరకు వెళ్లింది. విచారణ తేదీల గురించి ప్రభాకర్ తెలుసుకోకపోవడంతో సకాలంలో కోర్టుకు హాజరు కాలేకపోయాడు. భాషా సమస్యతో ప్రభాకర్ తన వాదనను వినిపించలేకపోవడంతో న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వలేదు. కానీ, అతన్ని జైలు నుంచి తాత్కాలికంగా విడుదల చేసి, అతనిపై ప్రయాణ నిషేధాన్ని విధించింది.
ఈ విషయం ప్రభాకర్‌కు తెలియదు. 14 రోజులతో తన శిక్ష పూర్తయిందనుకున్నాడు. తాను పని చేస్తున్న కంపెనీతో కాంట్రాక్టు పూర్తవడంతో మూడు నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రభాకర్ అప్పటి నుంచి తన వీసాను రద్దు చేసి తనను స్వదేశానికి పంపించమని కంపెనీని ప్రాధేయపడుతున్నాడు. కానీ, న్యాయస్థానం తుదితీర్పు ఇవ్వకపోవడంతో కేసు పెండింగ్‌లో ఉంది. దీంతో వీసా రద్దు కాక, మాతృదేశానికి వెళ్లలేకపోతున్నాడు. మరోవారంలో వీసా గడువు ముగియనుంది. అప్పుడు ప్రస్తుతం నడుస్తున్న నారింజ దొంగతనం కేసుతో పాటు, వీసా నిబంధననను ఉల్లంఘించినట్లుగా మరో నూతన కేసుతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రభాకర్ ఆందోళన చెందుతున్నాడు. దీంతో సామాజిక కార్యకర్త అబ్దుల్ రఫీక్‌తో కలిసి కోర్టుల వెంట తిరుగుతున్నాడు. మిగతా 16 రోజుల జైలు శిక్షను అనుభవిస్తానని కోర్టును వేడుకుంటున్నా ఫలితం లేకపోతోంది. వీసా గడువు ముగిసేలోపు కోర్టు ఈ కేసుపై వాదనలు వినే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తనకు న్యాయ సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: గతేడాది రూ.25 కోట్ల లాటరీ గెలిచిన ఈ ఆటో డ్రైవర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిస్తే..
Updated Date - 2023-02-24T12:34:32+05:30 IST