NRI: నారింజ పండ్లు ఎంత పనిచేశాయి.. సౌదీలో తెలుగు ఎన్నారైకి ఊహించని అనుభవం.. అటు ఉన్న ఉద్యోగం ఊడి.. ఇటు స్వదేశానికి రాలేని పరిస్థితి..!
ABN, First Publish Date - 2023-03-19T11:07:23+05:30
దేశం కాని దేశంలో ఓ తెలుగు ఎన్నారై (Telugu NRI) పడరానిపాట్లు పడుతున్నాడు.
రియాద్: దేశం కాని దేశంలో ఓ తెలుగు ఎన్నారై (Telugu NRI) పడరానిపాట్లు పడుతున్నాడు. దీనికంతటికి కారణం అతడు చేసిన ఒక చిన్న తప్పు. పండ్ల మార్కెట్‌కు వెళ్లినప్పుడు దొంగచాటున నారింజ పండ్లు తీసుకుని తిన్నాడు. అది కాస్త ఓ వ్యాపారి చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే.. ఆ తర్వాత మనోడికి చుక్కలు కనిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. సిద్దిపేటకు చెందిన బూర్ల ప్రభాకర్( Burla Prabhakar ) మూడేళ్ల నుంచి సౌదీ అరేబియాలో (Saudi Arabia) ఉపాధి పొందుతున్నాడు. అక్కడ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అతడు ఒకరోజు ఖమీస్ ముషైత్ పట్టణంలోని పండ్ల మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ నారింజ పండ్లను(Oranges) దొంగిలించి తిన్నాడు.
అలా ప్రభాకర్ నారింజ పండ్లను దొంగతనంగా తీసుకుని తినడం దూరం నుంచి ఓ వ్యాపారి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు అతడిని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం నెల రోజులు జైలు శిక్షతో పాటు వెయ్యి రియాల్స్ (సుమారు రూ.22,000) జరిమానా విధించింది. అయితే, ప్రభాకర్ ఈ కేసును పైకోర్టులో అప్పీల్ చేశాడు. దాంతో 14 రోజుల జైలు శిక్ష అనుభవించిన తర్వాత విడుదలయ్యాడు. అంతేగాక కోర్టు జరిమానాను కూడా రద్దు చేసింది.
ఇది కూడా చదవండి: 50 కంటే ఎక్కువ దేశాల పౌరులకు యూఏఈ తీపి కబురు
కానీ, హిజ్రీ క్యాలెండర్ (Hijri Calendar) గందరగోళం కారణంగా అతనికి ఇచ్చిన తేదీలో కోర్టుకు హాజరు కాలేకపోయాడు. తాజాగా కంపెనీ లే ఆఫ్స్ కారణంగా ఉన్న ఉద్యోగం కూడా ఊడింది. కంపెనీ అతడిని స్వదేశానికి తిరిగి పంపించాలని చూసినా.. ప్రభాకర్‌పై దొంగతనం కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున ట్రావెల్ బ్యాన్(Travel Ban) కారణంగా కంపెనీ వారు అతని వీసాను రద్దు చేయలేకపోయారు. దాంతో వేరే మార్గంలేక మిగిలిన 16 రోజుల జైలు శిక్షను పూర్తి చేసి జరిమానా చెల్లించాలని ప్రభాకర్ ప్రయత్నిస్తున్నాడు. అప్పటికైనా తన వీసా రద్దు అయ్యి స్వదేశానికి వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నాడు. కానీ అది వర్కౌట్ కావడం లేదు. ఇక ట్రావెల్ బ్యాన్ అంటే పెండింగ్‌లో ఉన్న కేసు పరిష్కారం అయ్యి, అతని వీసా రద్దు అయ్యే వరకు ప్రభాకర్ సౌదీ అరేబియా వదిలి వెళ్లేందుకు వీలు పడదు.
ఇది కూడా చదవండి: భిక్షాటన చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయి అధికారులు.. అతడి వద్ద ఉన్న నగదును చూసి నోరెళ్లబెట్టారు..!
Updated Date - 2023-03-19T11:08:32+05:30 IST