ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US Consulate General: భారతీయ వంటకాలు అస్సలు బోర్ కొట్టవు.. ఇక్కడ ఒకో రోజు ఒకో అద్భుతమైన అనుభవం..

ABN, First Publish Date - 2023-03-11T08:43:00+05:30

అమెరికాలో తెలుగు వారి సంఖ్య కొన్ని లక్షలు ఉంటుంది. ప్రతి ఏడాది వారికి సన్నిహితులు కొన్ని లక్షల మంది అమెరికాకు వెళ్తూ ఉంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమెరికాలో తెలుగు వారి సంఖ్య కొన్ని లక్షలు ఉంటుంది. ప్రతి ఏడాది వారికి సన్నిహితులు కొన్ని లక్షల మంది అమెరికాకు వెళ్తూ ఉంటారు. అక్కడి నుంచి వస్తూ ఉంటారు. వీరందరినీ హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం అనుసంధానం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం నానక్‌రామ్‌గూడలో నిర్మించిన కొత్త భవంతికి మారబోతోంది. ఈ నేపథ్యంలో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లారెన్స్‌ ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక మహిళా అధికారిగా తనకు ఎదురయిన అనుభవాలను పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలలోకి వెళ్తే..

మీరు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారా? మీకు ఎదురయిన అనుభవాలేమిటి?

ఒకో రోజు ఒకో అద్భుతమైన అనుభవం ఎదురవుతోంది. అమెరికాకు- తెలుగు రాష్ట్రాలకు మధ్య సంబంధం చూస్తుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. ‘ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా అమెరికాలో ఉన్నారా?’ అనిపిస్తుంది. అనేకమంది తెలుగువారు అమెరికా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, స్థిరపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే... అమెరికాది- తెలుగు రాష్ట్రాలది పేగు బంధం. ఇక హైదరాబాద్‌ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఓల్డ్‌ సిటీ గల్లీలలో నడుస్తుంటే.. చారిత్రక కట్టడాలను దర్శిస్తుంటే... పుస్తకాల షాపులు, స్థానికంగా ఉన్న గ్యాలరీలు, మ్యూజియంలకు వెళ్తుంటే- కలిగే అనుభూతే వేరు.

సాధారణంగా విదేశాంగ శాఖలో ఎక్కువ మంది పురుషులే ఉంటారు. మహిళా అధికారిగా పనిచేయటం కష్టమవు తోందా?

నా సర్వీసులో అనేక విభిన్నమైన అనుభవాలున్నాయి. కొన్ని మీటింగ్స్‌లో, కొన్ని కార్యక్రమాల్లో - అందరూ పురుషులే ఉంటారు. మహిళను నేను ఒకదాన్నే కనిపిస్తూ ఉంటాను. అయితే ఏదైనా అంశం మీద నా అభిప్రాయాన్ని చెప్పటానికి, నా దృష్టి కోణాన్ని వివరించటానికి ఎప్పుడూ సంకోచించను. అప్పుడు వారిలో కూడా ‘‘అందరం పురుషులమే ఉన్నాం.. ఎందుకు?’’ అనే ఆలోచన రావచ్చు. మన జీవితంలో- వృత్తిలోనూ భిన్నత్వం ఉంటే మంచిది. అది సానుకూల ధృక్పథాన్ని అలవాటు చేస్తుంది.

ఒక ఉన్నతాధికారిగా అనేక ఒత్తిళ్లు ఉంటాయి. మీ దైనందిక జీవితాన్ని, వృత్తి జీవితాన్ని ఎలా బ్యాలెన్స్‌ చేసుకుంటారు?

ఎప్పుడూ విదేశాలలో నివసించే విదేశాంగ శాఖ అధికారిగా నా జీవితం వృత్తితో పెనవేసుకుపోయింది. ఎక్కడ పోస్టింగ్‌ లభిస్తే అక్కడి సమాజంతో మేము మమేకమవ్వాలి. పగలు, రాత్రి అని లేకుండా అక్కడి ప్రజలతో కలిసిపోవాలి. నేను స్వభావరీత్యా ఇంట్రావర్ట్‌ను. ప్రతి రోజు కనీసం ఒక గంట ఆత్మావలోకనం చేసుకోవటానికి కేటాయించుకుంటా. అంతే కాదు, నేను ఎక్కువ సమయం ఆఫీసులో ఉంటే సిబ్బంది కూడా ఉండాల్సి వస్తుంది. అందువల్ల నేను ఆఫీసులో అదనపు సమయాన్ని గడపను. నా సిబ్బంది వీలైనంత త్వరగా ఇంటికి వెళ్లి తమ కుటుంబాలతో గడపాలని కోరుకుంటా! హైదరాబాద్‌లాంటి అద్భుతమైన నగరాన్ని వారు కూడా ఆస్వాదించాలనుకుంటా!

మీ విదేశాంగ శాఖ కెరీర్‌లో మరపురాని అనుభవమేదైనా చెప్పండి..

మనం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తూ ఉండచ్చు. కానీ అందరూ ఒక శాంతియుతమైన, ఆనందకరమైన జీవితాన్ని కోరుకుంటారు. విదేశాంగ శాఖలో పనిచేస్తున్నప్పుడు వేర్వేరు ప్రాంతాల్లో నివసించే అవకాశం వస్తుంది. ఆయా ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోగలుగుతాం. అది లిబియా కావచ్చు, ఇండియా కావచ్చు, ఈస్ట్‌ జెరూసలెం కావచ్చు, అమెరికా కావచ్చు. అక్కడ ప్రజలు తమ జీవితాలను ఆనందకరంగా మార్చుకోవటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇవే నా మరపురాని అనుభవాలు.

ఈ మధ్యకాలంలో వీసా అపాయింట్‌మెంట్‌ల కోసం వేచి చూసే వ్యవధి బాగా పెరిగిపోయింది. దీనిని తగ్గించటానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు...

తెలుగు కుటుంబాలకు అమెరికా వీసాలు ఎంత ముఖ్యమో మాకు తెలుసు. అందుకే వీసా అపాయింట్‌మెంట్‌ వ్యవధిని తగ్గించటానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. కొవిడ్‌ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కాన్సులేట్‌ సేవలు అందించే సిబ్బంది సంఖ్యను తగ్గించాం. ఇప్పుడు మళ్లీ పెంచుతున్నాం. ముఖ్యంగా భారత్‌లో ఈ సంఖ్యను సాధారణ స్థితికి తీసుకువస్తున్నాం. భారత్‌కు అదనంగా తాత్కాలిక కాన్సులేట్‌ సిబ్బందిని నియమించారు. వారిలో ముగ్గురిని హైదరాబాద్‌ కాన్సులేట్‌కు కేటాయించారు. వీరితో పాటుగా శాశ్వత కాన్సులేట్‌ సిబ్బందిని కూడా పెంచుతున్నాం. అంతే కాకుండా- శనివారాలు కూడా కాన్సులేట్‌ను తెరిచే ఉంచుతున్నాం. విదేశాల్లో ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్‌లలో కూడా వీసాలు తీసుకొనే విధంగా నిర్ణయాలు తీసుకొన్నాం. దీనివల్ల వేల మందికి మేలు జరుగుతుంది. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో అమెరికా కాన్సులర్‌ అధికారుల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత అత్యధికంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు?

నేను మంచి చదువరిని. ఖాళీ దొరికితే ఒక మంచి పుస్తకం తీసుకొని ఒక కెఫేలో కూర్చుని చదువుకోవటానికి ఇష్టపడతా! నేను యోగా ప్రాక్టీసు చేస్తా. గత కొన్నేళ్లుగా రకరకాల యోగాలు ప్రాక్టీసు చేసా! హైదరాబాద్‌లో ఏరియల్‌ యోగా నేర్పే ఒక మంచి సెంటర్‌ను కనుక్కొన్నా! నాకు వంట చేయటం హాబీ. స్థానిక మార్కెట్‌లకు వెళ్లి అక్కడ దొరికే రకరకాల దినుసులు కొనుక్కొని వచ్చి వంట చేస్తా. కుండలు చేయటం కూడా నా హాబీ. ప్రస్తుతం ఒక మంచి కుండలు చేయటం నేర్పే స్టూడియో కోసం వెతుకుతున్నా. నాతో పాటు నా పిల్లి కూడా ఉంటుంది. నాకు మూగ జీవాలంటే ఇష్టం.

మీకు నచ్చిన భారతీయ ఆహారమేమిటి?

చాలా ఉన్నాయి. ఒక వంట చెప్పటం కష్టం. నాకు చోలే భటూరా, దాల్‌ మఖనీ, ఫిష్‌ కర్రీ, బిండి మసాలా, లాంబ్‌ షోర్బా, షామీ కబాబ్‌, పెరుగన్నం, ఉప్పు వేసిన లస్సీ, నిమ్మకాయ రసం, తాజా మామిడి పళ్లంటే ఇష్టం. నా ఉద్దేశంలో భారతీయ వంటకాలంత సంక్లిష్టమైనవి ఏవీ ఉండవు. అవి తినడం వల్ల బోర్‌ కొట్టదు.

20 నుంచి ప్రారంభం..

కొత్త కాన్సులేట్‌ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలను మా సోషల్‌ మీడియా ఖాతాల్లో ఉంచుతున్నాం. భారత్‌-అమెరికా వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలలో తెలుగు రాష్ట్రాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇక్కడ రూ. 2,720 కోట్లతో (340 మిలియన్‌ డాలర్లు) కాన్సులేట్‌ను నిర్మించాం. విశాలమైన ఆవరణ ఉంటే ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తారు. ఎక్కువ మంది సిబ్బంది ఉంటే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, ఒడిశాలకు చెందిన ఎక్కువ మంది ప్రజలకు వీసా సేవలు అందించగలుగుతాం.

నా బెస్ట్‌ఫ్రెండ్‌ చెన్నై నుంచి...

అమెరికాలో విద్యానాణ్యతతో పాటుగా రకరకాల కోర్సులు అందుబాటులో ఉంటాయి. పబ్లిక్‌ విశ్వవిద్యాలయాలతో పాటుగా ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. ఫుల్‌ డిగ్రీ కోర్సులు, కమ్యూనిటీ కాలేజీ ప్రొగ్రాములు... ఇలా రకరకాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. దీని వల్ల విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలిసే అవకాశముంటుంది. నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు - నా బెస్ట్‌ ఫ్రెండ్‌ చెన్నైకి చెందిన వ్యక్తి. అతనితో మాట్లాడుతూ ఉంటే భారత్‌కు సంబంధించిన అనేక విషయాలు తెలిసేవి. అంతేకాదు. ఇక్కడ నుంచి వెళ్లిన విద్యార్ధులు భారత సంస్కృతికి, సంప్రదాయాలకు బ్రాండ్‌ అంబాసిడర్లు.

జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి..

విద్యార్ధుల తల్లితండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సరైప విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. అయితే ఈ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వివరాలన్నీ తెలిపే ఎడ్యూకేషన్‌ యూఎ్‌సఏ ఆఫీసులు హైదరాబాద్‌లో ఉన్నాయి. వీరి ద్వారా అన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. చార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదేవిధంగా ఎడ్యుకేషన్‌ యూఎ్‌సఏ ఇండియా యాప్‌ కూడా అందుబాటులో ఉంది. దీన్ని మొబైల్స్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మరింత అదనపు సమాచారాన్ని U.S. India Educational Foundation (https://www.usief.org.in/Hyderabad.

aspx) Y-Axis Foundation (https://www.yaxisfoundation.org/). నుంచి తెలుసుకోవచ్చు.

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

ఫోటోలు: అశోకుడు

Updated Date - 2023-03-11T08:45:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising