TANA: ప్రవాసాంధ్రుడికి అరుదైన గౌరవం.. 'తానా' కార్యదర్శిగా అశోక్‌బాబు కొల్లా.. అమెరికాలో తెలుగోళ్లకు అండ
ABN, First Publish Date - 2023-07-19T08:29:07+05:30
అగ్రరాజ్యం అమెరికాతో తెలుగు రాష్ట్రాలకు ఉన్న అనుబంధం బహుశా ప్రపంచ దేశాల్లోని ఏ రాష్ట్రానికీ ఉండదేమో.. అక్కడ తెలుగువారు లేని వీధులుండవు.. తెలుగువారు కనిపించని కార్యాలయాలుండవు..
సేవకు చిరునామాగా నిలుస్తున్న అశోక్‌బాబు కొల్లా.. పుష్కర కాలంగా ప్రజాహిత, సేవా కార్యక్రమాలు
ప్రమాద మృతుల కుటుంబాలకు అండ
మృతదేహాలనూ స్వస్థలాలకు అప్పగింత
కొవిడ్‌లోనూ అనేక సేవా కార్యక్రమాలు
ఆగస్టు 26న ‘తానా-అశోక్ కొల్లా డే’
ఇటీవల తానా కార్యదర్శిగా ఎన్నికైన కొల్లా
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): అగ్రరాజ్యం అమెరికాతో తెలుగు రాష్ట్రాలకు ఉన్న అనుబంధం బహుశా ప్రపంచ దేశాల్లోని ఏ రాష్ట్రానికీ ఉండదేమో.. అక్కడ తెలుగువారు లేని వీధులుండవు.. తెలుగువారు కనిపించని కార్యాలయాలుండవు.. తెలుగు భాష మాట్లాడని విశ్వవిద్యాలయాలూ ఉండవు.. విద్య, ఉపాధి, వ్యాపారం కోసం లక్షలాది మంది ఉన్న అమెరికాలో మనవాళ్లు పడుతున్న కష్టాలు కూడా ఎక్కువే. సరైన సహకారం లేక, మార్గదర్శకం లేక ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారికి ఆపన్నహస్తం అందించడంలో పేరుగాంచారు అశోక్‌బాబు కొల్లా. 2009లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన ఈయన గత 14 సంవత్సరాల్లో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. తానాతో కలిసి ఈయన చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఒహాయో రాష్ట్రంలోని ఆక్రాన్ నగర మేయర్ ఆగస్టు 26ను ‘తానా-అశోక్ కొల్లా డే’గా ప్రకటించడం.. తెలుగు జాతికి దక్కిన అరుదైన గౌరవం. ఇటీవలే జరిగిన తానా మహాసభల్లో కార్యదర్శిగా ఎన్నికైన అతిపిన్న వయస్కుడు ఆయనే కావడం విశేషం.
యూనివర్సిటీ విద్యార్థులకు హెల్ప్‌లైన్..
ప్రకాశం జిల్లా పరచూరు మండలం కొల్లవారిపాలెం గ్రామానికి చెందిన అశోక్‌బాబు కొల్లా ఉన్నత విద్యకోసం 2009లో అమెరికా వెళ్లారు. గ్రామీణ నేపథ్యం ఉండటం, అమెరికాలో తెలిసినవారు ఎవరూ లేకపోవడంతో అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. వీటన్నింటినీ అధిగమించి ఐటీ రంగంలో ఉన్నతస్థానంలో స్థిరపడ్డారు. తాను భరించిన కష్టాల అనుభవంతో.. అక్కడికి వచ్చే తెలుగు విద్యార్థులకు సహకారం అందిస్తున్నారు. యూఎ్‌సలోని పలు యూనివర్సిటీలు ప్రవేశాల్లో మోసాలకు పాల్పడిన కేసులు గతంలో చాలా వచ్చాయి. వర్సిటీల తప్పులతో ప్రవేశాలు పొందిన తెలుగు విద్యార్థులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. అలాంటి వందలాది మందికి హెల్ప్‌లైన్ ద్వారా సహకారం అందించారు. అమెరికాలో విద్య, ఉపాధి కోసం వచ్చి రోడ్డు ప్రమాదాల్లో, ఇతర ఘటనల్లో మరణించేవారి తెలుగువారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అక్కడి నుంచి మృతదేహాలను స్వస్థలాలకు పంపించే స్థోమత కూడా ఉండదు. అలాంటివారిని ఆదుకోవడంలో అమెరికాలో అశోక్‌బాబు చిరునామాగా నిలుస్తున్నారు.
గత పన్నెండేళ్లలో అనేక మృతదేహాలను తన సొంత ఖర్చులు భరించి స్వస్థలాలకు పంపారు. కరోనా సంక్షోభ సమయంలోనూ తానాతో కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి.. అమెరికాలో ఆదర్శంగా నిలిచారు. నార్త్‌ఈస్ట్ ఒహాయోలో అనేక మందికి నిత్యం ఉచితంగా భోజనం అందించడంతోపాటు.. కొవిడ్ టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటు, ఉచిత కొవిడ్ కిట్లు, పీపీఈ కిట్ల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను చేపట్టారు. కొవిడ్ సమయంలో అశోక్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆగస్టు 26ను ఇకపై ‘తానా-అశోక్ కొల్లా డే’గా గుర్తిస్తున్నట్టు ఒహాయో రాష్ట్రంలోని ఆక్రాన్ నగర మేయర్ డేనియల్ హోరిగన్ గతేడాది ప్రకటించారు. తెలుగు ప్రజలకే కాకుండా.. ఆక్రాన్ నగర పౌరులకు చేస్తున్న విశేషమైన సేవలకు గుర్తింపుగా తానాతోపాటు అశోక్‌కు ఈ గౌరవం దక్కింది. ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసోసియేషన్లలో అధ్యక్షుడిగా పనిచేస్తూ.. పన్నెండేళ్లుగా తానాలో క్రియాశీలక సభ్యుడిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవలే తానా సభల్లో అశోక్‌బాబు కొల్లాను తానా కార్యదర్శిగా ఎంపిక చేశారు.
విద్యార్థుల కష్టాలు తెలుసు: అశోక్‌బాబు కొల్లా
‘అమ్మ నాన్న ఇద్దరూ రైతులే. పాఠశాలకు వెళ్లేందుకు డబ్బులు కట్టే స్థోమత లేని కుటుంబం నాది. అయినా నా చదువుకోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. నా ఆసక్తిని గమనించి అప్పులు చేసి అమెరికా పంపారు. ఇక్కడ తెలిసినవారు ఎవరూ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాను. వాటిని తట్టుకుని ఇక్కడ స్థిరపడ్డాను. నాలాగా ఇప్పుడు సైతం అనేకమంది పేద తల్లిదండ్రులు ఎంతో ఆశతో తమ పిల్లలను అమెరికా పంపిస్తున్నారు. వారికి సహకారం అందించాలన్న లక్ష్యంతోనే సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. తానాలో ప్రతి ఒక్కరూ నాకు పూర్తి సహకారం అందిస్తున్నారు’ అని అశోక్‌బాబు కొల్లా ‘ఆంధ్రజ్యోతి’తో పేర్కొన్నారు. ‘ఇక్కడి విద్యార్థులకు జీవిత, ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించడం, ఇక్కడ స్థిరపడ్డ తెలుగువారి వివాహాలకు మ్యాట్రిమోనీ సేవలు ప్రారంభించడం, అమెరికాలో ప్రవాసాంధ్రులకు తల్లిగా ఉన్న తానాను మరింత విస్తరించి ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న తెలుగు సంఘాలకు ఒక వేదిక ఏర్పాటు చేయడం నా భవిష్యత్తు లక్ష్యం’ అని చెప్పారు.
Updated Date - 2023-07-19T08:29:07+05:30 IST