Jaganannaku Chebudam : 1902కు కాల్ చేస్తే డైరెక్టుగా వైఎస్ జగనే మాట్లాడుతారని అనుకుంటున్నారా.. అయితే మీ కంటే..!
ABN, First Publish Date - 2023-05-09T20:17:49+05:30
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ఒక్కసారి గట్టిగా ప్రయత్నం చేయండి.. సచివాలయాల్లో దరఖాస్తు చేయడం అయినా..
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ఒక్కసారి గట్టిగా ప్రయత్నం చేయండి.. సచివాలయాల్లో దరఖాస్తు చేయడం అయినా, అది ఏ ప్లాట్‌ఫాం అయినా సరే ఒకసారి గట్టిగా ప్రయత్నం చేద్దాం.. అయినా మనవైపున న్యాయం ఉండి.. మనకు న్యాయం జరగని పరిస్థితులు కనిపించినా, ప్రయత్నం చేసినా సత్ఫలితాలు రాని పరిస్థితులు కనిపించినా.. అప్పుడు 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేసి నేరుగా జగనన్నకే ఫోన్ కొట్టండి.. అని సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) మంగళవారం నాడు ‘జగనన్నకు చెబుదాం’ (Jaganannaku Chebudam) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ఇదేమీ కొత్త పథకమేమీ కాదు.. టీడీపీ (TDP) అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ‘డయల్ యువర్ సీఎం’ (Dial Your CM) అనే కార్యక్రమాన్ని అమలు చేయగా.. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక ‘స్పందన’ (Spandana) పేరుతో హడావుడి చేశారు. అయితే ఇది అట్టర్ ప్లాప్ కావడంతో.. సీన్ కట్ చేస్తే.. పాత ఫోన్ నంబర్‌తోనే ‘స్పందన’కు కొత్తపేరు పెట్టి ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమాన్ని జగన్ నేటి నుంచి అమల్లోకి తెచ్చారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే.. పాత సీసాలో కొత్తసారా వేసినట్లుగా అన్నమాట.. ఇంతకీ ఈ కార్యక్రమం ఉన్న కథేంటో ప్రత్యేక కథనంలో చూసేద్దాం రండి..
జగన్ మాట్లాడుతారని అనుకుంటున్నారా..!
‘జగనన్నకు చెబుదాం’ అని పేరు పెట్టారు కదా అని ప్రజలు చెప్పిందంతా సీఎం జగనే వింటారని అనుకుంటున్నారేమో.. అబ్బే అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. అసలు సీఎం సీన్‌లోనే ఉండరు.. ఫోన్‌చేస్తే జగన్ మాట్లాడనిదానికి జగనన్నకు చెబుదామనే పేరు ఎందుకు పెట్టారు? అసలు ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేది ఎవరనేదేగా మీ సందేహం? ఇదిగో సమాధానం.. స్పందనలో ఎలాగయితే 1902కు ఫోన్‌చేస్తారో గుర్తుంది కదా.. ఇక్కడా అలాగే. మీరు ఫోన్‌చేస్తే ఆపరేటర్ ఫోన్ ఎత్తి హాలో మీ పేరు, ఫోన్ నంబరు, ఊరు, సమస్య చెప్పమంటారు. మీ సమస్య నోట్‌చేసుకున్నాం... అనగానే ఫోన్ కట్ అవుతుంది. ఇంతే కథ. సేమ్ టూ సేమ్. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 1902కు ఫోన్‌చేస్తే ఓ ఫోన్ ఆపరేటర్ రిసీవర్ ఎత్తుకొని హలో అని మీ పేరు, ఊరు, ఫోన్‌నెంబర్ అడుగుతారు, ఆ తర్వాత మీ సమస్య ఏమిటో చెప్పాలని కోరతారు. అంతే.. ఇందులో ఇక కొత్తగా ఏమీ ఉండదు. కాల్ అటెండర్ మాట్లాడితే సీఎం జగన్ మాట్లాడినట్లేనా? ఇలాగే జనం నమ్మాలని సర్కారు కోరుకుంటోందా? ఫోన్‌లో సీఎం జగన్ మాట్లాడిన దానికి, స్పందన కాల్ ఆపరేటర్ మాట్లాడిన దానికి తేడా లేదా? ఈ మాత్రం దానికి ఈ డ్రామా ఎందుకు? అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ మాట్లాడుతారు కదా.. సమస్యకు పరిష్కారం ఉంటుందని భ్రమ పడితే అంతే సంగతేనంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
అయ్యే పనేనా..!
ఈ మధ్య ఏపీలో కురిసిన వర్షాలకు గోదావరి జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. ధాన్యం తడిసిందని కొందరు రైతులు.. చేతికొచ్చిన పంట మొత్తం వానపాలైందని మరికొందరు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ‘నేనున్నాను’ అంటూ రైతన్నలకు న్యాయం చేయాలని ముందుకొచ్చారు. అయితే సీఎం జగన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు. ఇక పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. అయ్యా మంత్రిగారు.. తాము పండించిన ధాన్యం మొలకలొచ్చాయని కారుమూరికి చెప్పడంతో ‘ఎర్రిపప్ప మొలకలొస్తే నేనేం చేస్తాను..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎర్రిపప్ప అంటే బూతు కాదని ‘బుజ్జి నాన్న’ అని వివరణ ఇచ్చుకున్న పరిస్థితి. మంత్రి స్థాయిలో ఉండే వ్యక్తికి.. అది కూడా డైరెక్టుగా రైతన్నే వచ్చి మొత్తుకుంటే బూతులు తిట్టిన పరిస్థితి.. అలాంటిది ఇక ఇదిగో ఫలానా సమస్య ఉందని ‘జగనన్నకు చెబుదాం’ అని 1902కు ఫోన్ చేస్తే అయ్యే పనేనా..? అనేది వైసీపీకే తెలియాల్సి ఉంది. ఇదొక్కటే కాదు.. సచివాలయం చుట్టూ తిరిగినా, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా తమ సమస్యలకు పరిష్కారం దొరకట్లేదని రోజుకు వేలాది మంది సోషల్ మీడియా వేదికగా మొత్తుకుంటూనే ఉన్నారు. డైరెక్టుగా తిరిగితేనే జరగని పనులు ఫోన్లు చేస్తే అయిపోతాయంటే జనాలు ఎలా నమ్మగలరు..? ఇంకా జనాల చెవుల్లో ఎందుకు పూలు పెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారో అర్థం కావట్లేదని ప్రతిపక్షలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుంచి కీలక నేతలు స్పందించి స్ట్రాంగ్ కౌంటర్లే ఇచ్చారు.
మొత్తానికి చూస్తే.. ఎన్నికలు ఏడాది దూరంలో ఉండగా ‘జగనన్నకు చెబుదాం’ అంటూ జగన్ ఏదో హడావుడి చేస్తున్నారు కానీ పాత విషయాలన్నీ జనాలు మరిచిపోరని.. అన్నీ గుర్తుండే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇవన్నీ కాదు.. అసలు ఇన్నాళ్లు ‘స్పందన’ పేరుతో ప్రభుత్వం చేసిందేంటి..? అనే ప్రశ్నలు కూడా జనాల నుంచి వస్తున్నాయి. ఇన్ని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
Nellore Politics : నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామం.. టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యేకు లైన్ క్లియర్..!
******************************
Telangana Election 2023 : రేవంత్ మాస్టర్ ప్లాన్.. ప్రియాంక పర్యటన ముగిసిన గంటల వ్యవధిలోనే.. ఇదేగానీ జరిగితే..!!
******************************
Updated Date - 2023-05-09T20:22:34+05:30 IST