BRS AIMIM: కారు-పతంగ్.. దోస్తా? కటీఫా?
ABN, First Publish Date - 2023-02-06T18:18:54+05:30
నిన్నమొన్నటి వరకు ‘దోస్త్ మేరా దోస్త్’ అన్నట్లుగా సాగిన బీఆర్ఎస్ (BRS), మజ్లిస్ పార్టీల ఐక్యత.. ఒక్కసారిగా మారిపోవడానికి కారణమేంటి? నిజంగానే మజ్లిస్ అన్నంత పని చేయనుందా? అందుకు తగ్గట్లుగా గ్రౌండ్ లెవెల్‌లో హోంవర్క్ పూర్తి చేసిందా?..
‘‘ఏడుగురు సభ్యులున్న పార్టీకి గంటలకు గంటలు మాట్లాడే టైమిస్తే ఎలా? మా పార్టీకి 105 మంది సభ్యులున్నారు’’ – ఇదీ అసెంబ్లీలో (Assembly session) మజ్లిస్ పార్టీని (AIMIM ) ఉద్దేశించి రాష్ట్ర మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్య. ‘‘వచ్చే ఎన్నికల్లో 50 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తాం..! కనీసం 15 స్థానాల్లో విజయం సాధిస్తాం. అప్పుడు అసెంబ్లీలో మా సంఖ్యా బలం పెరుగుతుంది’’ – ఇదీ.. కేటీఆర్ వ్యాఖ్యకు కౌంటర్‌గా మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) ఉద్వేగంగా అన్నమాటలు..! ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. నిన్నమొన్నటి వరకు ‘దోస్త్ మేరా దోస్త్’ అన్నట్లుగా సాగిన బీఆర్ఎస్ (BRS), మజ్లిస్ పార్టీల ఐక్యత.. ఒక్కసారిగా మారిపోవడానికి కారణమేంటి? నిజంగానే మజ్లిస్ అన్నంత పని చేయనుందా? అందుకు తగ్గట్లుగా గ్రౌండ్ లెవెల్‌లో హోంవర్క్ పూర్తి చేసిందా?
తెలంగాణకు వ్యతిరేకం.. అయినా దోస్తీ ఎలా?
తెలంగాణ ఉద్యమ (Telangana movement) సమయంలో మజ్లిస్ తన వైఖరిని విస్పష్టంగా చెప్పేసింది. తాము సమైక్యవాదానికి కట్టుబడి ఉంటామని ప్రకటించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక (Sri krishna committee report) వచ్చాక.. సమైక్యంగా ఉండడం కుదరకపోతే.. రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాము మొగ్గుచూపుతామని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. అలా ప్రత్యేక తెలంగాణ సాధనను వ్యతిరేకించిన మజ్లిస్ పార్టీతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దోస్తీ కట్టడానికి కారణమేంటి? ఈ ప్రశ్నకు స్వయంగా సీఎం కేసీఆర్ ఓ ప్రెస్‌మీట్‌లో బదులిచ్చారు. ‘‘తెలంగాణను సాధించుకున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ, అంతలోనే మాపై(ప్రభుత్వంపై) కుట్రలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని కూల్చివేసే వ్యూహాలు మొదలయ్యాయి. ఇంత కష్టపడి, అమరుల త్యాగాలతో సాధించిన తెలంగాణను మళ్లీ వలసవాదులు తమ గుప్పిట్లోకి తీసుకోవాలనుకుంటున్నారని బాధపడుతున్న సమయంలో ఢిల్లీ నుంచి అసదుద్దీన్ (Asaduddin Owaisi) ఫోన్ చేశారు. కేసీఆర్ (KCR) సాబ్.. మీ ప్రభుత్వానికి ఢోకాలేదు. మా ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు మీకుంటుందని అన్నారు. ప్రభుత్వానికి అండగా నిలిచారు. అలాంటి పార్టీ మాకు నిజంగా మిత్రపక్షమే’’ అని కేసీఆర్ ఆ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. అప్పటి నుంచి ఇరుపార్టీలు ఒక అండర్‌స్టాండింగ్‌తో ముందుకు సాగాయి. 2018 ఎన్నికల్లో కూడా బయటకు కలిసినట్లు లేకున్నా.. కొన్ని నియోజకవర్గాల్లో స్నేహపూర్వక పోటీగా అభ్యర్థులను బరిలోకి దింపాయి.
బీఆర్ఎస్ అయ్యాక పక్కనపెట్టారా?
తొలుత ఉద్యమ పార్టీగా ప్రస్తానాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్.. ఆ తర్వాత రాజకీయ పార్టీగా అధికారంలోకి వచ్చింది. జాతీయ స్థాయిలో ‘అబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్’ అనే నినాదంతో బీఆర్ఎస్‌గా ఆవిర్భవించింది. ఢిల్లీలో జరిగిన పార్టీ ఆవిరాభవ సభకు గానీ, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి గానీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు, తెలంగాణ అసెంబ్లీలో మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీకి పిలుపందలేదు. జాతీయ స్థాయిలో పలువురు నేతలు హాజరైనా.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నా.. మజ్లిస్ జాడ లేదు. ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభకు కూడా.. కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రభృతులు హాజరయ్యారు. కానీ, పతంగ్ పార్టీ మజ్లిస్‌కు పిలుపందలేదు. దాంతో.. పతంగ్-కారు మధ్య గ్యాప్ పెరిగిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా అసెంబ్లీలో అక్బరుద్దీన్ వర్సెస్ కేటీఆర్‌గా సాగిన వాగ్వాదం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
మజ్లిస్ ధైర్యమేంటి?
ఇంతకాలం హైదరాబాద్ పాతనగరంలోని ఏడు నియోజకవర్గాలకే పరిమితమైన మజ్లిస్ పార్టీ.. 50 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామనడానికి కారణమేంటి? ఈ ప్రశ్నకు మజ్లిస్ భారీగానే కసరత్తు చేసి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా మజ్లిస్ ఏ పనిచేసినా.. గ్రౌండ్ లెవెల్‌లో పక్కాగా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంది. అంతా సవ్యంగా ఉంటేనే.. రంగంలోకి దిగుతుంది. ఉదాహరణకు.. ఒకప్పుడు బీజేపీకి కంచుకోటగా ఉన్న కార్వాన్‌లో.. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆసిఫ్‌నగర్‌లో(ప్రస్తుతం నాంపల్లి నియోజకవర్గం) పాగా వేయడానికి ముందు కూడా ఓటు బ్యాంకు మొదలు.. అన్ని అంశాలను బేరీజు వేసుకున్నాకే రంగంలోకి దిగింది. అప్పట్లో కార్వాన్ నుంచి సయ్యద్ సజ్జాద్, ఆసిఫ్‌నగర్ నుంచి మౌజంఖాన్ విజయం సాధించారు. ఆ తర్వాతే.. మజ్లిస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించిన అసదుద్దీన్.. మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఎన్నికల బరిలోనూ తమ పార్టీని నిలిపారు. మహారాష్ట్ర, బిహార్‌లో పలుచోట్ల విజయం సాధించగా.. ఉత్తరప్రదేశ్‌లో ప్రతిసారి ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ వచ్చింది. ఇతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ హవా చాటుతోంది. ఇక తాజాగా అక్బరుద్దీన్ చేసిన 50 స్థానాల్లో పోటీ విషయానికి వస్తే.. ఇప్పటికే పాతనగరంలోని ఏడు స్థానాల్లో మజ్లిస్ శాసనసభ్యులు ఉండగా.. ముందు నుంచి రాజేంద్రనగర్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో తమ క్యాడర్‌ను పెంచుకుంటూ వచ్చింది. జూబ్లీహిల్స్‌లోనూ మజ్లిస్ ఓటుబ్యాంకు ఉంది. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌తోపాటు.. ఓటుబ్యాంకు అధికంగా ఉన్న నిర్మల్, ముథోల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖానాపూర్, కామారెడ్డి, బోధన్, కరీంనగర్, జగిత్యాల, వరంగల్ తూర్పు, మహబూబ్‌నగర్, ఖమ్మం వంటి స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ మజ్లిస్ 50 స్థానాల్లో పోటీ చేస్తే.. లాభం ఎవరికి? నష్టం ఎవరికి? అనే ప్రశ్నకు విశ్లేషకులు మజ్లిస్‌కే లాభం ఉంటుందని, నష్టపోయేది బీఆర్ఎస్ అని చెబుతున్నారు. ప్రస్తుతం మజ్లిస్ ఓటుబ్యాంకు ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు మద్దతునిస్తోంది. ఒకవేళ మజ్లిస్ ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తే.. బీఆర్ఎస్ ఓట్లు చీలిపోయి.. మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని.. తెలంగాణలో పాగా కోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి ఇది కలిసి వచ్చే అంశమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో కేటీఆర్‌కు ఘాటుగా సమాధానాలిచ్చినా.. అక్బరుద్దీన్ ఓ మాటను చెప్పారు. ‘‘మేము 15 స్థానాలను గెలుచుకున్నా.. మా మద్దతు బీఆర్ఎస్‌కే. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములమవుతాం’’ అని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి.. మజ్లిస్ మద్దతు బీఆర్ఎస్‌కేనని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపించేలోగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి, ఈ విభేదాలు సమసిపోయేలా చేస్తారని తెలుస్తోంది.
Updated Date - 2023-02-06T18:20:38+05:30 IST