Bandi Sanjay: బండి ఒకవైపు.. సీనియర్లు మరోవైపు..ఎలక్షన్ టీమ్‌లో ఎవరెవరికి చోటు ఇవ్వనున్నారు..!?
ABN, First Publish Date - 2023-02-28T12:24:13+05:30
తెలంగాణలో ఎన్నికల వేళ బీజేపీ అధ్యక్షుడి మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చుతారన్న..
బీజేపీ ఎన్నికల రథసారథిగా బండి సంజయ్‌ను అనధికారికంగా ప్రకటించేశారు. నేడో రేపో అధికారిక ప్రకటన రానుంది. అయితే.. బీజేపీ అధ్యక్షుడికి ఎన్నికల ముందు అనేక సవాళ్ళు ఎదురుకానున్నాయి. అధినాయకత్వం సరే.. పార్టీలోని సీనియర్లు బండికి సహకరిస్తారా?.. రేవంత్ మాదిరి బండి సంజయ్‌కు ఒంటరి పోరాటం తప్పదా?.. సీనియర్లను దారిలోకి తెచ్చుకొనేందుకు ఆయన ఏం చేయబోతున్నారు?.. బండి సంజయ్ ఎలక్షన్ టీంలో ఎవరెవరికి చోటు దక్కనుంది?...అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
అధ్యక్షుడి కొనసాగింపుపై త్వరలో క్లారిటీ
తెలంగాణలో ఎన్నికల వేళ బీజేపీ అధ్యక్షుడి మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చుతారన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. అయితే.. ఆ ఊహాగానాలకు బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ తెర దించేశారు. ఎన్నికల ఏడాది కావడంతో మార్పు మంచిది కాదన్న అభిప్రాయానికి బీజేపీ వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న బీజేపీ.. వచ్చే ఎన్నికలను బండి నాయకత్వంలోనే ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు ఆ పార్టీలో టాక్ వినిపిస్తోంది. అధ్యక్షుడి కొనసాగింపు అంశంపై అధిష్టానం త్వరలోనే క్లారిటీ ఇవ్వనుండగా.. తరుణ్ చుగ్ మాత్రం అనధికారికంగా ప్రకటించేశారు.
2024 వరకు సంజయ్ కొనసాగుతారని కామెంట్స్
వాస్తవానికి.. బీజేపీలో అధ్యక్షుడి కాలపరిమితి మూడేళ్లు. అది పూర్తైన తర్వాత రెండోసారి కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు.. మార్చి 11తో బండి సంజయ్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తికానుంది. ఆయనకంటే ముందు.. అధ్యక్షుడిగా పనిచేసిన లక్ష్మణ్ మూడేళ్ళు పనిచేయగా.. అంతకుముందు కిషన్‌రెడ్డి రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే.. ప్రస్తుతం బండి టర్మ్ పూర్తి కానుండగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్చితే ఇబ్బందులు తప్పవని అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో.. 2024 వరకు సంజయే కొనసాగుతారని తరుణ్ చుగ్ కామెంట్స్ చేయడంతో బీజేపీ క్యాడర్‌లో జోష్ నెలకొంది. బండి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తేనే బీజేపీకి మంచిదన్న అభిప్రాయం క్యాడర్‌లోనూ ఉంది. పాతాళంలో ఉన్న పార్టీని బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ స్థాయికి తీసుకొచ్చిన సంజయ్ అయితేనే.. గెలుపు ఈజీ అవుతుందని బీజేపీలోని మెజారిటీ నేతలు చెప్పుకొస్తున్నారు.
సీనియర్ల నుంచి ఎలాంటి సహకారం అందుతుంది?
ఇదిలావుంటే.. ఎన్నికల వేళ బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకోనున్న బండి సంజయ్‌కు అనేక సమస్యలు సవాళ్ళు విసురుతున్నాయి. ముఖ్యంగా.. బండి ఒకవైపు.. సీనియర్లు మరోవైపు అనేలా పరిస్థితులున్నాయి. ఆ నేపథ్యంలో అందర్నీ కలుపుకుని ఎన్నికలకు సిద్ధం కావడం అతిపెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, వివేక్ లాంటి నేతలు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఇతర సీనియర్ల నుంచి ఎలాంటి సహకారం అందుతుందనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవేళ సీనియర్లు సహకరించకపోతే.. రేవంత్‌రెడ్డి మాదిరిగా బండి కూడా ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది. అయితే.. మోదీ, అమిత్ షా ఆశీస్సులు పుష్కలంగా ఉండడం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఆ లెక్కన.. 2024 వరకు ఆయన్నే అధ్యక్షుడిగా కొనసాగించనున్నారు. దానికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.
పాదయాత్రతో బీజేపీలో కొత్త అధ్యాయానికి శ్రీకారం
ఇక.. పట్టణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన బీజేపీని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని సంప్రదాయాన్ని తెరపైకి తీసుకొచ్చి పాదయాత్రతో బీజేపీలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేలా చేశారు. ఆయా పరిణామాలన్నీ రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగించేలా చేస్తున్నాయి. బండి నాయకత్వంలో పార్టీ బలోపేతం అయ్యాక.. లీడర్ షిప్ కూడా పెరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి చేరికలు ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బీజేపీలో చేరాక.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. అయితే.. తెలంగాణ ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజల మద్దతు ఉండడంతో బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఈటల సైతం తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్లానులు ఎలా ఉంటాయో తెలుసని, అధ్యక్ష బాధ్యతలిస్తే బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని హైకమాండ్‌కు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఈటల అదే అంశాన్ని ప్రస్తావించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే.. అధ్యక్షుడి మార్పు లేకపోవడంతో ఈటలకు పార్టీ పదవి వచ్చే అవకాశం ఉంది. అందులోనూ.. ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇస్తారన్న చర్చ సాగుతోంది.
ఎలక్షన్ టీమ్‌లో ఎవరెవరికి చోటు దక్కుతుందో?
మరోవైపు.. అధ్యక్షుడిగా కొనసాగింపు ప్రకటన అధికారికంగా రాగానే మరింత దూకుడు పెంచాలని బండి సంజయ్ భావిస్తున్నారు. దానిలోభాగంగా.. మరోసారి పాదయాత్రలతో ప్రజలకు చేరువ కావాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే.. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌తోపాటు, బూత్ స్వశక్తీకరణ్ అభియాన్‌పై బీజేపీ దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలోనే.. మార్చి రెండో వారం తర్వాత బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనా బండి సంజయ్ ఫోకస్ పెట్టనున్నారు. ముఖ్యంగా.. ఎలక్షన్ టీమ్‌ను సిద్ధం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. అయితే.. బండి సంజయ్ ఎలక్షన్ టీమ్‌లో ఎవరెవరికి చోటు దక్కుతోందన్న చర్చ బీజేపీలో ఆసక్తికరంగా మారింది.
మొత్తంగా... తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. కమలం పార్టీలో ఫుల్ జోష్ నింపిన బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా కంటిన్యూ చేయబోతోంది. అధికారిక ప్రకటన తర్వాత ఆయన కూడా స్పీడ్ పెంచాలని చూస్తున్నారు. అయితే.. కీలక నేతలు, సీనియర్లు ఏ మేరకు కోఆపరేట్ చేస్తారన్నది సస్పెన్స్‌గా మారుతోంది.
Updated Date - 2023-02-28T12:24:13+05:30 IST