ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఈ పిళ్లైకి పెద్ద బ్యాక్‌గ్రౌండే ఉందిగా..!

ABN, First Publish Date - 2023-03-07T16:34:00+05:30

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులను అదుపులోకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam Case) తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED) తాజాగా మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని (Arun Ramachandra Pillai) ఈడీ మంగళవారం నాడు అదుపులోకి తీసుకుంది. లిక్కర్ స్కామ్‌లో అవకతవకలపై అరుణ్‌ రామచంద్ర పిళ్లైను ఇటీవల రెండు రోజుల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర పిళ్లై అరెస్ట్‌తో లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో (Money Laundering Case) అరెస్టుల సంఖ్య 10కి చేరింది. అసలు ఇంతకీ.. ఈ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ వ్యాపారవేత్తపై ఉన్న ప్రధాన అభియోగం సంగతేంటి..? తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవితకు బంధువుల బ్యూటీపార్లర్‌కు, ఈ వ్యాపారవేత్తకు ఉన్న సంబంధం ఏమిటి..? ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ని కోట్ల ముడుపులు చెల్లించారని పిళ్లైపై అభియోగాలున్నాయి..? అరుణ్ రామచంద్ర పిళ్లై వ్యాపారాలు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పిళ్లై పాత్రపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మొదటి నుంచి ఈ అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు తరచుగా వినిపిస్తూనే ఉంది. మాగుంట శ్రీనివాసుల రెడ్డి, రాఘవ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, అరబిందో శరత్‌చంద్రారెడ్డిలతో కూడిన సౌత్‌ గ్రూప్‌ (South Group) ద్వారా రూ.100 కోట్ల ముడుపులను ఆప్‌ నేతల తరఫున విజయ్‌నాయర్‌ స్వీకరించారనేది ఈడీ ప్రధాన అభియోగం. ఈ గ్రూప్‌నకు ప్రాతినిధ్యం వహించిన వారిలో అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఒకరని ఈడీ ఆధారాలతో సహా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఇప్పటికే సమర్పించింది. సౌత్‌ గ్రూప్‌ భాగస్వాములు ఆప్‌ నేతలతో కలిసి కుట్రకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఈడీ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ అరుణ్ రామచంద్ర పిళ్లై మద్యం తయారీ కంపెనీ ఇండోస్పిరిట్స్ (Indospirits) సంస్థకు అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. ఈ కంపెనీలో 32.5 శాతం షేర్ పిళ్లైదే కావడం గమనార్హం. హైదరాబాద్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త మనీ లాండరింగ్‌కు పాల్పడి ప్రజాప్రతినిధులకు ఢిల్లీలో లిక్కర్ లైసెన్సుల విషయంలో అక్రమ మార్గంలో మేలు చేశాడనేది పిళ్లైపై ఉన్న ప్రధాన అభియోగం. సీబీఐ చెబుతున్న ప్రకారం.. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి ‘ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22’ని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో కూడా పిళ్లై కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

సీబీఐ సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన రాబిన్ డిస్టిలరిస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు పిళ్లై డైరెక్టర్‌గా ఉన్నారు. ఏప్రిల్ 22, 2022న స్థాపించిన ఈ కంపెనీకి ప్రేంసాగర్ గండ్రా మరో డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఢిల్లీలో ఉన్న, సమీర్ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్‌‌తో రాబిన్ డిస్టిలరిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధాలున్నాయి. ఢిల్లీలో ఉన్న ‘Only Touch Louder’ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి ఈ మహేంద్రు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించిన విజయ్ నాయర్ ఓనర్లు కావడం గమనార్హం. మహేంద్రుకు, విజయ్ నాయర్‌కు మధ్య మధ్యవర్తిగా పిళ్లై వ్యవహరించినట్లు సీబీఐ చెబుతోంది. రామచంద్ర పిళ్లై హైదరాబాద్‌, బెంగళూరు నివాసాల తనిఖీ అనంతరం సీబీఐ వర్గాలు చెప్పిందేంటంటే.. విజయ్ నాయర్‌కు పిళ్లై కోట్ల రూపాయల ముడుపులు చెల్లించేవాడని.. ఆ తర్వాత ఆ డబ్బును ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు లంచాల రూపంలో విజయ్ నాయర్ చేరవేసేవారని సీబీఐ పేర్కొంది. జులై 17, 2022న రామచంద్ర పిళ్లై‌తో పాటు 13 మందిపై ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసు నమోదైంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. పిళ్లై ముడుపులు చెల్లించే సొమ్ము ఎక్కడ నుంచో వచ్చేది కాదట. మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్స్ సంస్థ ద్వారా వచ్చిన డబ్బును విజయ్ నాయర్‌కు రామచంద్ర పిళ్లై పంపేవాడని సీబీఐ స్పష్టం చేసింది.

ఈడీ చెబుతున్న వివరాల ప్రకారం.. ఇండోస్పిరిట్స్ కంపెనీ అక్రమంగా ఆర్జించిన రూ.69 కోట్ల డబ్బులో, రూ.29 కోట్లు పిళ్లై అకౌంట్స్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఈ డబ్బులో పిళ్లై ఒక టీవీ ఛానల్ అధినేతకు రూ.4.75 కోట్లు, రూ.3.85 కోట్లను అభిషేక్ బోయిన‌పల్లి అకౌంట్‌కు పేమెంట్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. అభిషేక్ బోయిన‌పల్లి కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడే కావడం గమనార్హం. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. అరుణ్ రామచంద్ర పిళ్లైకు చెందిన రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి అడ్రస్.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువులకు చెందిన బ్యూటీపార్లర్ ఒకటే అడ్రస్‌తో ఉండటం కొసమెరుపు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై‌ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ‘‘బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధినంటూ అరుణ్ రామచంద్ర పిళ్ళై అంగీకరించారు... ఆయనను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వండి. కేసు దర్యాప్తుకు సహకరించడం లేదు. మనీ ట్రయల్స్ గుట్టు తేల్చడానికి కస్టడీ అవసరం. రూ.25 కోట్లు నేరుగా ట్రాన్స్ఫర్ చేశారు’’ అంటూ ఈడీ వాదనలు వినిపించింది. రామచంద్ర పిళ్లైకి రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ హైదరాబాద్ వ్యాపారవేత్త అరెస్ట్‌‌తో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ కావడం ఖాయమనే ప్రచారం మరోమారు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

Updated Date - 2023-03-07T16:35:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising