Guntur: తెనాలి ప్రజలకు జగన్ పై ఆగ్రహం పెరిగిందా..నీళ్లు, భోజనం, టాయిలెట్స్‌కు ఇబ్బందులు.. సభ ముగింపు వరకు వివాదాలే..!?
ABN, First Publish Date - 2023-03-06T13:27:36+05:30
గుంటూరు జిల్లా తెనాలిలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సభ వివాదాలతోనే ముగిసింది. రైతు భరోసా నిధులు విడుదల బటన్ నొక్కడం కోసం ఏర్పాటు
తెనాలిలో జగన్‌రెడ్డి సభ.. వైసీపీకి రివర్స్ అయిందా?.. జనాన్ని భారీగా తరలించినా.. సభ మాత్రం నిస్తేజం మిగిల్చిందా?.. తెనాలి ప్రజలకు ముఖ్యమంత్రిపై ఆగ్రహం పెరిగిందా?.. సీఎం సభ తర్వాత జనసేన శ్రేణుల్లో జోష్ ఎందుకు పెరిగింది?.. ఇంతకీ.. జగన్ సభ.. జనసేనలో జోష్ నింపడం ఏంటి?.. అసలు.. జగన్‌రెడ్డి తెనాలి సభపై రాజకీయవర్గాల్లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
తెనాలి సభ కోసం ముందు నుంచే ప్రణాళికలు
గుంటూరు జిల్లా తెనాలిలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సభ వివాదాలతోనే ముగిసింది. రైతు భరోసా నిధులు విడుదల బటన్ నొక్కడం కోసం ఏర్పాటు చేసిన సభలో.. అన్నదాతల ఊసేలేకుండా ప్రతిపక్షాలు, మీడియాని తిట్టడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. రైతు భరోసా పథకం కింద.. వారి ఖాతాల్లో నగదు జమ వేసే ప్రక్రియలో భాగంగా.. తెనాలిలో జగన్ సభ ఏర్పాటు చేశారు. నిజానికి.. ఆ సభ ప్రకటించినప్పటి నుంచి ముగింపు వరకు వివాదాలతోనే ముందుకు సాగింది. గతంలో నిర్వహించిన జగన్ సభలకు ప్రజలు స్వచ్చందంగా రాకపోవడం.. బలవంతంగా తీసుకువచ్చినా.. గోడలు దూకి మరీ పారిపోవడంతో వైసీపీ ప్రభుత్వంలో ఒకింత అసహనం నెలకొంది. ఈ సారి ఎలాగైనా తెనాలి సభలో అలా జరగకూడదని.. ముందు నుంచే పక్కా ప్రణాళికలు రచించారు.
ప్రజాప్రతినిధులకు టికెట్ ఉండదన్న సంకేతాలు
తెనాలి సభను విజయవంతం చేయకపోతే గుంటూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులకు టికెట్ ఉండదన్న సంకేతాలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో.. తెనాలిలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా ఐదు నియోజకవర్గాల ప్రజలను వందలాది బస్సుల్లో తరలించే కార్యక్రమం చేపట్టారు. జగన్ సభకు ప్రజలను తరలించడం కోసం జిల్లాస్థాయి అధికారులు కూడా రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఇంటింటి ప్రచారం చేపట్టి పథకాలు ఆపుతామని, రేషన్ కార్డు తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడి.. బలవంతంగా ప్రజలను తరలించారు. అయితే.. ఎలాగోలా సభకు వచ్చిన జనాన్ని.. నీళ్లు, భోజనం, టాయిలెట్స్‌కు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఇక.. తెనాలి సభలో రైతుల కోసం ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పడం కన్నా ప్రతిపక్షాలపై ఎక్కువ దృష్టి సారించారు. ఎప్పటిలాగే.. విపక్షాలపై విమర్శలు గుప్పించడంతో ముందు ఉన్న వైసీపీ నేతలు తప్ప వెనకున్న ప్రజలు ఎవరూ కనీసం చప్పట్లు కూడా కొట్టని పరిస్థితి సభలో కనపడింది. దాంతో.. గతంలో మాదిరిగానే.. సీఎం సభ ప్రారంభం కాకముందు నుంచే ప్రజలు బయటకు వెళ్లిపోయారు. పోలీసులు అడ్డుకున్నా, బ్యారికేడ్లు కట్టినా.. పోలీసులను నెట్టుకుంటూ.. గేట్లు, గోడలు దూకిన దృశ్యాలు సీఎం సభలో దర్శనమివ్వడం వైసీపీకి తలనొప్పిగా మారాయి.
మున్సిపాలిటీకి రూ.43 కోట్లు మాత్రమే ప్రకటన
ఇక.. అదంతా ఓ ఎత్తు అయితే.. సీఎం సభ ఏర్పాట్ల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సీఎం సభకు వెళ్తున్న జనరేటర్ ఢీకొని ఆటోలో వెళ్తున్న కూలీలు ఇద్దరు మృతి చెందగా.. మరికొంతమంది గాయాల పాలవ్వడం విమర్శలకు తావిచ్చింది. సీఎం సభ ఏర్పాట్లు కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో త్రీఫేస్ కరెంటు తీసేయడం, రోడ్లపై చెట్లు నరకడం, రోడ్లకు ఇరువైపులా బ్యారికేడ్లు కట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టడం, షాపులు మూయించడం లాంటి నిర్ణయాలతో సీఎం పర్యటన ఆద్యంతం వివాదాస్పదంగా మారింది. అలాగే.. మొక్కజొన్న పొత్తులకు వైసీపీ రంగులు వేసి తోరణాలు కట్టడం రైతులను ఆగ్రహానికి గురి చేసింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, కోట్లు ఖర్చు పెట్టి తెనాలి సభ ఏర్పాటు చేయగా.. మున్సిపాలిటీకి 43 కోట్లు మాత్రమే ప్రకటించడం పట్ల పట్టణ వాసుల ఫైర్ అవుతున్నారు.
అరుణాచలంలో దర్శనానికి వెళ్లినవారిని వెంబడించడం
ఇదిలావుంటే.. సీఎం సభకు అడ్డంకులు సృష్టిస్తారనే అనుమానంతో జనసేన, టీడీపీ నేతలను ముందురోజు నుంచే వెంబడించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేయడం వైసీపీ ప్రభుత్వంలో భయం కనిపించినట్లు అయింది. జనసేన నాయకుల్ని పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ.. జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు.. పార్టీ నేతలతో అంబేద్కర్ విగ్రహం దగ్గర గో బ్యాక్ సీఎం అంటూ నిరసన ప్రదర్శన చేసి అందరి దృష్టి ఆకర్షించారు. జనసేన నేతలు కొందరు అరుణాచలంలో దర్శనం చేసుకుంటున్నామని చెప్పినా వినకుండా అక్కడి నుంచి తెనాలి స్టేషన్‌కు వచ్చే వరకు పోలీసులు వెంటపడడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అలాగే.. నెమలి ఈకలతో తయారు చేసిన దండను స్థానిక వైసీపీ నేతలు జగన్‌కు వేయడంతో మరో వివాదం రేగింది. నెమలి ఈకలతో దండలు చేయడాన్ని జనసేన వెలుగులోకి తెచ్చింది. .
మొత్తంగా.. ఎన్నో సమస్యల మధ్య సీఎం సభ ముగిసినప్పటికీ.. జనసేనకు మాత్రం భారీ ప్రచారం లభించినట్లు అయింది. దాంతో.. సీఎం తెనాలి సభ.. జనసేన శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. ప్రధానంగా.. తెనాలి నుంచి పోటీ చేయాలనుకుంటున్న నాదెండ్ల మనోహర్‌కు.. మంచి హైప్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో తెనాలి పాలిటిక్స్ ఎవరికి ప్లస్ అవుతాయో చూడాలి మరి.
Updated Date - 2023-03-06T13:27:36+05:30 IST