Karnataka Election Results : హైదరాబాద్‌కు మారుతున్న కర్ణాటక రాజకీయాలు.. హోటల్స్ అన్నీ ఫుల్.. రేవంత్‌రెడ్డితో కీలక మంతనాలు
ABN, First Publish Date - 2023-05-13T10:55:37+05:30
కర్ణాటకలో ఓ వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే క్యాంప్ రాజకీయాలు షురూ అయ్యాయి. కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ తన హవాను కొనసాగిస్తోంది..
కర్ణాటకలో ఓ వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే క్యాంప్ రాజకీయాలు షురూ అయ్యాయి. కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ తన హవాను కొనసాగిస్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ సీట్లు 113ను దాటేసి గెలుపు దిశగా హస్తం పార్టీ దూసుకెళ్తుండటంతో కన్నడనాట రాజకీయాలు మారిపోతున్నాయి. దీంతో అటు బీజేపీ (BJP).. ఇటు కాంగ్రెస్ (Congress) పార్టీల పెద్దలు రంగంలోకి దిగి.. ఎక్కడా తమ నేతలు పక్క చూపులు చూడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక రాజకీయాలు (Karnataka Politics) పూర్తిగా హైదరాబాద్‌కు (Hyderabad) మారిపోయాయి. ప్లాన్-ఏ (Plan-A) వర్కవుట్ కాకపోయినా.. ప్లాన్-బి (Plan-B) కచ్చితంగా అమలు చేయాలని బీజేపీ భావిస్తోందని ముందుగానే పసిగట్టిన కాంగ్రెస్ ఏ ఒక్కరూ చేజారిపోకుండా ప్లాన్ చేస్తోంది.
అన్నీ బుకింగ్..!
బీజేపీ కచ్చితంగా క్యాంప్ రాజకీయాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత డీకే శివకుమార్ (DK Shiva Kumar) రంగంలోకి దిగిపోయారు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్ (Famous Hotels In Hyderabad) అన్నీ బుకింగ్ అయిపోయాయి. ఈ వ్యవహారమంతా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చూసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పెద్ద పెద్ద హోటల్స్‌లోని రూమ్‌లు అన్నీ బల్క్‌గానే రేవంత్ బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక వ్యక్తుల పేరిట తాజ్ కృష్ణలో 18, పార్క్ హయత్‌లో 20, నోవేటల్ హోటల్‌లో 20 రూములు బుకింగ్ అయ్యాయి. వీటితో పాటు మరిన్ని హోటల్స్‌లో బల్క్ బుకింగ్స్ అయ్యాయి. ఈ హోటళ్లన్నీ కర్ణాటక, హైదరాబాద్‌కు సంబంధించిన ప్రముఖుల పేర్లతోనే శుక్రవారం నాడే బుక్ చేశారు. ఎన్నికల ఫలితాలను బట్టి ఎమ్మెల్యేలను ఈ హోటళ్లకు కాంగ్రెస్ పెద్దలు తరలిస్తారని తెలుస్తోంది. అయితే.. ఎవరికోసం బుక్ చేశారు..? ఏ పార్టీ వారు బుక్ చేశారు..? అనే విషయాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి.
అన్నీ దగ్గరుండి..!
కర్ణాటకలో గెలవాల్సిందే.. సీఎం సీటుపై కూర్చోవాల్సిందే అన్నట్లుగా మొదట్నుంచీ డీకే శివకుమార్ అహర్నిశలు కష్టపడుతూ వస్తున్నారు. రెండు, మూడు గంటల్లో పార్టీల భవితవ్యం తేలిపోనుండటంతో డీకే అలర్ట్ అయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ చేజారిపోకుండా ఉండటానికి.. గెలిచినట్లు తెలియగానే ఇక్కడ్నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించేయాలన్నది డీకే ప్లాన్. భాగ్యనగరానికి తరలించిన తర్వాత అన్నీ రేవంత్ రెడ్డి దగ్గరుండి చూసుకోవాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు రేవంత్‌తో డీకే టచ్‌లో ఉంటూ మంతనాలు జరుపుతున్నారు. వాస్తవానికి ఇలా ఎన్నికల టైమ్‌లో హైదరాబాద్‌కు కర్ణాటక, మహారాష్ట్ర ఎమ్మెల్యేలలను తరలించడం కొత్త విషయమేమీ కాదు కానీ.. ఈ ఫలితాల తర్వాత దేశంలో సీన్ మొత్తం మారిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
చాన్స్ ఇవ్వకుండా..!
కర్ణాటక ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే మొదట కన్నడనాట గెలిచి కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాలని ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పెద్దలు. బీజేపీకి ఏమాత్రం చాన్స్ ఇవ్వకూడదని ఇందుకు ఏ ఒక్క చిన్న అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం కచ్చితంగా గెలుస్తామని ధీమాతోనే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు వెనుకంజలో ఉండటంతో కాంగ్రెస్‌కు మరింత కిక్ ఇచ్చినట్లయ్యింది. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహం వచ్చింది.
మొత్తానికి చూస్తే.. కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు రాజకీయాలు మారిపోతున్నాయ్. ఎమ్మెల్యేల తరలింపులో ఎవరు సక్సెస్ అవుతారో.. ఎవరు ఎటువైపు మొగ్గుచూపుతారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.
Updated Date - 2023-05-13T11:01:35+05:30 IST