BTech Ravi Arrest : బీటెక్ రవి అరెస్ట్ వెనుక ఏం జరిగింది.. పోలీసుల అధికారిక ప్రకటన
ABN, First Publish Date - 2023-11-14T23:33:14+05:30
BTech Ravi Arrest Issue : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులంతా మప్టీలో ఉండటంతో వారంతా పోలీసులేనా.. లేకుంటే గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారా..? అని కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. రవి అరెస్టును పోలీసులు అధికారికంగా నిర్ధారించారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులంతా మప్టీలో ఉండటంతో వారంతా పోలీసులేనా.. లేకుంటే గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారా..? అని కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. రవి అరెస్టును పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. మొదట వల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు అక్కడ్నుంచి కడప రిమ్స్‌కు తరలించారు. అయితే రవి విషయంలో అసలు ఏం జరిగింది..? అనే విషయాలను కడప జిల్లా డీఎస్పీ షరీప్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
ఇందుకే అరెస్ట్..?
‘పది నెలలు కిందట కడప విమానాశ్రయం దగ్గర ఆందోళన చేసినందుకు బీటెక్ రవిని అరెస్ట్ చేశాం. తోపులాటలో మా ఏఎస్ఐకి గాయాలయ్యాయి. దానిపైన విచారణ చేసి ఇప్పు డు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం. 10 నెలలుగా రవి అందుబాటులో లేరు. అందుకే ఇప్పుడు అన్ని పరిశీలించి అరెస్ట్ చేయాల్సి వచ్చింది’ అని డీఎస్పీ షరీప్ మీడియాకు వివరించారు. అయితే.. 10 నెలల విషయం ఇప్పుడు ఎందుకు బయటికి తీసినట్లు..? అసలు కడప జిల్లాలో ఏం జరుగుతోంది..? ఉమ్మడి కడప జిల్లాలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడుతున్న రవిని ఈ టైమ్‌లోనే ఎందుకు చేయాల్సి వచ్చింది..? అని జిల్లా టీడీపీ శ్రేణులు కన్నెర్రజేస్తున్నాయి. మరోవైపు.. రవిని పోలీసులే కిడ్నాప్ చేశారని, అతనికి ఏం జరిగినా సీఎం జగన్, పోలీసులదే బాధ్యత అని ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఎందుకింత భయం..?
బీటెక్ రవి అరెస్ట్‌పై యువనేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘పుట్టిన ఊరు, గెలిచిన నియోజకవర్గం అయిన పులివెందుల వెళ్లాల్సి వచ్చినా జగన్ రెడ్డి గజగజా వణుకుతున్నాడు. పరదాలు, బారికేడ్లు, ముందస్తు అరెస్టులు, దుకాణాల మూసివేత, చెట్ల నరికివేత ఇన్ని చేసినా ఓట్లేసిన జనంని చూడాలంటే జగన్ రెడ్డికి భయం. సొంత నియోజకవర్గ ప్రజల్ని ఎదుర్కోలేని పిరికి పంద జగన్. తన ఎన్నికల ప్రత్యర్థి, టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవిని చూసినా భయపడుతున్నాడు. రాజకీయ కక్షసాధింపుకి పోలీసుల్ని పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నాడు. రవి అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయనకి ఏం జరిగినా జగన్, పోలీసులదే బాధ్యత’ అని లోకేష్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
BTech Ravi : బీటెక్ రవి ఏమయ్యారు.. అసలేం జరిగింది.. పూర్తి వివరాలివే..!?
Updated Date - 2023-11-15T08:39:26+05:30 IST