MIM: ఎంఐఎం పోటీలో ఉండే 50 స్థానాలివే?
ABN, First Publish Date - 2023-02-07T16:47:27+05:30
భాయి... భాయిగా ఉన్న కేసీఆర్- ఓవైసీ సోదరుల మధ్య గ్యాప్ వచ్చిందా? ఇన్నాళ్లు పాతబస్తీకే పరిమితం అయిన మజ్లిస్ పార్టీ తెలంగాణ జిల్లాల్లోనూ ఎందుకు ఫోకస్ పెంచింది...? 50 స్థానాల్లో..
భాయి... భాయిగా ఉన్న కేసీఆర్- ఓవైసీ సోదరుల (KCR Owaisi) మధ్య గ్యాప్ వచ్చిందా? ఇన్నాళ్లు పాతబస్తీకే పరిమితం అయిన మజ్లిస్ పార్టీ (MIM) తెలంగాణ జిల్లాల్లోనూ ఎందుకు ఫోకస్ పెంచింది...? 50 స్థానాల్లో పోటీ చేస్తాం... 15మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వస్తాం అన్న అక్బర్ వ్యాఖ్యల్లో ఆవేశం కన్నా అసలు ఉద్దేశం వేరే ఉందా...?
ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో (Telangana Politics) చర్చనీయాంశంగా మారాయి. ఎప్పుడు అసెంబ్లీ జరిగినా అక్బరుద్దీన్ వర్సెస్ కేటీఆర్ (Akbaruddin vs KTR) సీన్ కనపడుతూనే ఉంటుంది. కానీ ఆ తర్వాత మళ్లీ అంతా ఒక్కటే. కేటీఆర్‌కు మాటకు మాట జవాబు చెప్పిన అక్బర్ సైతం మేం బీఆర్ఎస్‌తోనే (BRS) ప్రయాణిస్తాం అని కూడా చెప్పేశాడు. ఇదంతా బాగానే ఉన్నా కనీసం 15మంది ఎమ్మెల్యేలతో మజ్లిస్ అసెంబ్లీలోకి అడుగుపెడుతుందన్న వ్యాఖ్యలే ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి.
నిజానికి ఇది అక్బరుద్దీన్ ఆవేశంగా అన్న మాటలు కావు. దారుసలేంలో మజ్లిస్ విస్తరణకు చాలా రోజులుగా ప్రణాళికలు జరుగుతూనే ఉన్నాయి. మజ్లిస్ కు పట్టున్న ప్రాంతాలేవీ? ఏయే స్థానాల్లో పోటీ చేయవచ్చు... అక్కడ సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయన్న వడపోత చాలా రోజులుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ వడపోత తర్వాతే ఇప్పుడున్న 7 స్థానాలకు అదనంగా మరో 8 గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఓవైసీ బ్రదర్స్ లెక్క తేల్చారు.
మజ్లిస్ ఎక్కడ పోటీ చేసినా ముస్లీం సామాజిక వర్గ ఓట్లు ప్రధానంగా చూసుకుంటుంది. వారు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్న చోట, అదనంగా ఎస్సీ-ఎస్టీ సామాజిక వర్గ ఓట్లు పొలరైజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ముస్లీం నేతలకే కాకుండా ఇతర మతాల లీడర్లకు కూడా టికెట్ ఇచ్చి పోటీ చేయించాలని, గెలిచే అవకాశం ఉన్న నేతలను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అలా ఐడెంటిఫై చేసిన స్థానాల్లో... గతంలో నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఎంఐఎం 23.5శాతం ఓట్లు తెచ్చుకుంది. అక్కడ గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థికి 31శాతం ఓట్లే వచ్చాయి. రాజేందర్ నగర్, అంబర్ పేట వంటి స్థానాల్లోనూ ఎంఐఎం బలంగానే ఉంది. వీటికి తోడు... కరీంనగర్, ఖమ్మం, సంగారెడ్డి, నిర్మల్, ముథోల్, అదిలాబాద్, బోధన్, కామారెడ్డి, సిర్పూర్, కోరుట్ల, భువనగిరి, వరంగల్ ఈస్ట్, మహబూబ్ నగర్, జహీరాబాద్, షాద్ నగర్, వికారాబాద్ స్థానాల్లో తమ గెలుపుకు అవకాశం ఉందని తేలిందని తెలుస్తోంది. ఈ స్థానాలపై ఇప్పటికే ఫోకస్ పెట్టిన ఎంఐఎం పని ప్రారంభించిందని, ఆ ఆలోచనతోనే కనీసం 15మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వస్తాం... 7 సీట్ల పార్టీ కామెంట్‌కు జవాబు చెప్తాం అని అక్బర్ ఎదురుదాడి చేసినట్లు తెలుస్తోంది.
ఎంత తిట్టుకున్నా మా పార్టీలు ఒక్కటే అని ఇటు కేసీఆర్, అటు ఓవైసీ బ్రదర్స్ చెప్పుకుంటున్నారు. కానీ, పాతబస్తీ మినహా ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయటం ద్వారా ఎంఐఎం గెలుపు అవకాశాలు ఎలా ఉన్నా, పోటీ చేసిన స్థానాల్లో ఓట్ల చీలిక ఎక్కువగా ఉంటుందని... తద్వారా బీజేపీ, కాంగ్రెస్‌లకు లాభం దక్కకుండా మళ్లీ బీఆర్ఎస్ గెలుపునకు అవకాశం ఏర్పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గెలిచినా ఓకే... ఓడినా పరోక్షంగా బీఆర్ఎస్ గెలుపుకు పాటుపడాలన్న ఎత్తుగడతోనే ఈ కొత్త ఎత్తులని స్పష్టం చేస్తున్నారు.
Updated Date - 2023-02-07T16:48:31+05:30 IST