AP Politics: మాజీ మంత్రి పేర్ని నానికి ఏమైంది? ఆలయంలో ఇదేం ప్రవర్తన?
ABN, First Publish Date - 2023-09-25T18:54:00+05:30
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి పేర్ని నాని వింత ప్రవర్తన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని గురించి అందరికీ తెలుసు. ఆయన ప్రెస్‌మీట్ పెడితే అందులో విషయం తక్కువ.. విమర్శలు ఎక్కువ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే ఆయన పెళ్లాల గురించి, పెళ్లిళ్లు గురించి వ్యంగ్యంగా మాట్లాడి మీడియాలో హైలెట్ అవుతుంటారు. జగన్ గురించి మాట్లాడమంటే మాత్రం విపరీతమైన ప్రేమాభిమానాలను చిలకరిస్తుంటారు. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే.. అన్నవరం ఆలయంలో పేర్ని నాని వింత ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసలు ఏం జరిగిందంటే..?
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం నాడు మాజీ మంత్రి పేర్ని నాని సతీ సమేతంగా వెళ్లారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ మర్యాదల్లో భాగంగా ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి శేష వస్త్రాన్ని పేర్ని నానికి కప్పే ప్రయత్నం చేశారు. అయితే అర్చకులు తనకు శాలువా వేయటాన్ని పేర్ని నాని తిరస్కరించారు. అంతేకాకుండా ఆ శాలువాను తన చేతులతో తీసుకుని తనకు తానే భుజంపై కప్పుకున్నారు. దీంతో ఆలయంలోని అర్చకులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అర్చకులతో ఇలా ప్రవర్తించడం ఏంటని అక్కడే ఉన్న పలువురు వైసీపీ నేతలు గుసగుసలాడుకున్నారు.
సొంత పార్టీ నేతలతోనూ వ్యంగ్యం
మాజీ మంత్రి పేర్ని నాని అన్నవరం ఆలయానికి వచ్చారని తెలుసుకున్న పలువురు వైసీపీ నేతలు ఆయన్ను చూసేందుకు ఆలయానికి తరలివచ్చారు. అయితే వారు ప్రదర్శించిన అభిమానాన్ని సైతం పేర్ని నాని తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రశాంతంగా గుడికి వస్తే విహార యాత్రకు, పెళ్లికి వచ్చినట్లు ఇంత మంది ఎందుకు వచ్చారంటూ పేర్ని నాని వైసీపీ నేతలపై రుసరుసలాడారు. దీంతో పేర్ని నాని వ్యవహారశైలి చూసిన వైసీపీ అభిమానులు విస్మయానికి గురయ్యారు. మరోవైపు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన పేర్ని నాని నోటి వెంట మరో ఆసక్తికర వ్యాఖ్య వచ్చింది. ప్రస్తుతం తాను ఎమ్మెల్యే హోదాలో పుట్టిన రోజు విషెస్ చెబుతున్నాని.. వచ్చే బర్త్ డే టైంకు మాత్రం తాను మాజీ ఎమ్మెల్యే హోదాలో విషెస్ చెప్తానని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని స్పష్టం చేశారు.
Updated Date - 2023-09-25T18:54:00+05:30 IST