Sattenapalli Politics: కోడెల శివరాం బహిరంగంగా ప్రకటన..టీడీపీలో ఆసక్తికర చర్చ..!?
ABN, First Publish Date - 2023-03-10T10:51:39+05:30
తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నేత కోడెల శివప్రసాదరావు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటకు చెందిన కోడెల వృత్తి రీత్యా
తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కీలక నేత మరణంతో అంతా అయిపోయిందనుకున్నారు. కానీ.. తండ్రి ఆశయ సాధనకు తనయుడు నడుం బిగించాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం గ్యారెంటీ అనే ప్రకటనతో రాజకీయంగా కలకలం రేపారు. ఇంతకీ.. ఎవరా దివంగత కీలక నేత?.. ఆయన తనయుడు చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఎలాంటి ప్రచారం జరుగుతోంది?..అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
వైసీపీ ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్య
తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నేత కోడెల శివప్రసాదరావు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటకు చెందిన కోడెల వృత్తి రీత్యా వైద్యులు. నరసరావుపేటలో రూపాయి డాక్టర్‌గా పేరు గాంచిన ఆయన ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీ స్థాపన సమయంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నరసరావుపేట నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. అయితే.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సొంత మండలం నకరికల్లు.. సత్తెనపల్లి నియోజకవర్గంలో కలవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కోడెల నరసరావుపేటను వదలి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఇక.. 2014లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గత ప్రభుత్వంలో నవ్యాంధ్ర తొలి అసెంబ్లీ స్పీకర్‌గా పని చేశారు. అయితే.. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచే పోటీ చేసి అనూహ్యంగా ఓటమి చెందారు. అదే సమయంలో.. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆపై.. వైసీపీ ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
సత్తెనపల్లి ఇన్‌చార్జ్ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి
ఇక.. కోడెల మరణంతో ఉమ్మడి గుంటూరు జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ సీనియర్ రాజకీయ నేతను కోల్పోయినట్లు అయింది. ఆయన మృతితో టీడీపీకి కూడా గట్టి దెబ్బ తగిలింది. కోడెల కుటుంబ సభ్యులకు టీడీపీ అధినేత చంద్రబాబు అండగా నిలిచారు. చంద్రబాబు ఇచ్చిన భరోసాతో కోడెల శివరాం ఎక్కడా ధైర్యం కోల్పోకుండా.. రాజకీయంగా ముందుకు సాగుతున్నారు. తండ్రి ఆశయ సాధన కోసం సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ వస్తున్నారు. కోడెల మరణం తర్వాత సత్తెనపల్లి ఇన్‌చార్జ్ పదవి ఇవ్వాలని కోరుతూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు.
అయితే.. ఇన్‌చార్జ్ పదవి ఎవరికీ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడంతో కోడెల శివరాంకు సత్తెనపల్లి సీటు అనుమానమేనన్న ప్రచారం జరుగుతోంది. కానీ.. ఇన్‌చార్జ్ పదవి ఇవ్వకపోయినా.. కోడెల శివరాం మాత్రం.. ఎక్కడా తగ్గకుండా స్వరం వినిపిస్తున్నారు. ఏ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఓడిపోయి.. అవమానాలు పడి ఆత్మహత్య చేసుకున్నారో అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి.. కోడెల ఆశయాలను నెరనేరుస్తానని శపథం చేస్తున్నారు. కానీ.. సత్తెనపల్లి ఇన్‌చార్జ్ పదవి పెండింగ్‌లో పెట్టడంతో ఆ నియోజకవర్గాన్ని పొత్తులో జనసేనకు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అయినా.. ఏ రోజూ అధైర్యపడకుండా కోడెల శివరాం సత్తెనపల్లిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది.
సత్తెనపల్లి సీటు శివరాంకు ఇవ్వకపోవచ్చనే చర్చ
ఇదిలావుంటే.. కన్నా లక్ష్మీ నారాయణ.. ఇటీవలే.. టీడీపీలో చేరడంతో మరో కన్‌ఫ్యూజన్ మొదలైంది. సత్తెనపల్లి టికెట్.. టీడీపీ.. కన్నాకు ఇస్తుందనే ప్రచారం మొదలైంది. ఓ వైపు జనసేన పొత్తు, మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ ఎంట్రీతో.. సత్తెనపల్లి సీటు కోడెల శివరాంకు ఇవ్వకపోవచ్చనే చర్చ జోరుందుకుంది. ఆ ప్రచారాల నేపథ్యంలోనే.. కోడెల శివరాం చేస్తున్న ప్రకటనలు అందిరినీ ఆలోచనలో పడేశాయి. ఇటీవల సత్తెనపల్లి మండల పెదమక్కన, గర్నెపూడి గ్రామాల్లో ఎన్టీఆర్, కోడెల శివప్రసాద్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ సభలో కోడెల శివరాం చేసిన ప్రకటన.. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తానని.. అందులో ఎలాంటి సందేహాలు వద్దని చెప్పుకొచ్చారు. అధినేత మాట ప్రకారమే రాజకీయంగా ముందుకు సాగుతున్నట్లు గుర్తు చేసారు. పొత్తులు పెట్టుకున్నా, కన్నా లక్ష్మీ నారాయణ లాంటి నేతలు టీడీపీలోకి వచ్చినా.. ఎవరికీ సందేహాలు అక్కర్లేదని కోడెల శివరాం చెప్పడం హీట్ పెంచుతోంది.
పార్టీ భరోసా లేకుండా బహిరంగ ప్రకటన చేస్తారా?
మరోవైపు.. అదే సభకు ముఖ్యఅతిథిగా హాజరైన నారా రోహిత్ కూడా కోడెల శివప్రసాద్ ఆశయాల సాధన కోసం శివరాంకు అండగా ఉండాలని కోరారు. అంతేకాదు.. నారా రోహిత్.. సత్తెనపల్లి కార్యక్రమానికి వచ్చే ముందు.. చంద్రబాబును కలిసే.. శివరాం ప్రోగ్రామ్‌కు వెళ్తున్నట్లు చెప్పే హాజరైనట్లు తెలుస్తోంది. అందుకే.. నారా కుటుంబ సభ్యుల సాక్షిగా.. కోడెల శివరాం చేసిన బహిరంగ ప్రకటన ఉమ్మడి గుంటూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
అదే సమయంలో.. పార్టీ భరోసా లేకుండా కోడెల శివరాం అంతటి బహిరంగ ప్రకటన చేయరనే చర్చలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తంగా.. వచ్చే ఎన్నికల్లో పోటీ విషయమై కోడెల శివరాం బహిరంగంగా ప్రకటన చేయడం టీడీపీలోనూ ఆసక్తికర చర్చకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో.. కోడెల శివరాం ప్రకటనకు చంద్రబాబు ఎప్పుడు అధికారికంగా గ్రీన్‌సిగ్నల్ ఇస్తారో చూడాలి మరి.
Updated Date - 2023-03-10T10:51:39+05:30 IST