Ajay Kallam: అమ్మ అజేయ కల్లం.. పదవీ కాలం పొడిగింపు వెనుక ఇంత కథ ఉందా..!
ABN, First Publish Date - 2023-06-17T12:00:22+05:30
రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం పదవీ కాలాన్ని పొడిగించడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. అందుకు కారణం లేకపోలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలం పొడిగింపు వార్తల్లో నిలిచింది. ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ రెడ్డి, అజేయ కల్లం రెడ్డి, శామ్యూల్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం (జూన్ 15, 2023) నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నలుగురిలో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ సర్కార్‌లో ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సజ్జలను సకల శాఖా మంత్రి అని ప్రతిపక్ష టీడీపీ ఎద్దేవా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నలుగురి పదవీ కాలం పొడిగింపుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా.. రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం పదవీ కాలాన్ని పొడిగించడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. అందుకు కారణం లేకపోలేదు.
ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పటికీ అజేయ కల్లం ఇటీవల కొంత కాలంగా పాలనా వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు కేటాయించిన ఛాంబర్‌కు కూడా వెళ్లడం లేదని టాక్. కొంతకాలంగా గడ్డంతో కనిపిస్తున్న ఆయన ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లించారట. తాడేపల్లి వైపు తలెత్తి కూడా చూడటం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి జగన్ ముఖ్య సలహాదారుగా ఉన్న అజేయ కల్లం వార్షిత వేతనం 30 లక్షల వరకూ ఉందని తెలిసింది. అంత వేతనం పొందుతున్నప్పటికీ అజేయ కల్లం అలక్ష్యం వహిస్తున్నప్పటికీ పదవీ కాలాన్ని పొడిగించడం వెనుక పెద్ద కథే ఉందట.
వైఎస్ వివేకా దారుణ హత్య ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ఎపిసోడ్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ ప్రభుత్వమే హత్య చేయించిందని నిందలేసిన అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు బాబాయ్ హత్య కేసు విచారణ పెద్ద తలనొప్పిగా మారింది. ఈ కేసులో అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం, అవినాశ్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుండటంతో వైసీపీని వివేకా హత్య కేసు టెన్షన్ పెడుతోంది. ఈ క్రమంలో.. ఏప్రిల్ 30, 2023న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘కొత్త పలుకు’లో భాగంగా ‘అంత:పుర రహస్యం’ పేరుతో రాసిన కథనం వైసీపీని ఉలిక్కిపడేలా చేసింది. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన ఆ అంత:పుర రహస్యానికి, తాజాగా అజేయ కల్లం పదవీ కాలం పొడిగింపునకు కొంత సంబంధం ఉందని చెప్పక తప్పదు. ఒక్కసారి ఆ అంత:పుర రహస్యంలో ఆర్కే రాసిన ఒక విషయాన్ని గుర్తుచేసుకుందాం.
ఆర్కే రాసిన అంత:పుర రహస్యంలో అజేయ కల్లం గురించిన ప్రస్తావన ఇది..
వివేకానంద రెడ్డి హత్య విషయం జగన్మోహన్ రెడ్డి దంపతులకు ముందుగానే తెలుసని చెప్పడానికి ప్రాథమిక ఆధారాలు లభిస్తున్నాయి. వివేకా హత్య 2019 మార్చి 15 అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో జరిగింది. అదేరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసమై నలుగురు ముఖ్యులను జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. ఇది ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం. తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఆ నలుగురితో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఇంతలోనే మేడ మీద నుంచి పిలుపు వచ్చింది. వెంటనే ఇంట్లోకి వెళ్లిన జగన్ రెడ్డి పది నిమిషాల తర్వాత తిరిగి సమావేశ ప్రదేశానికి వచ్చారు. చిన్నాన్న గుండెపోటుతో చనిపోయారని ఆ నలుగురికీ చెప్పి సమావేశాన్ని కొనసాగించారు. అంటే, వివేకా హత్య గురించి ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి దంపతులకు తెలుసునని స్పష్టమవుతోంది. హత్య తర్వాత అవినాశ్ రెడ్డి ఫోన్ నుంచి జగన్ దంపతుల వ్యక్తిగత కార్యదర్శులకు వెళ్లాయని సీబీఐ విచారణలో కూడా వెల్లడైన విషయం విదితమే.
చిన్నాన్నను ఏమి చేశారో తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి చలించకుండా ఎన్నికల ప్రణాళిక గురించి చర్చించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కరడుగట్టిన మనస్తత్వం ఉన్నవారు మాత్రమే అలా ప్రవర్తించగలరు. ఒకవేళ వివేకాది సహజ మరణమే అయినప్పటికీ చనిపోయిన చిన్నాన్న భౌతికకాయానికి నివాళులర్పించడానికి జగన్ స్థానంలో ఎవరున్నా ఉన్నపళంగా బయలుదేరి వెళతారు. జగన్ దంపతులు అలా చేయకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. జగన్‌తో ఆ రోజు సమావేశమైన ఆ నలుగురూ ఇప్పటికీ ఆయనతోనే ఉన్నారు. ఆ నలుగురూ మరెవరో కాదు! ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ పర్సనల్ సెక్రటరీ కృష్ణమోహన్ రెడ్డి, దివంగత సోమయాజులు కుమారుడు కృష్ణ (అధికారంలోకి వచ్చాక ఆయనను ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించారు), రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం. సీబీఐ అధికారులు ఈ నలుగురినీ విచారిస్తే అసలేం జరిగిందో బయటికొస్తుంది. వివేకా హత్య వెనుక విస్తృత స్థాయి కుట్ర ఉందని సీబీఐ మొదటి నుంచీ చెబుతోంది. ఇప్పుడు అది నిజమేనని నమ్మక తప్పని పరిస్థితి.య ఆ రోజు జగన్ తో సమావేశమైన ఆ నలుగురినీ సీబీఐ ప్రశ్నించాల్సిన అవసరముంది. సీబీఐ విచారణలో ఆ నలుగురూ నిజం అంగీకరిస్తే జగన్మోహన్ రెడ్డి దంపతుల మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది! (ఇదీ ఆ నలుగురి గురించి ఆర్కే చేసిన ప్రస్తావన)
అంత:పుర రహస్యం’లో ఆర్కే ప్రస్తావించిన ఆ నలుగురిలో రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం కూడా ఒకరు. జగన్‌కు పాలనలోనే కాదు పరిధికి మించి కూడా నమ్మకస్తుడిగా వ్యవహరించిన అజేయ కల్లం పదవీ కాలం పొడిగించక తప్పని పరిస్థితి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిది. అజేయ కల్లంను పక్కనపెట్టేస్తే పొరపాటున వివేకా హత్య గురించి నోరు విప్పితే వైసీపీకి రాజకీయంగా భారీ నష్టం తప్పదు. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకున్న సీఎం జగన్ రెడ్డి అజేయ కల్లం రెడ్డికి పదవీ కాలాన్ని పొడిగించి ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
Updated Date - 2023-06-17T12:16:50+05:30 IST