Priyanka Gandhi: తెలంగాణ ఇంచార్జ్‌గా ప్రియాంక గాంధీ.. సక్సెస్ స్టార్ట్?
ABN, First Publish Date - 2023-05-08T15:13:06+05:30
తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న కొట్లాటలు, గ్రూపుల గొడవలు, ఆధిపత్య పోరు అంతా ఇంతా కాదు. సొంత నాయకుల ఓటమే లక్ష్యంగా నేతలు పనిచేసిన సందర్భాలు కూడా..
తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) ఉన్న కొట్లాటలు, గ్రూపుల గొడవలు, ఆధిపత్య పోరు అంతా ఇంతా కాదు. సొంత నాయకుల ఓటమే లక్ష్యంగా నేతలు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా సానుభూతి ఉన్నా, రెండుసార్లూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే నాయకత్వం కొరవడింది. మూడోసారి ఎలాగైనా తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురేయాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం (Congress High Command) ఇప్పుడు ప్రియాంక గాంధీని (Priyanka Gandhi) తెలంగాణకు పంపుతోంది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దిగజారిపోతున్న సమయంలో ఇందిరాగాంధీ పోలికలున్న ప్రియాంక గాంధీని కాంగ్రెస్ రంగంలోకి దింపింది. ముందుగా యూపీలో పార్టీని బతికించేందుకు బాగానే కష్టపడింది. పార్టీకి పునర్వైభవం రాకపోయినా, సీట్లు గెలవకపోయినా.. గత యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడర్‌కు ప్రియాంక చేరువకాగలింది. ముఖ్యంగా సగటు ఓటరును, గతంలో కాంగ్రెస్‌కు అండగా ఉన్న వర్గాలను చేరుకునేందుకు ప్రియాంక తీసుకున్న ప్రోగ్రామ్స్ పై చర్చ అయితే జరిగింది.
కానీ ఇప్పుడు తెలంగాణ పూర్తిగా భిన్నం. కేసీఆర్ పై రెండు పర్యాయాల ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. మొదటిసారి తెచ్చిన స్కీములే తప్పా రెండోసారి కొత్త స్కీములు లేవు. ముఖ్యంగా యువతలో కేసీఆర్ పై వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ కు నడిపే నాయకత్వంలో కొట్లాటలు ఉన్నా గ్రౌండ్ లో పార్టీ అత్యంత బలంగా ఉంది. కర్నాటకలో గెలుపు ముంగిట ఉన్న కాంగ్రెస్ తదుపరి ఆశ కూడా తెలంగాణే. గెలిచే ఛాన్స్ ఉందని బలంగా నమ్ముతుండటంతో కర్నాటక ఎన్నికల ప్రచారం ముగిసిన రోజు నుండే తెలంగాణ బాధ్యతలు అప్పజెప్పారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న ముఖ్య నేతల్లో ఎవరికీ సఖ్యత లేదన్నది ఓపెన్ సీక్రెట్. కొందరిపై కోవర్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ దశలో ప్రియాంక గాంధీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గాంధీ కుటుంబ సభ్యురాలిగా ప్రియాంక నిర్ణయాలకు తిరుగుండదు. నాయకులంతా పార్టీ కోసం పనిచేయాల్సి వస్తుంది. ఇన్నాళ్లు నేతల మధ్య కొట్లాటతో అధిష్టానం వద్ద తేల్చుకుంటామన్న డైలాగ్స్ ఉండేవి.
కానీ ఇప్పుడు అధిష్టానమే స్వయంగా రావటంతో ఆ ఆటలు సాగే అవకాశం ఉండదు. పోరాడే నేతలకు, కేసీఆర్‌తో కలబడుతున్న నాయకులకు ప్రియారిటీ పెరుగుతుంది. క్యాడర్ కూడా అదే కావాల్సింది. గెలుపు ఫార్మూలాతో ప్రియాంక తెలంగాణలో ల్యాండ్ అవ్వబోతున్నట్లు స్పష్టంగా కనపడుతుండగా.. ప్రియాంక గాంధీ సక్సెస్ కూడా తెలంగాణ నుండే స్టార్ట్ కాబోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Updated Date - 2023-05-08T15:23:13+05:30 IST