MLC రేసులోనున్న ఆశావహులు ఎవరు..? అసంతృప్తుల బుజ్జగింపునకు ఎమ్మెల్సీ పదవుల ఎర..!?
ABN, First Publish Date - 2023-02-18T09:15:18+05:30
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి షురూ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఎమ్మెల్సీ ..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారా?.. త్వరలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు మొదలెట్టారా?.. ఎన్నికల ఏడాది కావడంతో గులాబీబాస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారా?.. గతంలో ఇద్దరి పదవీకాలం పొడిగించగా.. ఈ సారి వారికి చాన్స్ ఇస్తారా? లేదా?.. ఆ రెండు స్థానాల్లో కేసీఆర్ ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు?.. కవిత ప్రాధాన్యం పెంచేందుకు నిజామాబాద్ నేతలకు షాకివ్వడం ఖాయమా?.. ఇంతకీ.. ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలపై నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి చర్చ జరుగుతోంది?.. అసలు.. ఎమ్మెల్సీ రేసులోనున్న ఆశావహులెవరు?...అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్సీలు
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి షురూ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయింది. దాంతో.. ఏ జిల్లాలో ఎంతమంది సిట్టింగు ఎమ్మెల్సీలు ఉన్నారు?.. ప్రస్తుతం ఎమ్మెల్సీ రేసులో ఎవరున్నారు?.. అనే లెక్కలు తెరపైకి వస్తున్నాయి. ఆ క్రమంలో.. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలో కవిత.. ఎమ్మెల్యే కోటాలో వి.గంగాధర్‌గౌడ్, గవర్నర్ కోటాలో డి.రాజేశ్వర్ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. కవిత మినహా మిగతా ఇద్దరి పదవీకాలం పూర్తి కావొచ్చింది. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన గంగాధర్‌గౌడ్ పదవీకాలం మార్చి నెలాఖరులో ముగియనుంది. అలాగే.. గవర్నర్ కోటాలో కొనసాగుతున్న రాజేశ్వర్ పదవి ఏప్రిల్‌లో ముగియనుంది. ఆ ఇద్దరూ ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరినోళ్లే. ఎమ్మెల్సీ హోదాలో పార్టీలో చేరిన వారికి ప్రతిఫలంగా మరో దఫా పదవీకాలం పొడిగించారు. అయితే.. ఈ సారి వారిని కంటిన్యూ చేస్తారా? లేదా? అన్నది గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి.. గంగాధర్‌గౌడ్ తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చారు. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రెండోసారి పదవీకాలం పొడిగించారు. ఇప్పుడు మరోసారి కంటిన్యూ చేస్తారని ఆయన ఆశిస్తున్నారు. సామాజికవర్గ బలాన్ని నమ్ముకున్న ఆయన.. ఈ సారి కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఆయన తరఫున అధినేత దగ్గర లాబీయింగ్ చేసేవారు లేకపోవడం మైనస్‌గా మారింది. సామాజికవర్గ పెద్దలతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలెవరూ ఆయన్ను సపోర్టు చేసే సూచనలు లేవు. దాంతో.. కేసీఆర్ అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరిని తెరపైకి తెచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ గంగాధర్‌గౌడ్‌ను నిరుత్సాహ పరచవద్దనుకుంటే, మళ్లీ అధికారంలోకి వస్తే.. ఏదైనా కార్పొరేషన్ పదవికి హామీ ఇచ్చే అవకాశం ఉంది.
రెండు ఎమ్మెల్సీలను ఎవరికి కేటాయిస్తారో?
మరోవైపు.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన డి.రాజేశ్వర్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్సీగా కొనసాగిన రాజేశ్వర్.. మూడోసారి కూడా అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దానికోసం దళిత, క్రిస్టియన్ కోటాపై ఆశలు పెట్టుకున్నారు. ఆ మేరకు ఆయన సామాజికవర్గానికి చెందిన రాష్ట్రస్థాయి ప్రముఖులు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం.. కేసీఆర్ వారిని తెరపైకి తెచ్చే చాన్స్ ఉంది. వచ్చే ఎన్నికల నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ పదవులను వాడుకునే సూచనలున్నాయి. అందుకే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన రెండు ఎమ్మెల్సీలను ఎవరికి కేటాయిస్తారనేది గులాబీ పార్టీలో ఆసక్తి రేపుతోంది.
2 ఎమ్మెల్సీ స్థానాలపై స్పష్టతలేని సంకేతాలు
ఇదిలావుంటే.. గులాబీబాస్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఊహించని పరిస్థితి. ఎవరూ గెస్ చేయనివారికి పదవులు కట్టబెడుతుంటారు. దాంతో.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన రెండు ఎమ్మెల్సీ స్థానాలపై ఎవరికీ స్పష్టమైన సంకేతాలు రావడం లేదు. ఆ మధ్య కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ హోదాలో చేరిన ఆకుల లలితకు ఒక్కసారి కూడా పదవి పొడిగించలేదు. ఎమ్మెల్సీ పదవీకాలం ముగియగానే కొంతకాలం ఆమెను పక్కన పెట్టారు. ఆమె స్థానంలో కవితకు అవకాశం కల్పించారు. అయితే.. గతంలో బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలందరికీ పదవీకాలం పొడిగించగా.. ఒక్క ఆకుల లలితను మాత్రమే తప్పించారు. ఆ తర్వాత లలితను మహిళా అభివృద్ధి ఆర్థిక సంస్థ అధ్యక్షురాలిగా నియమించి సరిపెట్టారు. అయితే.. ఓ చిన్న జిల్లాకు మూడు ఎమ్మెల్సీలు ఎందుకనే ప్రశ్న తెరపైకి వస్తోంది. దాంతోపాటు.. కవితకు ప్రాధాన్యత పెంచాలంటే మిగతా ఎమ్మెల్సీలు ఉండొద్దనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆ రెండు పోస్టులను ఇతర జిల్లాలకు తరలించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
ఎమ్మెల్సీ పదవి కోసం సీనియర్ల ఎదురుచూపు
ఇక.. ఏ పరిణామాలు ఎలా ఉన్నా.. ఆశావహులు మాత్రం కేసీఆర్ ఆశీర్వాదం కోసం భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలామంది సీనియర్లు ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. అందులోనూ.. ఎన్నికల ఏడాది కావడంతో అధిష్ఠానం ఖచ్చితంగా సామాజిక సమతుల్యం పాటించే అవకాశాలున్నాయి. ఆ అంచనాలతోపాటు గతంలో కేసీఆర్ పలు సందర్భాల్లో కొందరికి హామీలిచ్చారు. ఏళ్ళ తరబడి పదవుల కోసం ఎదురుచూస్తున్న వారిని ఊరడించే క్రమంలో ఎమ్మెల్సీ పదవికి భరోసా ఇచ్చారు.
అలాంటివారిలో.. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎం.కె.ముజీబుద్దిన్ ప్రధానంగా పోటీ పడుతున్నారు. అయితే.. అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆశావహులు టెన్షన్ పడుడుతున్నారు. మొత్తంగా.. నిజామాబాద్ జిల్లా రాజకీయాలను మలుపుతిప్పే రెండు ఎమ్మెల్సీ పదవుల వ్యవహారం.. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి మరి.
Updated Date - 2023-02-18T09:46:45+05:30 IST