Perni Nani: జగన్‌కే ఝలక్ ఇచ్చిన పేర్ని నాని.. ఈ ఒక్క పనితో..
ABN, First Publish Date - 2023-06-09T16:28:31+05:30
‘చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ..’ సూపర్‌హిట్ సినిమా యమలీలలో తనికెళ్ల భరణి డైలాగ్ ఇది. మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఈ డైలాగ్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ భూమిపూజ నిర్వహించి పట్టుమని 16 రోజులు కూడా పూర్తి కాకముందే మరోసారి పేర్ని నాని అక్కడ భూమిపూజ పేరుతో హడావిడి చేశారు.
(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : ‘చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ..’ సూపర్‌హిట్ సినిమా యమలీలలో తనికెళ్ల భరణి డైలాగ్ ఇది. మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఈ డైలాగ్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ భూమిపూజ నిర్వహించి పట్టుమని 16 రోజులు కూడా పూర్తి కాకముందే మరోసారి పేర్ని నాని అక్కడ భూమిపూజ పేరుతో హడావిడి చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు మంగినపూడి సమీపంలో పోర్టు పైలాన్ వద్ద నార్త్ బ్రేక్ వాటర్ గోడ నిర్మాణ పనులకు పేర్ని నాని భూమిపూజ నిర్వహించారు.
నాని తీరుపై సొంత పార్టీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్‌ను కించపరిచే విధంగా.. ఆయనంటే లెక్కలేనితనంగా పేర్ని నాని వ్యవహారశైలి ఉందని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మే 22న సీఎం జగన్ మచిలీపట్నం పోర్టుకు భూమిపూజ నిర్వహించారు. మచిలీపట్నం పోర్టుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒకసారి, చంద్రబాబు మరోసారి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో పోర్టుకు మళ్లీ శంకుస్థాపన చేశారన్న విమర్శలు రాకుండా ఉండేందుకు జగన్ భూమిపూజ పేరుతో కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలోనూ పేర్ని నాని సీఎం జగన్‌ను ఉద్దేశించి ఏకవచన ప్రయోగంతో ప్రసంగం చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. నేరుగా సీఎంవో సీనియర్ అధికారి ధనుంజయరెడ్డి లైన్‌లోకి వచ్చి పేర్ని నాని తీరును తప్పుబట్టారు. ఈ వివాదం సద్దుమణగక ముందే పేర్ని నాని మరోసారి తన చర్యలతో కొత్త వివాదానికి తెరదీశారు. పేర్ని నాని చర్యను ఆయన అనుచరగణం అడ్డగోలుగా సమర్ధించుకుంటుండటం గమనార్హం.
సీఎం జగన్.. సౌత్ బ్రేక్ వాటర్ వద్ద భూమిపూజ చేశారని, తమ నాయకుడు నార్త్ బ్రేక్ వాటర్ వద్ద భూమిపూజ చేస్తే తప్పేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ భూమిపూజ కార్యక్రమాన్ని సీఎం జగన్ వచ్చిన సమయంలో నిర్వహించిన కార్యక్రమం స్థాయిలో చేయడం గమనార్హం. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా పేర్ని నాని హుకుం జారీ చేశారని సమాచారం.
Updated Date - 2023-06-09T16:28:34+05:30 IST