Chennai Girlfriend: సినిమాని మించిన త్రిల్లర్ స్టోరీ.. పెళ్లైన ప్రియుడ్ని ఎత్తుకెళ్లి, ఆ ప్రియురాలు ఏం చేసిందంటే?
ABN, First Publish Date - 2023-08-13T21:01:24+05:30
తాము ప్రేమించిన వ్యక్తికి మరొకరితో పెళ్లి అవుతోందని తెలిసి, పక్కా ప్లానింగ్‌తో కిడ్నాప్ చేసే సన్నివేశాలను మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అందులోనూ.. ప్రియుడు మాత్రమే..
తాము ప్రేమించిన వ్యక్తికి మరొకరితో పెళ్లి అవుతోందని తెలిసి, పక్కా ప్లానింగ్‌తో కిడ్నాప్ చేసే సన్నివేశాలను మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అందులోనూ.. ప్రియుడు మాత్రమే ఇలాంటి సాహసాలకు పూనుకునే సీన్లే ఉంటాయి. రియల్ లైఫ్‌లో ఇలాంటివి చేయడం దాదాపు అసాధ్యం. కానీ.. ఈ అసాధ్యాన్ని ఓ యువతి సుసాధ్యం చేసి చూపించింది. తాను ప్రేమించిన వ్యక్తికి పెళ్లైనా.. అతడ్ని మర్చిపోలేక కిడ్నాప్ చేసింది. అంతేకాదండోయ్.. అతనితో బలవంతంగా తాళి కూడా కట్టించుకుంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కిడ్నాప్‌కు ఆమె కుటుంబ సభ్యులు సైతం సహకారం అందించారు. చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
చెన్నైలోని వెలచెరికి చెందిన పార్తిబన్ (31) ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇతడు తొలుత ప్రియా అనే అమ్మాయిని ప్రేమించి, బ్రేకప్ చెప్పాడు. ఆ తర్వాత సౌందర్య (27)తో ప్రేమాయణం నడిపించాడు. వీరి మధ్య కూడా విభేదాలు తలెత్తడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. పార్తిబన్ బ్రేకప్ బాధలో ఉండగా.. ప్రియా అతనికి మళ్లీ దగ్గరైంది. దాంతో మళ్లీ ప్రేమలో పడిన వీళ్లిద్దరు.. గతేడాది జులైలో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతోంది. అయితే.. సౌందర్య మాత్రం పార్తిబన్‌ని మర్చిపోలేదు. బ్రేకప్ చెప్పి దూరమైనా, అతనిపై ప్రేమ మాత్రం చావలేదు. మళ్లీ పార్తిబన్‌కి దగ్గరవ్వాలని అనుకునేలోపే.. అతనికి పెళ్లైన విషయం సౌందర్యకి తెలిసింది. దీంతో ఏం చేయాలో తెలీక.. ఆమె అయోమయానికి గురైంది. అతడ్ని విడిచి ఉండలేకపోయిన సౌందర్య.. చివరికి కిడ్నాప్ చేసి, తన సొంతం చేసుకోవాలని భావించింది. తన కుటుంబ సభ్యులతో కలిసి.. పార్తిబన్‌ని కిడ్నాప్‌కి ప్లాన్ చేసింది.
గురువారం పార్తిబన్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆఫీస్ కోసం తన అపార్ట్‌మెంట్ నుంచి బయటకొచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన సౌందర్య గ్యాంగ్.. అతడు బయటకు రాగానే ఒక్కసారిగా ఎగబడింది. పార్తిబన్ ప్రతిఘటించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. రెండు దెబ్బలు వేసి, కారులో తోశారు. ఇది చూసిన పార్తిబన్ తల్లి కారుని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆమెని ఢీకొట్టి వెళ్లిపోయారు. కిడ్నాపర్లు పార్తిబన్‌ని నేరుగా కాంచీపురంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ సౌందర్య మెడలో బలవంతంగా తాళి కట్టించారు. అటు.. పార్తిబన్‌ని కిడ్నాప్ చేసిన విషయం తెలుసుకున్న అతని భార్య ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి.. సీసీటీవీ ఫుటేజీలు, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పార్తిబన్ ఒక ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకొని.. సౌందర్య, ఆమె బంధువుల్ని అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2023-08-13T21:01:24+05:30 IST