School Girls: 17 మంది విద్యార్థుల కిడ్నాప్.. ముగ్గురు అమ్మాయిల మాటలతో ఉలిక్కిపడిన పోలీసులు.. ఆరా తీస్తే..!
ABN, First Publish Date - 2023-09-26T19:04:46+05:30
హత్యలు, అత్యాచారాలు తదితర హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయంటూ ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ సమయంలో..
హత్యలు, అత్యాచారాలు తదితర హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయంటూ ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ సమయంలో మరో పిడుగులాంటి వార్త విని పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఏకంగా 17మంది విద్యార్థులు కిడ్నాప్ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ముగ్గురు అమ్మాయిలు చెప్పిన మాటతో.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. చివరకూ ఆరా తీయగా.. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
మణిపూర్ (Manipur) ఇంఫాల్ సమీపంలోని నంబోల్ పట్టణానికి చెందిన ముగ్గురు బాలికలు (girls) పోలీసులకు ఫోన్ చేసి తమతో పాటూ 17మంది విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ (Kidnap) చేశారని చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ముగ్గురు బాలికలను అదుపులోకి తీసుకుని విచారించారు. తమ స్నేహితులంతా కలిసి పాఠశాలకు వస్తుండగా.. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు తమను విహారయాత్రకు తీసుకెళ్తామంటూ వ్యాన్ ఎక్కించారని చెప్పారు. అందరినీ వ్యాన్‌లో తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో అనుమానం వచ్చి తాము మాత్రం తప్పించుకుని వచ్చామంటూ పోలీసులకు తెలిపారు.
అయితే వారు చెప్పే మాటలకు, జరిగిన వాస్తవానికి పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. చివరకు గట్టిగా విచారించగా అసలు విషయం చెప్పారు. తమకు పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేదని, ఈ విషయం చెబితే ఒప్పుకోరనే ఉద్దేశంతో ఇలా కిడ్నాప్ డ్రామా (Kidnapping drama) ఆడినట్లు అంగీకరించారు. వారు చెప్పిందంతా కట్టు కథ అని తెలియడంతో అధికారులంతా హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. చివరగా విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాశంగా మారింది. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వార్త.. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.
Updated Date - 2023-09-26T19:04:46+05:30 IST