Missing Mystery: ఒక్క అబద్ధం విలువ 4 కోట్ల రూపాయలు.. ఓ భార్యకు వచ్చిన డౌట్‌తో బయటపడిన ‘మరణ శాసనం’..!
ABN, First Publish Date - 2023-06-30T18:17:35+05:30
విలాసాలకు అలవాటు పడి కొందరు, అవగాహన లేక మరికొందరు తాహతుకు మించి అప్పులు చేస్తుంటారు. వాటి నుంచి గట్టెక్కేందుకు మరిన్ని తప్పులు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ఎంతటి దారుణాలకు తెగబడడానికైనా వెనుకాడరు. ఇలాంటి ఘటనలు రోజూ..
విలాసాలకు అలవాటు పడి కొందరు, అవగాహన లేక మరికొందరు తాహతుకు మించి అప్పులు చేస్తుంటారు. వాటి నుంచి గట్టెక్కేందుకు మరిన్ని తప్పులు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ఎంతటి దారుణాలకు తెగబడడానికైనా వెనుకాడరు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, పంజాబ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ఓ వ్యక్తి.. రూ.4 కోట్ల కోసం మాస్టర్ ప్లాన్ వేశాడు. అయితే ఓ మహిళకు వచ్చిన అనుమానంతో అసలు బండారం బయటపడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
పంజాబ్ (Punjab) ఫతేఘర్ సాహిబ్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక రాందాస్ నగర్‌లో గురుప్రీత్ సింగ్, ఖుష్‌దీప్ కౌర్ దంపతులు నివాసం ఉంటున్నారు. గురుప్రీత్ సింగ్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అయితే ఇటీవల అతడికి వ్యాపారంలో (Loss in business) తీవ్ర నష్టాలు వచ్చాయి. దీంతో తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. దీంతో అప్పటి నుంచి ఎలాగైనా నష్టాల నుంచి గట్టెక్కాలని వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతడికి ఓ ఐడియా వచ్చింది. రూ.4కోట్ల బీమా మొత్తాన్ని క్లెయిమ్ (Insurance Claim) చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తాను చనిపోయినట్లుగా చిత్రీకరించాలని ప్లాన్ వేశాడు.
ఇందుకోసం తన భార్యతో పాటూ స్నేహితులతో కలిసి పక్కా పథకం రచించాడు. తన మాదిరే ఉన్న సుఖ్‌జీత్ అనే వ్యక్తితో గురుప్రీత్ సింగ్ స్నేహం చేశాడు. రోజూ తనకు మద్యం ఇప్పించడంతో పాటూ అన్ని ఖర్చులూ తానే భరించేవాడు. ఈ క్రమంలో జూన్ 19న సుఖ్‌జీత్‌ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అతడికి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ (Cool drink) ఇచ్చాడు. అది తాగడంతో సుఖ్‌జీత్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తర్వాత అతన్ని రోడ్డుపై పడుకోబెట్టి లారీతో గుర్తుపట్టనంతగా తొక్కించాడు. అనంతరం జూన్ 20న గురుప్రీత్ సింగ్ భార్య.. స్టేషన్‌కి వెళ్లి, తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఫిర్యాదు చేసింది.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఇదే సమయంలో తన భర్త కనిపించడం లేదంటూ సుఖ్‌జీత్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులకు సంఘటన స్థలంలో సుఖ్‌జీత్ బైకు, చెప్పులు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి గురుప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులను పిలిపించి గట్టిగా విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గురుప్రీత్ సింగ్, అతడి భార్యతో పాటూ మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Updated Date - 2023-06-30T18:17:35+05:30 IST