Monsoon Health Tips: అసలే వర్షాకాలం.. తల్లిదండ్రులూ బీ అలెర్ట్.. పిల్లలకు డెంగ్యూ, మలేరియా రాకుండా ఉండాలంటే..!
ABN , First Publish Date - 2023-08-07T16:01:55+05:30 IST
పెద్దలతో పోలిస్తే పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలకు ఇన్ఫెక్షన్లు చాలా సులువుగా సంక్రమిస్తుంటాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో దోమల వల్ల మలేరియా, డెంగీ వచ్చే అవకాశాలెక్కువ. పిల్లలు వీటిని ఎదర్కోవడమంటే ప్రాణాలను రిస్క్ లో పెట్టడమే..
పెద్దలతో పోలిస్తే పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలకు ఇన్ఫెక్షన్లు చాలా సులువుగా సంక్రమిస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఋతువు మారినప్పుడు ఏర్పడే వాతావరణం వల్ల పిల్లలు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలకు చాలా సులువుగా లోనవుతుంటారు. ఇక ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. వర్షాల కారరణంగా దోమల ప్రతాపం ఎక్కువ అవుతుంది. దోమ కాటుకు గురైతే మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు వీటిని ఎదర్కోవడమంటే ప్రాణాలను రిస్క్ లో పెట్టడమే.. సమస్య వచ్చాక బాధపడటం కంటే ముందు జాగ్రత్తలు పాటించడం ఎంతో మంచిది. ఈ వర్షాకాలంలో పిల్లలకు మలేరియా, డెంగీ లాంటి జ్వరాలు రాకూడదంటే 5టిప్స్ ఫాలో అవ్వాలని పిల్లల ఆరోగ్య సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..
మలేరియా(Malaria), డెంగ్యూ(dengue) లాంటి ప్రమాదకరమైన జ్వరాలకు దోమలే మూలకారణం. పిల్లలు దోమల బారిన పడకుండా చూసుకోవాలి. పిల్లలు నిద్రపోతున్నప్పుడు దోమ తెరలు(mosquito) ఉపయోగించాలి. తలుపులు, కిటికీల గుండా దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా నెట్ కర్టెన్లు వాడాలి. లేదా దోమలు సాయంత్రం సమయంలోనే ఇంట్లోకి ప్రవేశిస్తుంటాయి. ఆ సమయంలో ఇంటి తలుపులు,కిటికీలు క్లోజ్ చెయ్యాలి. ఇంట్లో ఆలవుట్ వంటి రసాయన క్రిమిసంహారకాలకు బదులుగా సిట్రోనెల్లా, యూకలిప్టస్ ఆయిల్, కర్పూరం నూనె వంటివి ఇంట్లో ఉపయోగించాలి. పిల్లలకు శరీరం మొత్తం కవర్ అయ్యేలా పొడవాటి చేతులున్న చొక్కాలు, ప్యాంటులు వేయాలి.
Health Tips: ఈ 4 రకాల విత్తనాలతో ఇంత లాభమా..? రోజూ రాత్రిళ్లు నానబెట్టి.. పొద్దునే పరగడపున తింటే..!
ఇంట్లో, ఇంటి చుట్టు ప్రక్కల ప్రాంతాలలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. నిల్వ ఉన్న నీటి ప్రాంతాలు దోమలకు ఆవాసంగా మారుతాయి. ఈ నీటిలో దోమలు గుడ్లు పెట్టి సంతతి పెంచుకుంటాయి. ఇంటి ఆవరణలో పూల మొక్కలు ఉంటే ఆ ప్రాంతాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి.
పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు, సాయంత్ర వేళల్లో దోమకాటుకు గురైనా ప్రభావం పడకుండా ఉండేందుకు మస్కిటో క్రీములు, లోషన్లు ఉపయోగించాలి. వీటిని పిల్లల శరీరానికి పూసిన తరువాత పిల్లల చేతులు ముక్కు, నోరు, కళ్ళు వంటి సున్నితమైన భాగాలను ముట్టుకోనివ్వకుండా జాగ్రత్తపడండాలి.
పిల్లలకు ఆడుకోవడం ఇష్టం. వారిని బయటకు వెళ్ళొద్దని చెబితే వారికి నచ్చదు. బయటకు వెళ్లద్దని చెప్పడం కంటే దోమల ద్వారా వచ్చే జ్వరాల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడం మంచిది. దోమలకు ఎందుకు దూరం ఉండాలో, ఎలా దూరం ఉండాలో కూడా చెప్పాలి. ఇలా చేస్తే పిల్లలను మీరు కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. పిల్లలు తమ గురించి తాము జాగ్రత్తలు తీసుకుని తమను తాము కాపాడుకుంటారు.
వర్షాకాలంలో ఇన్పెక్షన్లు చాలా తొందరగా సంక్రమిస్తాయి. ఇందులో ఆహారం ప్రధాన పాత్ర వహిస్తుంది. పిల్లలకు బయటి ఆహారాలంటే చాలా ఇష్టం. కానీ వర్షాకాలంలో ఆహారం నీటి ద్వారా చాలా కలుషితమవుతుంది. అందుకే బయటి ఆహారాలకు దూరంగా ఉంచాలి. పిల్లల ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు అందించాలి. ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడు తినాలి.