Snake Bite: 10 ఏళ్ల బాలుడిని కాటేసిన పాము.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లకుండా వేపాకుల మధ్యలో పడుకోబెట్టారు.. 6 గంటల తర్వాత..!
ABN, First Publish Date - 2023-05-05T20:35:50+05:30
రోజురోజుకూ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లోనూ.. చాలా ప్రాంతాల్లో కొందరు ఇప్పటికీ మూఢనమ్మకాలను విశ్వసిస్తుంటారు. కొందరైతే మూఢ విశ్వాసాల కారణంగా చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు కనీస జ్ఞానం కూడా లేకుండా..
రోజురోజుకూ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లోనూ.. చాలా ప్రాంతాల్లో కొందరు ఇప్పటికీ మూఢనమ్మకాలను విశ్వసిస్తుంటారు. కొందరైతే మూఢ విశ్వాసాల కారణంగా చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు కనీస జ్ఞానం కూడా లేకుండా తాంత్రికులను నమ్మి చివరకు తీవ్రంగా నష్టపోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, రాజస్థాన్‌లో చోటు చేసుకున్న విషాద ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. పదేళ్ల బాలుడిని పాము కాటేసింది. డాక్టర్ వద్దకు వెళ్లకుండా వేపాకుల మధ్య పడుకోబెట్టడంతో ఆరు గంటల తర్వాత షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ (Rajasthan) భరత్‌పూర్ పరిధి హిందౌన్ సమీపంలోని సింకద్‌పూర్ ప్రాంతానికి చెందిన సంజయ్ జాతవ్‌కు భార్య.. 10 ఏళ్ల కేశవ్ అనే కుమారుడు ఉన్నారు. సంజయ్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇదిలావుండగా, బుధవారం సాయంత్రం సంజయ్ భార్య పొలం పనులకు వెళ్లింది. ఆమెతో పాటూ కొడుకు కేశవ్ కూడా వెళ్లాడు. పొలంలో కలుపు మొక్కలు తొలగించడంతో తల్లికి సహకరిస్తుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గడ్డిలో దాక్కుని ఉన్న పాము.. ఒక్కసారిగా బాలుడిని కాటు వేసింది. దీంతో కాసేపటికే కేశవ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కంగారు పడిన కుటుంబ సభ్యులు.. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా స్థానికుల మాటలు విని ఓ తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు.
బాలుడిని తాను బాగు చేస్తానంటూ హామీ ఇచ్చి.. వేపాకుల మధ్యలో పిల్లాడిని పడుకోబెట్టి ఏవేవో పూజలు చేశాడు. రాత్రి 10గంటల వరకూ అక్కడే ఉన్నారు. అప్పటికే సుమారు 6గంటలు గడవడంతో కేశవ్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో తర్వాత స్థానిక వైద్యుడిని సంప్రదించగా.. చనిపోయినట్లు నిర్ధారించాడు. అయినా వారికి నమ్మకం లేక అర్ధరాత్రి 12గంటల సమయంలో మళ్లీ వేరే తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు. అతను కూడా బాగు చేస్తానని చెప్పి వేప ఆకులు కప్పి.. ఉదయం వరకూ పూజలు చేశాడు. మరుసటి రోజు చూడగా కేశవ్ శరీరంలో చలనం లేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు.. చివరకు భరత్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి తీసుకెళ్లారు.
20 ఏళ్ల తర్వాత అందిన సంతానం.. ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరి.. ఒకే ఒక్క ఘటనతో..
పరీక్షించిన వైద్యులు.. బాలుడు రాత్రే మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పటికి తల్లిదండ్రులకు జ్ఞానోదయమై.. ‘‘అయ్యో! అనవసరంగా కొడుకును పొట్టనపెట్టుకున్నామే’’.. అంటూ బోరున విలపించారు. వైద్యులు మాట్లాడుతూ.. పాము కాటు వేసిన వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి ఉండుంటే ప్రాణాలు దక్కేవని చెప్పారు. మూఢ నమ్మకాలతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని, పాము కాటుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. బాలుడి మృతి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-05-05T20:35:50+05:30 IST