శివుడిలాగా వేషం కట్టిన ఈ యువకుడు ఎవరో తెలిస్తే అవాక్కవడం ఖాయం.. అఘోరాలు కూడా ఇతడి కోసమే తరలి వచ్చారు..!
ABN , First Publish Date - 2023-02-21T13:57:56+05:30 IST
ఒళ్ళంతా వీభూతి, మెడలో కాపాలాల దండ, రుద్రాక్ష మాల, చేతిలో త్రిశూలం పట్టుకుని నడుస్తున్న అతని వెంట సాక్షాత్తు సాధువులు, అఘోరాలు నడుస్తున్నారు.
మహా శివరాత్రి రోజు రాత్రి సమయం అందరూ శివనామస్మరణలో మునిగిపోయారు. అప్పుడే శివుడి వేషం కట్టి నడుస్తూ వచ్చాడు ఒక యువకుడు. ఒళ్ళంతా వీభూతి, మెడలో కాపాలాల దండ, రుద్రాక్ష మాల, చేతిలో త్రిశూలం పట్టుకుని నడుస్తున్న అతని వెంట సాక్షాత్తు సాధువులు, అఘోరాలు నడుస్తున్నారు. కైలాసం నుండి ఆ శివుడు తన పరివారంతో వచ్చేశాడేమో అని భక్తితో చేతులెత్తి మొక్కారు ప్రజలందరూ.. అఘోరాలే అతడి వెంట అడుగులు వేసిన ఈ యువకుడు ఎవరు?? ఇతని కథ ఏంటి తెలుసుకుంటే..
గుజరాత్ రాష్ట్రం గోద్రా నగరంలో రిషబ్ పటేల్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతడు శివుడికి వీర భక్తుడు. రెండేళ్ల క్రితం ఇతనికి నిశ్చితార్థం జరిగింది. ఆ తరువాత తనకెంతో ఇష్టమైన శివుడి పర్వదినం శివరాత్రి రోజే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయం తనకు కాబోయే భార్యకు కూడా చెప్పాడు. ఆమె కూడా శివ భక్తురాలే కావడంతో అతని ప్రతిపాదనకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో రిషబ్ పటేల్ తన పెళ్లి గురించి చెప్పి నాగ సాధువులను, అఘోరాలను ఊరేగింపుకు ఆహ్వానించాడు. అతని శివ భక్తికి మెచ్చిన సాధువులు, అఘోరాలు అతని వెంట నడిచారు.
పెళ్లికి ముందు సాధారణంగా బరాత్ జరుగుతుంది. దానికి బదులుగా వరుడు శివుడి వేషంలో అంకళేశ్వర్ గుడికి చేరుకున్నాడు. ఆ తరువాత అక్కడ శివపార్వతుల కల్యాణం జరిగే ముహూర్తానికి రిషబ్ పటేల్ వివాహం కూడా నాగసాధువులు, అఘోరాలు, బంధు మిత్రుల సమక్షంలో జరిగింది. రిషబ్ పటేల్ గుడికి వెళ్ళేటప్పుడు జరిగిన ఊరేగింపు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమాలు జరుగుతున్నంత సేపు శివుడి పాటలతో ఆ ప్రాంతాలు మార్మోగిపోయాయి. ఇది చూసిన ప్రజలు ఆ శివపార్వతులు కైలాసం నుండి దిగివచ్చి తమకు దర్శనమిచ్చి, కల్యాణం చేసుకున్నట్టుందని చెబుతున్నారు.