Viral Video: ఈఎమ్ఐ చెల్లించలేదని రైతుపై బ్యాంకు అధికారుల ఫైర్.. బైక్‌పై ఎక్కించుకుని మరీ బైక్‌ను ఎత్తుకెళ్లారు.. నెట్టింట ఫన్నీ సెటైర్లు..!
ABN, First Publish Date - 2023-03-18T20:40:10+05:30
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే అది వార్తగా మారి ఫోన్‌లోకి వచ్చి చేరుతుంటుంది. కొన్నిసార్లు వార్తల రూపంలో, మరికొన్ని సార్లు వీడియోలు, ఫొటోల రూపంలో వైరల్ అవడం చూస్తుంటాం. వీటిలో కొన్ని..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే అది వార్తగా మారి ఫోన్‌లోకి వచ్చి చేరుతుంటుంది. కొన్నిసార్లు వార్తల రూపంలో, మరికొన్ని సార్లు వీడియోలు, ఫొటోల రూపంలో వైరల్ అవడం చూస్తుంటాం. వీటిలో కొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి నవ్వు తెప్పించే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. విషయానికొస్తే, సాధారణంగా ఈఎమ్‌ఐలు సక్రమంగా చెల్లించని పక్షంలో బ్యాంక్ అధికారులు వివిధ చర్యలకు పూనుకుంటుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వాహనాలను కూడా సీజ్ చేస్తుంటారు. తాజాగా మహారాష్ట్రలో ఇలాగే జరిగింది. ఈఎమ్ఐ చెల్లించలేదని రైతుపై బ్యాంక్ అధికారులు ఆగ్రహించారు. చివరకు సిబ్బంది రైతు బైకును మరో బైకుపై ఎక్కించుకుని తీసుకెళ్లారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్రలోని (Maharashtra) వైజాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ రైతు తీసుకున్న లోన్‌కు ఈఎమ్ఐలు (EMIs) సక్రమంగా చెల్లించలేదు. కొన్ని నెలలు ఓపిగ్గా ఎదురుచూసినా.. రైతు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులకు (Bank officials) చిర్రెత్తుకొచ్చింది. వెంటనే చర్యలు తీసుకోమని సిబ్బందిని ఆదేశించారు. దీంతో రైతు ఇంటి వద్దకు చేరుకున్న సిబ్బంది.. చివరిసారిగా చెప్పి చూశారు. అయినా రైతు చెల్లించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతడి బైకును ఎత్తి.. తమ బైకుపై పెట్టుకుని తీసుకెళ్లారు.
బైకును తీసుకెళ్లడంతో చివరకు చేసేదేమీ లేక సదరు రైతు.. ఈఎమ్ఐ చెల్లించి తన బైకు తాను తెచ్చుకున్నాడు. ఇదిలావుండగా, ప్రస్తుతం బైకుపై బైకును తీసుకెళ్తున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral videos) మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటిది ఒక్క భారతదేశంలోనే సాధ్యం.. అని కొందరు, సిబ్బంది ఖర్చులు తగ్గించేందుకు మంచి ప్లానే వేశారు.. అని ఇంకొందరు, ఇలాంటి ప్రయోగాలు చాలా ప్రమాదకరం అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.
Updated Date - 2023-03-19T09:40:49+05:30 IST