Viral News: ఎవరీ రాంబాబు..? ఒకప్పుడు రోజు కూలీగా పనిచేసిన ఈ కుర్రాడే.. నేడు దేశం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు..!

ABN , First Publish Date - 2023-10-06T11:58:22+05:30 IST

ఈ కుర్రాడి జీవితం గురించి తెలిస్తే అన్ని వనరులు ఉండీ సక్సెస్ కాకపోవడానికి ఏదో ఒక సాకు చెప్పే యువత సిగ్గుపడతారు.

Viral News: ఎవరీ రాంబాబు..? ఒకప్పుడు రోజు కూలీగా పనిచేసిన ఈ కుర్రాడే.. నేడు దేశం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు..!

రాంబాబు అనే పేరును నాచురల్ స్టార్ నాని సినిమాలో కాస్త ఎగతాళిగా చూపించారు. కానీ అదే పేరు ఇప్పుడు దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. వ్యక్తులు వేరు, సందర్బాలు వేరు కానీ ఈ రాంబాబు ఇప్పుడు భారతదేశ ముద్దు బిడ్డ అయ్యాడు. ఉపాధి పథకంలో కూలీగా, హోటల్ లో వెయిటర్ గా డబ్బు సంపాదన కోసం తనకు కనిపించిన ఏ అవకాశాన్ని వదల్లేదు అతను. ఫలితంగా ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ 2023 లో పతకంతో మెరిశాడు. భారతదేశ యువతకు స్పూర్తిగా నిలుస్తున్నాడు. ఈ కుర్రాడి జీవితం గురించి తెలిస్తే అన్ని వనరులు ఉండీ సక్సెస్ కాకపోవడానికి ఏదో ఒక సాకు చెప్పే యువత సిగ్గుపడతారు. ఆసియా గేమ్స్ పతకాల పట్టికలో మరొక సంఖ్యను పైకి తీసుకెళ్ళిన ఈ రాంబాబు స్పూర్తివంతమైన జీవితం గురించి తెలుసుకుంటే..

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం, సోన్ భద్ర జిల్లాలో బహూరా గ్రామంలో రాంబాబు(Ram baboo) కుటుంబం నివసిస్తోంది. రాంబాబు తల్లిదండ్రితో పాటు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ఉన్నారు. రాంబాబు తండ్రి వ్యవసాయ కూలీగా పనిచేస్తాడు. దీనిద్వారా అతనికి వచ్చే ఆదాయం నెలకు మూడున్నర వేలు మాత్రమే. ఆరుమంది బ్రతకడం చాలా కష్టం. రాంబాబు చిన్నప్పుడు తల్లి ఒత్తిడి మీద నవోదయ పరీక్షలు రాసి ఎంపికయ్యాడు. కానీ నవోదయ పాఠశాలలో బోధన అతనికి అర్థం అయ్యేది కాదు. దీంతో ఆటలమీద మక్కువ పెరిగింది. 2012లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ అతని ఆలోచనను మార్చేశాయి. స్కూల్లో ఉన్న టీవీలో సైనా నెహ్వాల్, గగన్ నారంగ్, సుశీల్ కుమార్, మేరీకోమ్ వంటి క్రీడాకారులు పతకాలు సాధించడం అతన్ని ఆకర్షించింది. ఆ తరువాతి రోజు పేపర్ లో మొదట్లోనే వారి ఫోటోలు పెద్దగా వేయడం అతనిలో క్రీడాకారుడిని ఉత్సాహపరిచింది. ఆ రోజు నుండి అతను ఆటల్లో మరింత లీనమయ్యాడు. ఎంతసేపు పరిగెత్తినా అలసిపోకుండా ఉండే తన శరీర తత్వాన్ని గమనించి పరుగును ముఖ్యంగా ఎంచుకున్నాడు.

Python vs Cat: గూట్లో దాక్కున్న పిల్లి పిల్లలు.. తినేందుకు వెతుక్కుంటూ వచ్చిన కొండ చిలువతో తల్లి పిల్లి బిగ్ ఫైట్..!



రాంబాబు మొదట్లో 10వేలు, 5వేల మీటర్లు పరిగెత్తినా ఆ తరువాత మోకాలినొప్పి కారణంగా దాన్ని విరమించుకుని స్థానిక కోచ్ సలహాతో నడకలోకి మారాడు. అప్పటి నుండి నడకలో కూడా కోచింగ్ తీసుకున్నాడు. కోచింగ్ కోసం అతను ఉపాధిహామీ పథకం, ఇంటి నిర్మాణ పనులు, గుంతలు తవ్వడం నుండి హోటల్ లో వెయిటర్ గా కూడా పనిచేశాడు. కొన్నిసార్లు తండ్రితో కలసి వ్యవసాయ పనులకు కూడా వెళ్లాడు. 2021, ఫిబ్రవరిలో నేషనల్ వాకింగ్ ఛాంపియన్ షిప్ లో 50కి.మీ నడకలో రజత పతకం సాధించాడు. ఆ తరువాత వరల్డ్ అథ్లెటిక్స్ ప్రోగామ్ 50కి.మీ నడకను తొలగించి 35కి.మీ లను ప్రవేశపెట్టింది. రాంబాబు ఇందులో పాల్గొన్నాడు. ఆ తరువాత నేషనల్ ఓపెన్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించాడు. గతేడాది నేషనల్ గేమ్స్ లో జాతీయరికార్డు కూడా సృష్టించాడు. ఇప్పుడు ఆసియా గేమ్స్ లో 35 కి.మీ రేస్ వాక్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం(Asia games 2023, 35km mixed walk event bronze medalist) సాధించాడు. ప్రస్తుతం ఆర్మీలో సార్జెంట్ ఉద్యోగంలో ఉన్నాడు. కష్టపడి పతకాలు సాధించడం దిశగా అతను చేసిన ప్రయాణం, దాని కారణంగా అతనికి లభించిన ఉద్యోగంతో దేశ ఖ్యాతి మాత్రమే కాదు, అతని తల్లిదండ్రుల పేదరికాన్ని తొలగించడంలో కూడా విజయం సాధించాడు. ఇతని స్పూర్తివంతమైన కథను ఐఎఫ్ఎస్ ఆపీసర్(IFS Officer) పర్వీన్ కస్వాన్(Parveen Kaswan) సోషల్ మీడియాలో పంచుకోవడంతో రాంబాబు జీవితం మరింత మందికి తెలుస్తోంది.

Viral Video: ఇలాంటి వాళ్లను ఏం చేయాలి..? రోడ్డు దాటుతూ వ్యాన్ వస్తోందని పక్కకు తప్పుకున్న కుక్కను కావాలనే ఢీకొట్టి చంపేసిన డ్రైవర్..


Updated Date - 2023-10-06T11:58:22+05:30 IST