IND vs WI 2nd ODI: కలవరపెడుతున్న వరుణుడు.. మ్యాచ్‌కు ఆటంకం కల్గించే అవకాశం
ABN, First Publish Date - 2023-07-29T16:19:02+05:30
రెండో వన్డే మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు తప్పేలా కనిపించడంలేదు. బార్బడోస్‌లో ప్రస్తుతం ఎండ ఉన్నప్పటికీ మ్యాచ్ సమయానికి మబ్బులు కమ్ముకునే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో చిన్నపాటి జల్లులు, ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశాలున్నాయి.
బార్బడోస్: భారత్, వెస్టిండీస్ మధ్య మరికాసేపట్లో కీలకమైన రెండో వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది. మొదటి వన్డే మ్యాచ్ జరిగిన బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలోనే ఈ మ్యాచ్ కూడా జరగనుంది. మొదటి వన్డేలో గెలిచిన జోష్‌లో ఉన్న టీమిండియా రెండో వన్డే మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే టెస్టు సిరీస్ ఓటమితో డీలాపడ్డ అతిథ్య విండీస్.. వన్డే సిరీస్‌లో వెనుకబడింది. దీంతో రెండో వన్డే మ్యాచ్ గెలిచి సిరీస్ రేసులో నిలవాలని కరేబియన్లు భావిస్తున్నారు. అయితే రెండో వన్డే మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు తప్పేలా కనిపించడంలేదు. బార్బడోస్‌లో ప్రస్తుతం ఎండ ఉన్నప్పటికీ మ్యాచ్ సమయానికి మబ్బులు కమ్ముకునే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో చిన్నపాటి జల్లులు, ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశాలున్నాయి. అయితే వర్షం కారణంగా మ్యాచ్ మొత్తం రద్దయ్యే అవకాశాలు లేవు. కాకపోతే వర్షం పలుమార్లు అడ్డుపడే సూచనలున్నాయి. బార్బడోస్‌లో నేడు ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌గా ఉండొచ్చు. దాదాపు 83 శాతం తేమ ఉండొచ్చు. గంటలకు 27 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి.
తొలి మ్యాచ్‌లో ఇక్కడి పిచ్ బౌన్స్‌తో పాటు టర్న్ కావడంతో పేసర్లు, స్పిన్నర్లు రాణించారు. ఈ సారి టాస్ గెలిస్తే భారత్ బ్యాటింగ్ తీసుకునే అవకాశాలున్నాయి. ఒకవేళ బంతి టర్న్ అయితే బ్యాటర్లు ఎలా రాణిస్తారనేది తేలనుంది. అయితే సాధారణంగా కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా అనుకూలిస్తుంది. బౌలర్లకు మంచి బౌన్స్ లభించనుంది. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బంతి సజావుగా బ్యాట్‌పైకి వస్తుంది. కొంత సమయం తర్వాత పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది. ఇక ఈ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. దీంతో తుది జట్టులో చోటు ఆశిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, చాహల్ ఈ మ్యాచ్‌లోనూ బెంచ్‌కే పరిమితం కాకతప్పకపోవచ్చు.
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్.
Updated Date - 2023-07-29T16:19:02+05:30 IST