Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన డివిలియర్స్
ABN, First Publish Date - 2023-09-26T16:45:58+05:30
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ త్వరలోనే రిటైర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. 34 ఏళ్ల వయసులోనూ సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. టీమిండియా వన్డే ప్రపంచకప్ సాధించాలంటే అతడి రాణింపు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో కోహ్లీ సహచరుడు, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ త్వరలోనే రిటైర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ రిటైర్ అవ్వాలని భావిస్తే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత బెస్ట్ సమయం అని డివిలియర్స్ అన్నాడు. దీంతో కోహ్లీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. సచిన్ సెంచరీల రికార్డు బద్దలు కొట్టకుండా రిటైర్మెంట్ ఎలా ఇస్తాడని నిలదీస్తున్నారు.
కాగా ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ మూడో వన్డేలో బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు రాజ్‌కోట్ చేరుకుని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి అతడి స్నేహితుడు ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ వయసు 34 ఏళ్లకు చేరుకుందని.. ఒకవేళ టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిస్తే అతడు రిటైర్మెంట్ ఇస్తాడా? అని కొందరు జర్నలిస్టులు ఏబీడీని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కోహ్లీ రిటైర్ అవ్వాలని భావిస్తే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత బెస్ట్ సమయం అని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీకి ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడతాడని.. అతడు దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచకప్ కూడా ఆడగలడు అని తనకు తెలుసన్నాడు. అయితే కోహ్లీ రిటైర్మెంట్‌కు ఇంకా చాలా సమయం ఉందని.. ఇప్పుడు మన ఫోకస్ అంతా ఇండియాలో జరిగే ప్రపంచకప్‌పైనే ఉందని డివిలియర్స్ అన్నాడు. కోహ్లీని అడిగినా ఇదే సమాధానం చెప్తాడని తన నమ్మకం అని పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: Hulk Hogan: 70 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్
విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫిట్‌నెస్‌తో క్రికెట్ ఆడుతున్నాడని.. ఒకవేళ అతడు అలసిపోయాడని భావిస్తే అప్పుడప్పుడు సెలక్టర్లు రెస్ట్ కూడా ఇస్తున్నారని డివిలియర్స్ వెల్లడించాడు. రెస్ట్ ఇవ్వడం వల్ల అతడిలో ఇంకా పరుగులు చేయాలన్న ఆకలి పెరుగుతుందని అన్నాడు. ఒకవేళ విరాట్ కోహ్లీ వన్డేలకు రిటైర్మెంట్ ఇవ్వాలని భావిస్తే మాత్రం ప్రపంచకప్ గెలిచిన తర్వాత అదే మంచి సమయం అవుతుందని డివిలియర్స్ తెలిపాడు. అప్పుడు మీడియా ముందుకు వచ్చి అందరికీ థ్యాంక్స్ చెప్పి ఇకపై టెస్టులు, ఐపీఎల్ మాత్రమే ఆడతానని.. తన కెరీర్ చివరి దశను అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పడానికి కోహ్లీకి ప్రపంచకప్ గెలిచిన సమయం కంటే గొప్ప సందర్భం ఎప్పుడు వస్తుందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
Updated Date - 2023-09-26T16:55:10+05:30 IST