Ahmedabad Test: ఖావాజా సెంచరీ.. తొలి రోజు ‘కంగారు’ పెట్టారు!
ABN, First Publish Date - 2023-03-09T17:11:42+05:30
ఉస్మాన్ ఖావాజా(Usman Khawaja) అద్భుతమైన సెంచరీతో కీలకమైన నాలుగో టెస్టుపై ఆస్ట్రేలియా(Australia) పట్టుబిగించింది. తొలి రోజు
అహ్మదాబాద్: ఉస్మాన్ ఖావాజా(Usman Khawaja) అద్భుతమైన సెంచరీతో కీలకమైన నాలుగో టెస్టుపై ఆస్ట్రేలియా(Australia) పట్టుబిగించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియాకు ఘనమైన ఆరంభం ఏమీ లభించలేదు. 32 పరుగులు చేసిన ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను వెనక్కి పంపడం ద్వారా 61 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని అశ్విన్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్(3)ను షమీ బౌల్డ్ చేయడంతో ఆశలు చిగురించాయి. దీనికి తోడు 151 పరుగుల వద్ద కెప్టెన్ స్టీవ్ స్మిత్ (38), 170 పరుగుల వద్ద హ్యాండ్స్‌కోంబ్ (17) పెవిలియన్ చేరడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చినట్టేనని అభిమానులు సంబరపడ్డారు.
అయితే, అప్పటికే క్రీజులో పాతుకుపోయిన ఖావాజా భారత బౌలర్ల ఆశలను చిదిమేశాడు. బౌలర్లను ఎలాంటి తడబాటు లేకుండా ఎదుర్కొంటూ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ సిరీస్‌లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడయ్యాడు. కేమరాన్ గ్రీన్ అతడికి పూర్తి సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి నిదానంగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే కాకుండా స్కోరును పెంచుకుంటూ పోయారు. 246 బంతుల్లో ఖావాజా 15 ఫోర్లతో సెంచరీ (104) పూర్తి చేసుకున్నాడు. గ్రీన్ 64 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేశాడు. ప్రస్తుతం వీరిద్దరూ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీసుకోగా, అశ్విన్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.
Updated Date - 2023-03-09T17:13:58+05:30 IST