ODI World Cup: ఐసీసీ నిబంధనలపై ఆస్ట్రేలియా కెప్టెన్ అసంతృప్తి.. అలాంటి పరిస్థితి రాకూడదని వ్యాఖ్య
ABN, First Publish Date - 2023-11-04T15:56:13+05:30
వన్డే ప్రపంచకప్‌లో ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు 15 మందినే తీసుకోవాలి. అయితే ఈ నిబంధన పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
వన్డే ప్రపంచకప్‌లో ప్రతి జట్టు 15 మందిని ఎంపిక చేసుకోవాలన్న ఐసీసీ నిబంధనలను ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తప్పుబట్టాడు. ప్రపంచకప్ లాంటి టోర్నీ వ్యవధిని దృష్టిలో పెట్టుకుని 15 మంది జట్టు కంటే ఎక్కువ మందిని తీసుకునేలా ఐసీసీ వెసులుబాటు కల్పించాలని కమిన్స్ అభిప్రాయపడ్డాడు. 15 మందినే తీసుకోవాలన్న నిబంధనపై అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ జట్టుకు ప్రస్తుతం 11 మంది మాత్రమే అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా కమిన్స్ ప్రస్తావించాడు. న్యూజిలాండ్ జట్టు లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని అన్నాడు. దురదృష్టవశాత్తూ విలియమ్సన్‌ను జట్టుతో కొనసాగిస్తున్నారని.. అతడిని తప్పించాల్సి వస్తే క్రికెట్‌కు లేదా ప్రపంచకప్‌కు ఇలాంటి పరిణామం మంచిది కాదన్నాడు. ఏ జట్టు అలాంటి పరిస్థితుల్లో ఉండాలని కోరుకోదని.. ఇప్పటికైనా 15 మంది ఆటగాళ్ల కంటే ఎక్కువ మందిని అనుమతించాలని కమిన్స్ పేర్కొన్నాడు. అయితే న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ మాత్రం 15 మంది స్క్వాడ్ మాత్రమే ఉండాలన్న ఐసీసీ నిబంధన సరైందేనని అన్నాడు.
కాగా ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే.. తమ జట్టు ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మంగళవారం ఆప్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నట్లు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లిన మిచెల్ మార్ష్ కూడా కచ్చితంగా తిరిగొచ్చి జట్టుతో కలుస్తాడని ఆశాభావంతో ఉన్నామన్నాడు. తాము సెమీస్‌కు ఇంకా మూడు మ్యాచ్‌ల దూరంలోనే ఉన్నామని.. నాకౌట్ సమయానికి తమకు పూర్తిస్థాయి జట్టు అందుబాటులో ఉంటుందని కమిన్స్ స్పష్టం చేశాడు. అటు టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ ఆట తమకు ఆశ్చర్యం కలిగించిందని వెల్లడించాడు. ఇంగ్లండ్‌పైనా తాము అత్యుత్తమంగా రాణిస్తామని చెప్పాడు. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన కంగారూలు తొలి రెండు మ్యాచ్‌లలో ఓడి తర్వాత నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించారు. దీంతో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
Updated Date - 2023-11-04T15:56:14+05:30 IST