AUS Vs PAK: సెంచరీలతో చెలరేగిన ఆసీస్ ఓపెనర్లు.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ABN, First Publish Date - 2023-10-20T18:16:42+05:30
పాకిస్థాన్‌తో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు సెంచరీలతో చెలరేగిపోయారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది.
బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు సెంచరీలతో చెలరేగిపోయారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. పాకిస్థాన్ ఆటగాళ్లు పలు క్యాచ్‌లను నేలపాలు చేయడం కూడా ఆసీస్ ఓపెనర్లకు కలిసొచ్చింది. ఈ మెగా టోర్నీలో ఇద్దరు ఓపెన్లరు సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ముందుగా డేవిడ్ వార్నర్ 82 బంతుల్లో సెంచరీ సాధించగా.. ఆ మరుసటి బంతికే మిచెల్ మార్ష్ బౌండరీ బాది 100 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా వార్నర్ 124 బాల్స్‌లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163 రన్స్ చేయగా.. మిచెల్ మార్ష్ 108 బాల్స్‌లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121 రన్స్ చేశాడు. ఒక దశలో ఆస్ట్రేలియా 400 రన్స్‌కు పైగా స్కోర్ సాధిస్తుందని అభిమానులు భావించారు. కానీ వార్నర్, మిచెల్ మార్ష్ తప్ప మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో ఆసీస్ 367 పరుగులకే పరిమితమైంది.
ఇది కూడా చదవండి: ODI World Cup: అంపైర్ కెటిల్ బరో నిర్ణయంపై వివాదం.. వైడ్ ఎందుకు ఇవ్వలేదు?
పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 83 పరుగులు ఇచ్చాడు. స్లాగ్ ఓవర్లలో మూడు వికెట్లు తీయడంతో ఫర్వాలేదనిపించాడు. స్టార్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది 10 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. ఉసామా మీర్ కూడా 9 ఓవర్లలో 82 పరుగులు సమర్పించుకుని కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. కాగా ఇన్నింగ్స్ ఆరంభంలో షాహిన్ షా అఫ్రిది వేసిన ఐదో ఓవర్ మూడో బంతికే డేవిడ్ వార్నర్ క్యాచ్ ఔట్‌గా వెనుతిరగాల్సింది. అతడు ఇచ్చిన క్యాచ్‌ను మిడ్ ఆన్‌లో ఉసామా మీర్ నేలపాలు చేశాడు. చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. అప్పటికే వార్నర్ చేసింది 10 పరుగులు మాత్రమే. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
Updated Date - 2023-10-20T18:16:42+05:30 IST