ODI World Cup: 48 ఏళ్ల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు
ABN, First Publish Date - 2023-10-13T16:57:50+05:30
వన్డే ప్రపంచకప్‌లో ఐదు సార్లు విజేతగా నిలిచి పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆసీస్.. ఇప్పుడు వరుసగా నాలుగు పరాజయాలు చవి చూసి అప్రతిష్టను మూటగట్టుకుంది.
వన్డే ప్రపంచకప్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా ఆస్ట్రేలియా చెత్త ప్రదర్శన చేస్తోంది. వన్డే ప్రపంచకప్‌లో ఐదు సార్లు విజేతగా నిలిచి పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆసీస్.. ఇప్పుడు వరుస పరాజయాలతో అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ వన్డే ప్రపంచకప్‌లోనూ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే తొలి మ్యాచ్‌లోనే టీమిండియాపై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోరు చేసినా.. టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలో ఒత్తిడికి గురిచేసింది. దీంతో ఆస్ట్రేలియానే గెలుస్తుందని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ రాణించడంతో టీమిండియా సునాయాసంగా గెలిచింది. రెండో మ్యాచ్‌లో అయినా ఆస్ట్రేలియా అదరగొడుతుందని అభిమానులు ఆకాంక్షించారు. దక్షిణాఫ్రికా జట్టుపై సులభంగానే గెలుస్తుందని అంచనా వేశారు. అనూహ్యంగా 312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 177 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌటైంది.
ఇది కూడా చదవండి: IND vs AFG: ఒకే మ్యాచ్‌లో 15 రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులు ఏంటంటే..?
దీంతో వన్డే ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. 48 ఏళ్ల చరిత్రలో ఆస్ట్రేలియా వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోవడం ఇదే తొలిసారి. 2019 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై ఓడిపోయిన ఆస్ట్రేలియా.. ప్రస్తుత ప్రపంచకప్‌లో టీమిండియా, దక్షిణాఫ్రికాలపై ఓడి చెత్త రికార్డును మూటగట్టుకుంది. కాగా ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా సెమీస్ చేరాలంటే అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియా మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో కనీసం 6 మ్యాచ్‌లు అయినా గెలవాలి. అది కూడా మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధిస్తేనే సెమీస్ చేరే అవకాశం ఉంటుంది.
Updated Date - 2023-10-13T16:59:57+05:30 IST