Team India: దక్షిణాఫ్రికాపై ఓడిపోవాలని కోరుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఇదే..!!
ABN, First Publish Date - 2023-11-03T15:03:36+05:30
మనవాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచింది. మళ్లీ అలాంటి ఫీట్ ప్రస్తుత ప్రపంచకప్‌లో రిపీట్ చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. అయితే లీగ్ దశలో మన జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఆదివారం దక్షిణాఫ్రికాతో, వచ్చే ఆదివారం నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి అన్నింట్లో గెలిచిన టీమిండియా ఆదివారం జరిగే దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మాత్రం ఓడిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే మనవాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక పని చేయాలంటే మంచి ముహూర్తం, మంచి శకునం చూసి ప్రారంభిస్తారు. అలాంటిది విజయం సాధించాలంటే గతంలో ఏం జరిగిందో అదే రిపీట్ కావాలని కోరుకోవడంలో అతిశయోక్తి ఉండదు. 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచింది. మళ్లీ అలాంటి ఫీట్ ప్రస్తుత ప్రపంచకప్‌లో రిపీట్ చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 2011లో కూడా లీగ్ దశలో భారత్ అన్ని మ్యాచ్‌లలో గెలిచింది. కానీ దక్షిణాఫ్రికాపై మాత్రం ఓడిపోయింది. అందుకే ఇప్పుడు కూడా దక్షిణాఫ్రికాపై ఓడిపోవాలని.. అప్పుడు నాకౌట్‌కు ముందు జట్టులో ఏవైనా తప్పులు బయటపడటంతో పాటు సెంటిమెంట్‌గా కూడా కలిసొస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతానికి టీమిండియాలో ఎలాంటి లోపాలు కనిపించడం లేదు. బ్యాటింగ్ విభాగంతో పాటు బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లలో మనోళ్లు ఎలా ఆడతారో చూడాలి. 2019 ప్రపంచకప్‌లో కూడా టేబుల్ టాపర్‌గా నిలిచి సెమీస్‌లో మాత్రం న్యూజిలాండ్‌పై ఓటమి చెందారు. ఈసారి అలా కాకూడదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. టేబుల్ టాపర్‌గా నిలిచే కంటే ఒక ఓటమితో సెమీస్ ఆడితే పోయేదేమీ లేదని అంటున్నారు. అటు దక్షిణాఫ్రికాతో టీమిండియా తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. సూర్యకుమార్ స్థానంలో ఇషాన్ కిషన్, బుమ్రా స్థానంలో శార్దూల్ ఠాకూర్ ఆడతారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ తుది జట్టులో సూర్యకుమార్, ఇషాన్ కిషన్ ఇద్దరూ ఉండాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తే కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
Updated Date - 2023-11-03T15:03:37+05:30 IST