Virat Kohli On MS Dhoni: ధోనీతో స్నేహంపై పెదవి విప్పిన విరాట్ కోహ్లీ
ABN, First Publish Date - 2023-02-25T17:07:25+05:30
భారత(Team India) క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఖ్యాతి గాంచిన
న్యూఢిల్లీ: భారత(Team India) క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఖ్యాతి గాంచిన మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న క్రికెటర్ కింగ్ కోహ్లీనే. ధోనీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కోహ్లీ(Virat Kohli) భారత జట్టుకు మరింత దూకుడు నేర్పాడు. అసాధారణ విజయాలు అందించి జట్టును అగ్రస్థానంలో నిలబెట్టాడు. మైదానంలో దిగిన ప్రతిసారి పరుగుల వాన కురిపించి ఎన్నో రికార్డులను తన పేర రాసుకున్నాడు. ధోనీకి, తనకి మధ్య ఉన్న బంధంపై కోహ్లీ తాజాగా పెదవి విప్పాడు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్ 2(RCB Podcast Season 2)లో బోల్డన్ని విషయాలు పంచుకున్నాడు.
ధోనీ-కోహ్లీ ఇద్దరూ 2008 నుంచి 2019 వరకు డ్రెస్సింగ్ రూమును పంచుకున్నారు. ఆ తర్వాత ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. అప్పటి పరిస్థితుల్లో ధోనీ తనను వారసుడిగా ఎంచుకున్నాడని, కెప్టెన్సీ బదలాయింపునకు సంబంధించి ఎలా భయాలు తలెత్తలేదని పేర్కొన్నాడు. తానెప్పుడూ అతడి కుడి భుజాన్నేనని చెప్పుకొచ్చాడు. 2012లో ధోనీ తనను అతడి వింగ్‌లోకి తీసుకున్నాడని, అప్పటి నుంచి పగ్గాలు బదలాయించేందుకు స్టార్ బ్యాటర్‌ను తయారు చేయడం ప్రారంభించాడని వివరించాడు.
తాను ధోనీ రైట్ హ్యాండ్‌నని, మ్యాచ్ కోసం తాము ఏం చేయగలమనే విషయాన్ని చర్చించుకునే వాళ్లమని చెప్పాడు. తాము కలిసున్న కాలంలో ఎప్పుడూ ఇద్దరి మధ్య ఇబ్బందికర పరిస్థితి తలెత్తలేదని కోహ్లీ పేర్కొన్నాడు. ‘‘నిజం ఏంటంటే.. ధోనీయే నన్ను ఎంచుకున్నాడు’’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
‘‘ధోనీకి నేను ఎంతో ఇన్‌పుట్ ఇచ్చేవాడిని. ఫీల్డింగ్ చేస్తూ బంతి వెనక్కి విసరడానికే నేను పరిమితం కాలేదు. మ్యాచ్ కష్టంగా ఉన్నప్పుడు నేను ధోనీ వద్దకు వెళ్లి మాట్లాడేవాడిని. స్కోరు బోర్డు చూసి అయ్యో ఇన్ని పరుగులు బాదేశారే.. అని ఎప్పుడూ అనుకోలేదు. అసలు పిచ్ ఎలా ఉంది.. పరిస్థితులు ఎలా ఉన్నాయి, భాగస్వామ్యాన్ని విడదీసేందుకు ఏం చేయాలన్న విషయాల గురించే ఆలోచించేవాడిని’’ అని కోహ్లీ వివరించాడు.
ధోనీ కూడా త్వరగానే అర్థం చేసుకోవడంతో అంతా సాఫీగా జరిగిపోయింది. భారత జట్టును అతడు నడిపించిన తీరుకు అప్పుడు , ఇప్పుడు కూడా అతడంటే గౌరవమేనని అన్నాడు.
Updated Date - 2023-02-25T17:07:26+05:30 IST