IND vs ENG: గట్టిగా ఇచ్చిపడేశారు.. ఇంగ్లండ్ బార్మీ ఆర్మీకి గట్టి కౌంటరిచ్చిన భారత్ ఆర్మీ.. అసలు ఏం జరిగిందంటే..?
ABN, First Publish Date - 2023-10-30T11:09:27+05:30
వరల్డ్‌కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత్, ఇంగ్లండ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.
లక్నో: వరల్డ్‌కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా 6 విజయాలతో రోహిత్ సేన సెమీస్‌కు చేరువైంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత్, ఇంగ్లండ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. పోటీ పడి మరి ఒకరి ఆటగాళ్లను మరొకరు ట్రోల్ చేసుకున్నారు. నిజానికి ఈ ట్రోలింగ్ ఇంగ్లండ్ అభిమానులే మొదలుపెట్టారు. మన జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఇంగ్లీష్ జట్టు అభిమానులు ట్రోల్ చేశారు. కానీ ఆ ఆనందం ఇంగ్లండ్ అభిమానులకు ఎంతో సేపు నిలవలేదు. ఆ కాసేపటికే ఇంగ్లండ్ అభిమానులకు భారత్ అభిమానులు గట్టిగా ఇచ్చిపడేశారు. ప్రస్తుతం రెండు జట్ల అభిమానుల మధ్య నెలకొన్న ఈ వార్ నెట్టింట వైరల్‌గా మారింది.
అసలు ఏం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. విల్లీ వేసిన 7వ ఓవర్‌లో డకౌట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ ఒక పరుగు కూడా చేయలేకపోయాడు. ఈ టోర్నీలో కోహ్లీ డకౌట్ కావడం ఇదే మొదటి సారి. దీంతో ఇంగ్లండ్ అభిమానులు వెంటనే సోషల్ మీడియాలో కోహ్లీని ట్రోల్ చేశారు. ఇంగ్లడ్ బార్మీ ఆర్మీ పేరుతో ఉన్న ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో నీటిలో ఉన్న బాత్‌కు కోహ్లీ మోహాన్ని పెట్టి పోస్ట్ చేశారు. దానికి ‘మార్నింగ్ వాకింగ్ కోసం బయలుదేరాను’ అని రాసుకొచ్చారు. కానీ ఆ ఆనందం ఇంగ్లండ్ అభిమానులకు ఎంతో సేపు నిలవలేదు. ఆ కాసేపటికే మొదలైన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కీలక ఆటగాళ్లైన జో రూట్, బెన్ స్టోక్స్ కూడా డకౌట్ అయ్యారు. బుమ్రా వేసిన 5వ ఓవర్‌లో రూట్ గోల్డెన్ డకౌట్ కాగా.. 10 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్ ఒక పరుగు కూడా చేయకుండానే షమీ వేసిన 8వ ఓవర్‌లో డకౌటయ్యాడు. దీంతో వెంటనే ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ అభిమానులకు టీమిండియా అభిమానులు కౌంటరిచ్చారు. అది కూడా ఇంగ్లండ్ అభిమానులు చేసిన విధంగానే భారత్ అభిమానులు కూడా ట్రోలింగ్ చేసి వారికి దిమ్మ తిరిగే షాకిచ్చారు. ది భారత్ ఆర్మీ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలో నీటిలో ఉన్న బాత్‌లకు జో రూట్, బెన్ స్టోక్స్ మోహాలను పెట్టారు. దానికి ‘ ఈవెనింగ్ వాకింగ్ కోసం బయలు దేరాను’ అని రాసుకొచ్చారు. ఇంగ్లండ్ అభిమానుల తిక్క కుదిర్చారు. దీంతో ఇంగ్లండ్ అభిమానులకు భారత అభిమానులు ఇచ్చిన ఈ కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జోరు మీదున్న భారత జట్టుకు వరుసగా ఆరో విజయం దక్కింది. బ్యాటింగ్‌లో ఇబ్బందిపడినా.. బౌలర్లు అద్భుత రీతిలో ఆదుకున్నారు. దీంతో 230 పరుగుల స్వల్ప ఛేదన సైతం ఇంగ్లండ్‌కు కొండంతలా మారింది. ఫలితంగా 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్ 12 పాయింట్లతో సెమీస్‌కు అతి చేరువలో నిలిచింది. అటు ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు పాయింట్లతోనే ఉన్న ఇంగ్లండ్ ఇంకా సాంకేతికంగా రేసులోనే ఉన్నా ముందుకెళ్లడం అసాధ్యమే. కెప్టెన్ రోహిత్ శర్మ (101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 87) కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకోగా, పేసర్లు షమి (4/22), బుమ్రా (3/32) ఇంగ్లండ్‌ను వణికించారు. తాజా టోర్నీలో తొలిసారిగా ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. సూర్యకుమార్ (49), రాహుల్ (39) అండగా నిలిచారు. డేవిడ్ విల్లేకు మూడు.. వోక్స్, రషీద్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత స్వల్ప ఛేదనలో ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. లివింగ్‌స్టోన్ (27) టాప్‌స్కోరర్. కుల్దీ్‌పకు రెండు, జడేజాకు ఓ వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా రోహిత్ నిలిచాడు.
Updated Date - 2023-10-30T11:09:32+05:30 IST