ODI World Cup: న్యూజిలాండ్ జట్టులో అదరగొడుతున్న భారత సంతతి ఆటగాడు
ABN, First Publish Date - 2023-10-06T15:45:16+05:30
భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర వన్డేల్లో భారత్‌పైనే న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మూడు టెస్టులు, 18 టీ20లు, 13 వన్డేలు ఆడి బౌలింగ్‌లో 27 వికెట్లు సాధించాడు.
వన్డే ప్రపంచకప్ చడీచప్పుడు లేకుండా ప్రారంభమైనా.. తొలి మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఏకైక ఆటగాడు రచిన్ రవీంద్ర మాత్రమే. ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఏకపక్షంగా విజయం సాధించడంలో రచిన్ రవీంద్ర కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో ఒక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్‌లో సెంచరీతో సత్తా చాటాడు. అంతకుముందు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శనే చేశాడు. అయితే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌పై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడటంతో రచిన్ రవీంద్ర పేరు ఇప్పుడు ప్రపంచమంతా మార్మోగిపోతోంది. అయితే అతడు భారత సంతతి ఆటగాడు కావడం క్రికెట్ అభిమానుల్లో మరింత ఆసక్తి రేపుతోంది.
భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర వన్డేల్లో భారత్‌పైనే న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మూడు టెస్టులు, 18 టీ20లు, 13 వన్డేలు ఆడి బౌలింగ్‌లో 27 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్‌లో ఒక సెంచరీతో పాటు ఒక హాఫ్ సెంచరీ చేశాడు. సెంచరీ కూడా ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లోనే సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ప్రమోషన్ పొందాడు. సాధారణంగా ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు దిగే రచిన్ రవీంద్ర ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ లేకపోవడంతో అతడి స్థానంలో బరిలోకి దిగాడు. 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 నాటౌట్‌గా నిలిచి న్యూజిలాండ్ విజయం సాధించేందుకు కృషి చేశాడు.
ఇది కూడా చదవండి: ODI World Cup: ప్రపంచకప్‌లో ఒక్క సెకన్ ప్రకటన ఖర్చు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!!
23 ఏళ్ల రచిన్ రవీంద్ర స్వస్థలం భారత్‌లోని బెంగళూరు. అతడి తల్లిదండ్రులు 1990లోనే న్యూజిలాండ్‌కు వలస వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. అక్కడే పుట్టి పెరిగిన రచిన్ రవీంద్ర.. క్రికెట్ ఓనమాలు భారత్‌లోనే నేర్చుకున్నాడు. అయితే ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్(ఆర్‌డీటీ)కు వచ్చి రచిన్ క్రికెట్ ఆడేవాడు. తన తండ్రి కృష్ణమూర్తి స్థాపించిన హాట్ హాక్స్ క్లబ్ తరఫున ఆడేవాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్‌ను అభిమానించే తన తల్లిదండ్రులు వారిద్దరి పేర్లు కలిసేలా రచిన్ అనే పేరు పెట్టారని ఓ ఇంటర్వ్యూలో రచిన్ రవీంద్ర స్వయంగా వెల్లడించాడు.
Updated Date - 2023-10-06T15:45:16+05:30 IST