ODI World Cup 2023: వాళ్ల కోసమే ఈ మ్యాచ్ గెలిచాం.. పాకిస్థాన్ క్రికెటర్ సంచలన ప్రకటన
ABN, First Publish Date - 2023-10-11T19:16:53+05:30
ప్రపంచకప్‌లో శ్రీలంకపై సాధించిన విజయాన్ని గాజా ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుసగా రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో ఆడిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని కూడా పాకిస్థాన్ ఛేదించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 48.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్‌తో పాటు వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ సెంచరీతో చెలరేగారు. ముఖ్యంగా పాకిస్థాన్ విజయంలో రిజ్వాన్ కీలక పాత్ర పోషించాడు. 121 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు. షకీల్ (31), ఇఫ్తికార్ అహ్మద్ (22) కూడా రాణించారు.
ఇది కూడా చదవండి: IND vs AFG: వారెవ్వా.. ఈ వరల్డ్ కప్‌లోనే బెస్ట్ క్యాచ్ అందుకున్న టీమిండియా ప్లేయర్
కాగా ప్రపంచకప్‌లో శ్రీలంకపై సాధించిన విజయాన్ని గాజా ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో గాజా ప్రజలు ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నారు. దీంతో రిజ్వాన్ భావోద్వేగానికి గురయ్యాడు. గాజా ప్రజల కోసమే ఈ మ్యాచ్ గెలిచామని అభిప్రాయపడ్డాడు. అటు శ్రీలంకపై విజయంలో తన వంతు పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉందని రిజ్వాన్ అన్నాడు. శ్రీలంకపై భారీ స్కోరు ఛేదించడంలో సహకారం అందించిన హసన్ అలీ, అబ్దుల్లా షఫీఖ్‌కు రిజ్వాన్ తన అభినందనలు తెలియజేశాడు. తమ జట్టును ఆదరించినందుకు హైదరాబాద్ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపాడు. అటు రెండు వారాల పాటు హైదరాబాద్‌లో బస చేసిన పాకిస్థాన్ జట్టు బుధవారం నాడు అహ్మదాబాద్ బయలుదేరింది. ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండింట్లోనూ పాకిస్థాన్ విజయం సాధించడం విశేషం. పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న పాకిస్థాన్ జట్టు రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని ఈనెల 14న టీమిండియాతో మ్యాచ్‌కు సిద్ధం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు పీసీబీ ఛైర్మన్ జాకా ఆష్రఫ్ కూడా హాజరుకానున్నారు.
Updated Date - 2023-10-11T19:16:53+05:30 IST