MS Dhoni: వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై తొలిసారి స్పందించిన ఎంఎస్ ధోని.. ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-10-27T12:11:23+05:30
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా అదరగొడుతోంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అన్ని విభాగాల్లోనూ రాణిస్తోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారతే కావడం విశేషం. ఆడిన 5 మ్యాచుల్లోనూ గెలిచి మొత్తం 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా అదరగొడుతోంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అన్ని విభాగాల్లోనూ రాణిస్తోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారతే కావడం విశేషం. ఆడిన 5 మ్యాచుల్లోనూ గెలిచి మొత్తం 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇక మరొకటి లేదా రెండు విజయాలు సాధిస్తే అధికారికంగా సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది. మొత్తంగా ఐసీసీ టైటిల్ కరువును తీర్చాలని టీమిండియా భావిస్తోంది. చివరిసారిగా 2013లో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అంతకుముందు 2011లో వరల్డ్ కప్‌ను సాధించింది. ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాబట్టి ప్రస్తుత వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శన, అంచనాలపై ధోనీ వ్యాఖ్యానించడం ఆసక్తికరమే. మరి టీమిండియా కప్ గెలవడంపై ఎంఎస్ ధోనీ అభిప్రాయాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
టీమిండియా జట్టు అద్భుతంగా ఉందని ధోనీ వ్యాఖ్యానించాడు. జట్టు సమతూకం చాలా బాగుందని, ఆటగాళ్లందరూ బాగా ఆడుతున్నారని ధోనీ ప్రశంసించాడు. కాబట్టి అంతా బాగుందని, తాను ఇంతకు మించి ఏమీ చెప్పబోనని వ్యాఖ్యానించాడు. తెలివైన వారికి తన సంకేతం అర్థమవుతుందని చెప్పాడు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ ఈ వ్యాఖ్యానించాడు. కాగా 2011లో సచిన్ కోసమైనా కప్ గెలవాలని చాలామంది ఆకాంక్షించారు. ఈసారి కోహ్లీ కోసం కప్ గెలవాలనేవారు కోరుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. మరి టీమిండియా ఆటగాళ్లు ఏం చేస్తారో వేచిచూడాలి.
Updated Date - 2023-10-27T12:11:23+05:30 IST