Rashid Khan: ఈ ఒక్క విజయంతో ప్రపంచకప్ గెలిచినంత ఆనందంగా ఉంది
ABN, First Publish Date - 2023-10-24T20:41:55+05:30
సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విక్టరీ సాధించడం తమకు ప్రపంచకప్ గెలిచినంత ఆనందాన్ని ఇస్తోందని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. ఈ విజయంతో తమలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని రషీద్ చెప్పుకొచ్చాడు.
క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ ప్రమాదకరంగా మారుతోంది. వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన కొద్ది రోజులకే పాకిస్థాన్ లాంటి జట్టును కూడా ఆప్ఘనిస్తాన్ చావుదెబ్బ తీసింది. అనూహ్యంగా పాకిస్థాన్‌పై చారిత్రక విజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లంతా కనివినీ ఎరుగని రీతిలో సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్‌పై గెలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ మైదానంలోనే డ్యాన్సులు కూడా చేశారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆప్ఘనిస్తాన్‌కు ఇది కేవలం మూడో విజయం మాత్రమే. 2015లో స్కాట్లాండ్‌పై గెలిచిన తర్వాత 2023 వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. 2019లో అయితే ఆడిన 9 మ్యాచ్‌లలోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. దీంతో ఆప్ఘనిస్తాన్‌తో మ్యాచ్ అంటే గెలుపు సులువేనని అందరూ అనుకున్నారు. కానీ ఇంగ్లండ్, పాకిస్థాన్ లాంటి టైటిల్ ఫేవరెట్లను ఓడించడంతో ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ అంటే అన్ని జట్లు వణికిపోతున్నాయి.
ఇది కూడా చదవండి: South Africa: అదరగొడుతున్న సఫారీలు.. 8 మ్యాచ్‌లు.. 7 సార్లు 300 ప్లస్ స్కోర్లు..!!
మరోవైపు పాకిస్తాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు వన్డేల్లో ఇదే తొలి విజయం. ఈ గెలుపు ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో రావడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఈ విజయంపై ఆప్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్పందించాడు. పాక్ లాంటి జట్టుపై మ్యాచ్ గెలవడంతో ప్రపంచకప్ గెలిచినట్లు అనిపిస్తోందన్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు తాము పాకిస్తాన్ జట్టుతో 7 మ్యాచ్‌లు ఆడామని.. కానీ ఒక్కటీ గెలవలేకపోయామని తెలిపాడు. కానీ సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విక్టరీ సాధించడం తమకు ప్రపంచకప్ గెలిచినంత ఆనందాన్ని ఇస్తోందని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. ఈ విజయంతో తమలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని రషీద్ చెప్పుకొచ్చాడు. అటు పాకిస్థాన్‌పై ఇలాంటి విజయం సాధించడం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆప్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అన్నాడు. జట్టుకే కాకుండా ఆఫ్ఘనిస్థాన్ ప్రజలందరికీ ఇవి మధుర క్షణాలు అని... వీటి కోసం దాదాపు 12 ఏళ్ల నుంచి వేచి చూస్తున్నామని చెప్పాడు. వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో పాక్‌ను ఓడించిన జట్టులో ఉండటం తన కెరీర్‌కే హైలైట్ అని పేర్కొన్నాడు. కొన్నిరోజుల కిందట ఇంగ్లండ్‌ను మట్టికరిపించామని.. ఇప్పుడు పాక్‌పై కూడా గెలవడంతో జట్టులోని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని మహ్మద్ నబీ వివరించాడు.
Updated Date - 2023-10-24T20:41:55+05:30 IST