Suryakumar Yadav: టెస్టు అరంగేట్రంపై సూర్యకుమార్ హింట్!
ABN, First Publish Date - 2023-02-04T17:17:06+05:30
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇరగదీస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్
న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇరగదీస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) టెస్టు(Test Match) అరంగేట్రంపై హింట్ ఇచ్చేశాడు. భవిష్యత్‌లో సూర్య ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా మారతాడని ఇప్పటికే క్రికెట్ పండితులు తేల్చేశారు. ఆస్ట్రేలియా(Australia)తో స్వదేశంలో త్వరలోనే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ప్రారంభం కానున్న నేపథ్యంలో సూర్యకుమార్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు హింట్ ఇచ్చాడు. ‘హలో ఫ్రెండ్’ క్యాప్షన్‌తో రెడ్‌బాల్ ఫొటోను షేర్ చేసిన సూర్య.. టెస్టుల్లోకి వచ్చేస్తున్నానంటూ చెప్పకనే చెప్పాడు.
రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని సూర్యకుమార్‌తో భర్తీ చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వరుసగా మూడు నాలుగైదు స్థానాల్లో క్రీజులోకి వచ్చే అవకాశం ఉండడంతో సూర్యకుమార్‌ను ఆరోస్థానంలో దింపాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఆ స్థానంలో అయితే అతడు ఎలాంటి ఒత్తిడి లేకుండా యథేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా రవీంద్ర జడేజాతో కలిసి చక్కని ఫినిషింగ్ ఇస్తాడని చెబుతున్నారు.
సూర్యకుమార్ గతేడాది ముంబై తరపును రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 80 బంతుల్లో 90 పరుగులు చేశాడు. ఆ తర్వాత సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 107 బంతుల్లో 95 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇందులో 14 బౌండరీలు, ఓ భారీ సిక్స్ ఉంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఈ నెల 9న నాగ్‌పూర్ టెస్టుతో ప్రారంభం అవుతుంది.
Updated Date - 2023-02-04T17:17:09+05:30 IST