Team India: రోహిత్ సేన బహుపరాక్.. ఆ విషయంలో డొల్లతనం అధిగమించాలి..!!
ABN, First Publish Date - 2023-10-30T16:28:09+05:30
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించినా బ్యాటింగ్‌లో డొల్లతనం బయటపడింది. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేతులారా వృథా చేసుకుంది.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా అన్నింట్లోనూ గెలిచింది. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించినా బ్యాటింగ్‌లో డొల్లతనం బయటపడింది. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేతులారా వృథా చేసుకుంది. ఇదే ప్రదర్శన నాకౌట్ మ్యాచ్‌లలో చేస్తే పరిస్థితి ఏంటని పలువురు క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పిచ్ సహకరించకపోయినా కొందరు సీనియర్ ఆటగాళ్లు నిర్లక్ష్యపు షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని సూచిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా నిరాశపరిచారని అంటున్నారు. రోహిత్ కనుక నిలబడకపోయి ఉంటే భారత్ మరింత తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చేదని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా విజయ గర్వం ప్రదర్శించకుండా వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: World Cup: గుడ్ న్యూస్.. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే జట్టులో చేరనున్న హార్దిక్ పాండ్యా.. కానీ..
ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత ప్రపంచకప్‌లో కూడా టీమిండియా పాయింట్ల టేబుల్‌లో టాప్‌లోనే ఉందని.. కానీ సెమీస్‌లో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడి ఓటమిని మూటగట్టుకుందని కొందరు గుర్తుచేస్తున్నారు. ఈ విషయం టీమిండియా గుర్తుపెట్టుకోవాలని.. నాకౌట్‌లో ఎవరితో తలపడాల్సి వచ్చినా మంచి ప్రదర్శన చేయడమే లక్ష్యమని.. ఆ దిశగా అన్ని విభాగాలు రాణించాలని కోరుకుంటున్నారు. ఇప్పటివరకు చూసుకుంటే బ్యాటింగ్‌లో రోహిత్, కోహ్లీ, రాహుల్ తప్ప మిగతా బ్యాటర్లు నిరాశపరుస్తున్నారని.. శ్రేయాస్, జడేజా కూడా ఫామ్ అందుకోవాలని టీమిండియా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పాయింట్ల పట్టిక చూసుకుంటే సెమీఫైనల్లో ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ ఎదురుపడే అవకాశాలు ఉన్నాయని.. ఆయా జట్లతో టీమిండియా జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు.
Updated Date - 2023-10-30T16:28:24+05:30 IST