Team India: మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్.. చరిత్రలో రెండో జట్టుగా రికార్డు
ABN, First Publish Date - 2023-09-23T13:49:41+05:30
ఐసీసీ ర్యాంకులకు సంబంధించి ఏకకాలంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. గతంలో ఈ ఫీట్ దక్షిణాఫ్రికా జట్టు మాత్రమే సాధించింది.
మొహాలీ వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించడంతో ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటికే టెస్టుల్లో, టీ20ల్లో భారత్ నంబర్‌వన్‌గా ఉంది. దీంతో ఏకకాలంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతోంది. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. గతంలో ఈ ఫీట్ దక్షిణాఫ్రికా జట్టు మాత్రమే సాధించింది. 2012లో సఫారీ జట్టు ఒకే సమయంలో మూడు ఫార్మాట్లలో ఐసీసీ ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. సుమారు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ఈ ఫీట్ సాధించింది.
వాస్తవానికి ఆసియా కప్ గెలవగానే వన్డేల్లో టీమిండియా ఐసీసీ ర్యాంకుల్లో నంబర్‌వన్ కావాలి. కానీ అంతకుముందు ర్యాంకుల్లో దిగువన ఉన్న బంగ్లాదేశ్‌పై ఓడిపోవడం మైనస్‌గా మారింది. దీంతో టాప్ టీమ్ ఆస్ట్రేలియాపై గెలవగానే భారత్ పాయింట్లు 116కు చేరుకున్నాయి. దీంతో వన్డేల్లో టాప్ జట్టుగా భారత్ అవతరించింది. టీమిండియా ఈ రికార్డు సృష్టించిన సందర్భంగా బీసీసీఐ, ఐసీసీ ప్రత్యేక పోస్టర్లు విడుదల చేశాయి. వీటిని చూసిన క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో టీమిండియా డామినేట్ చేస్తోందని, వన్డే ప్రపంచకప్ కూడా గెలిస్తే ఈ సంతోషం రెట్టింపు అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వన్డే ప్రపంచ కప్ విజేతకు రూ. 33 కోట్లు
కాగా ఐసీసీ వన్డే ర్యాంకుల్లో భారత్ 116 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థాన్ 115 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొహాలీ వన్డేలో ఓడిపోవడంతో ఆస్ట్రేలియా 111 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. దక్షిణాఫ్రికా (106), ఇంగ్లండ్ (105), న్యూజిలాండ్ (100), బంగ్లాదేశ్ (94), శ్రీలంక (92), ఆప్ఘనిస్తాన్ (80), వెస్టిండీస్ (68) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Updated Date - 2023-09-23T13:49:41+05:30 IST