Team India: సెప్టెంబర్ ఆసియా కప్.. అక్టోబర్ ఏషియన్ గేమ్స్.. నవంబర్ వరల్డ్ కప్ లోడింగ్..!!
ABN, First Publish Date - 2023-10-09T16:14:00+05:30
సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో విజేతగా నిలిచింది. అక్టోబరులో చైనా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లోనూ సత్తా చాటింది. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది.
ఈ ఏడాది టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉంది. ఇప్పటికే మూడు ఫార్మాట్లలో ఐసీసీ ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా ఉంది. వన్డేల్లో 116 పాయింట్లతో, టెస్టుల్లో 118 పాయింట్లతో, టీ20ల్లో 264 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతేకాకుండా సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో విజేతగా నిలిచింది. అక్టోబరులో చైనా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లోనూ సత్తా చాటింది. ప్రపంచకప్ ఉండటంతో జూనియర్ జట్టును ఏషియన్ గేమ్స్‌కు పంపింది. అయినా స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఇక మిగిలింది వన్డే ప్రపంచకప్ విజేతగా నిలవడమే.
ఇది కూడా చదవండి: World cup: టీమిండియాకు బిగ్ షాక్! ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు కూడా గిల్ దూరం.. మరి పాక్‌తో మ్యాచ్ సంగతేంటి?..
నవంబర్‌లో జరిగే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా విశ్వవిజేతగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో పటిష్ట జట్టు ఆస్ట్రేలియాపై దుమ్మురేపేలా టీమిండియా విజయం సాధించడం అభిమానుల్లో మరింత అంచనాలను పెంచింది. 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియా.. సుదీర్ఘ విరామం తర్వాత 2011లో ధోనీ ఆధ్వర్యంలో సొంతగడ్డపై రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. 12 ఏళ్ల తర్వాత మరోసారి సొంతగడ్డపై మెగా టోర్నీ జరుగుతోంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా ఉన్న టీమిండియా వన్డే ప్రపంచకప్‌ను ముచ్చటగా మూడోసారి కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లోనే అతిపెద్ద అగ్నిపరీక్ష ఎదురైంది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం రెండు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా.. కచ్చితంగా ఓడిపోతుందని అంతా అనుకున్నారు. అయితే తమ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టుదల కనబరిచిన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేసి జట్టును ఆదుకున్నారు. టోర్నీలో ఇంకా 8 లీగ్ మ్యాచ్‌లు ఉండటంతో టీమిండియా ఎలా ఆడుతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Updated Date - 2023-10-09T16:14:00+05:30 IST