Team India: తిలక్ వర్మకు ఏమైంది? ఇలా ఆడితే తుది జట్టులో చోటు కష్టమేగా..!!
ABN, First Publish Date - 2023-08-21T16:13:54+05:30
వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో నిలకడగా రాణించిన తెలుగు తేజం తిలక్ వర్మ ఐర్లాండ్‌తో సిరీస్‌లో విఫలం అవుతుండటం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్, రెండో మ్యాచ్‌లో సిల్వర్ డకౌట్ కావడం తిలక్ వర్మ సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ షార్ట్ పిచ్ బాల్‌కే వెనుదిరిగాడు.
ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అందరినీ ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో మిడిలార్డర్‌లో స్థిరంగా రాణించాడు. జట్టుకు అవసరం వచ్చినప్పుడు ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో అతడికి వెంటనే జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఐపీఎల్ తర్వాత వెస్టిండీస్‌లో పర్యటించిన టీమిండియాకు అతడి రూపంలో మంచి లెఫ్ట్ హ్యాండర్ దొరికాడు. దీంతో ఐదు టీ20ల సిరీస్ కోసం తిలక్ వర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. తనపై సెలక్టర్లు ఉంచిన నమ్మకాన్ని తెలుగు తేజం వమ్ము చేయలేదు. తొలి టీ20లో 39 పరుగులతో రాణించాడు. సదరు మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినా అతడి షాట్ సెలక్షన్ చూడముచ్చటగా కనిపించింది. ఇక రెండో టీ20లో ఏకంగా హాఫ్ సెంచరీతో తిలక్ వర్మ సత్తా చాటాడు. మూడో టీ20ల్లో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు.
అంతర్జాతీయ అరంగేట్రంలోనే తొలి మూడు మ్యాచ్‌ల్లో రాణించిన తిలక్ వర్మ నాలుగో టీ20లో మాత్రం 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయగా తెలుగు తేజం 27 పరుగులు చేశాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు. మొత్తంగా చూస్తే వెస్టిండీస్ సిరీస్‌లో తిలక్ వర్మ ప్రదర్శన జట్టు మేనేజ్‌మెంట్‌ను సంతృప్తి పరిచింది. దీంతో సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో ఐర్లాండ్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా సెలక్టర్లు తిలక్ వర్మకు అవకాశం కల్పించారు.
ఇది కూడా చదవండి: Asia Cup 2023: రాహుల్, అయ్యర్ వచ్చేశారు.. ఇద్దరు తెలుగోళ్లకు అవకాశం
అయితే ఐర్లాండ్‌తో సిరీస్‌లో తిలక్ వర్మ విఫలం అవుతుండటం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్, రెండో మ్యాచ్‌లో సిల్వర్ డకౌట్ కావడం తిలక్ వర్మ సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ షార్ట్ పిచ్ బాల్‌కే వెనుదిరిగాడు. పసికూన ఐర్లాండ్‌పై చెలరేగిపోతాడని ఆశించిన టీమ్ మేనేజ్‌మెంట్‌కు కూడా తిలక్ వర్మ ప్రదర్శన రుచించలేదు. ఈ ఏడాది సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌లో పోటీ తీవ్రస్థాయిలో ఉన్నా లెఫ్ట్ హ్యాండర్ కావడంతో తిలక్ వర్మను సెలక్ట్ చేయాలని పలువురు మాజీలు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ ఐర్లాండ్‌తో సిరీస్‌లో తెలుగు కుర్రాడు విఫలం కావడంతో వన్డే ప్రపంచకప్ జట్టుకు తిలక్ వర్మ ఎంపికవుతాడా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఆసియా కప్‌కు అతడికి సెలక్టర్లు అవకాశం కల్పించినా తుది జట్టులో చోటు కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - 2023-08-21T16:21:29+05:30 IST