ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs AUS: ఫైనల్లో భారత్‌కు మ్యాచ్‌ను దూరం చేసిన 5 కీలక అంశాలివే!

ABN, First Publish Date - 2023-11-20T09:37:24+05:30

World Cup Final: సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ను గెలిచి 12 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీలు లేని లోటును తీర్చుకోవాలనే టీమిండియా ఆశ నెరవేరలేదు. ఫైనల్లో జట్టుకు అనూహ్య ఓటమి ఎదురైంది. సెమీ ఫైనల్ వరకు అన్ని విభాగాల్లో అద్భుతంగా ఆడిన టీమిండియా తుది పోరులో మాత్రం తలవంచింది. అప్పటివరకు భీకరంగా ఆడిన మన వాళ్లు చివరి అడుగులో చేతులెత్తేశారు.

అహ్మదాబాద్: సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ను గెలిచి 12 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీలు లేని లోటును తీర్చుకోవాలనే టీమిండియా ఆశ నెరవేరలేదు. ఫైనల్లో జట్టుకు అనూహ్య ఓటమి ఎదురైంది. సెమీ ఫైనల్ వరకు అన్ని విభాగాల్లో అద్భుతంగా ఆడిన టీమిండియా తుది పోరులో మాత్రం తలవంచింది. అప్పటివరకు భీకరంగా ఆడిన మన వాళ్లు చివరి అడుగులో చేతులెత్తేశారు. అదేదో పగబట్టినట్టుగా పరిస్థితులు కూడా మనవాళ్లకు ఏ మాత్రం సహకరించలేదు. వెరసి మనకు ప్రపంచకప్ దూరమైంది. ఈ నేపథ్యంలో అసలు ఫైనల్ మ్యాచ్ మన చేతుల్లో నుంచి ఎక్కడ చేజారింది? మ్యాచ్‌ను మనకు దూరం చేసిన ఘటనలేంటి? అసలు మ్యాచ్‌లో మన వాళ్లు చేసిన తప్పులేంటి? మనకు మ్యాచ్‌ను దూరం చేసిన కీలక అంశాలేంటి?.. అనే విషయాలను ఓ సారి పరిశీలిద్దాం. మొత్తంగా ఈ మ్యాచ్‌లో మన వాళ్లు చేసిన 5 తప్పిదాలు మనకు మ్యాచ్‌ను దూరం చేశాయి.


శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వైఫల్యం

ఫైనల్లో శుభ్‌మన్ గిల్ వైఫల్యం టీమిండియాకు మైనస్‌గా మారింది. ఐపీఎల్‌లో అహ్మదాబాద్‌లో గిల్ రెచ్చిపోయేవాడు. దీంతో ప్రపంచకప్‌లోనూ అహ్మదాబాద్‌లో గిల్ రాణిస్తాడని అంతా భావించారు. కానీ అది జరగలేదు. 4 పరుగులు మాత్రమే చేసిన గిల్ స్టార్క్ వేసిన 5వ ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా మొదటి వికెట్‌ను త్వరగా కోల్పోయింది. ఈ టోర్నీ మొత్తంలో పవర్‌ప్లేలో రోహిత్ రెచ్చిపోయి ఆడుతుంటే గిల్ అతనికి చక్కని సహకారం అందిస్తూ వచ్చాడు. దీంతో భారత్‌కు మంచి శుభారంభాలు లభించాయి. ఫైనల్ మ్యాచ్‌లోనూ రోహిత్ తన సహజశైలికి అనుగుణంగా ధాటిగా ఆడాడు. కానీ గిల్ మాత్రం అతనికి సహకరించలేదు. దీనికి తోడు వరుస సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా 4 పరుగులకే ఔటయ్యాడు. టోర్నీ మొత్తం నాలుగో స్థానంలో అద్భుతంగా ఆడిన శ్రేయస్ అయ్యర్ ఫైనల్లో మాత్రం విఫలమ్యాడు. దీంతో మిడిలార్డర్‌లో టీమిండియాకు గట్టి దెబ్బతగిలింది. కీలకమైన గిల్, శ్రేయస్ ఇద్దరూ సింగిల్ డిజిట్‌కే ఔట్ కావడంతో స్కోర్ బోర్డు మందగించింది. వీరిద్దరు చెరో 20 పరుగుల చొప్పున చేసి ఔటైన పరిస్థితి మరోలా ఉండేది.

మిడిల్ ఓవర్లలో పరుగులు రాకపోవడం

81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. అప్పటికీ 10.2 ఓవర్లు మాత్రమే అయ్యాయి. దీంతో అక్కడి నుంచి ఓవర్‌కు 5 పరుగులు చేసిన సరిపోయేదు. కానీ కోహ్లీ, రాహుల్ నత్తనడకన బ్యాటింగ్ చేశారు. మరి నిదానంగా ఆడారు. కోహ్లీ బాగానే సింగిల్స్ తీసినప్పటికీ, రాహుల్ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. రాహుల్ ఆడుతుంటే ఇది టెస్ట్ మ్యాచ్ ఏమో అనే ఫీలింగ్ కూడా కల్గింది. కోహ్లీ, రాహుల్ అసలు బౌండరీలకు ప్రయత్నించలేదు. ఏకంగా 97 బంతులపాటు ఒక బౌండరీ కూడా కొట్టలేదు. దీంతో టీమిండియా రన్ రేటు బాగా తగ్గిపోయింది. 107 బంతులాడిన రాహుల్ ఒకే ఒక్క బౌండరీ బాది 66 పరుగులు మాత్రమే చేశాడంటేనే ఎంత నిదానంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా మిడిల్ ఓవర్లలో కనీస పరుగులు కూడా రావలేదు. దీంతో పవర్ ప్లేలో పరుగులు పెట్టిన టీమిండియా స్కోర్ బోర్డు ఆ తర్వాత నత్తకడకన కదిలిచింది. 11 నుంచి 20 ఓవర్ల మధ్య 35 పరుగులు, 21 నుంచి 30 ఓవర్ల మధ్య 37 పరుగులు మాత్రమే వచ్చాయి. అలాగే రాహుల్, కోహ్లీ, జడేజా, సూర్యకుమార్ యాదవ్ వంటి వాళ్లు బ్యాటింగ్ చేసినప్పటికీ 11 నుంచి 40 ఓవర్లలో అంటే 30 ఓవర్ల వ్యవధిలో 116 పరుగులు మాత్రమే వచ్చాయి. మ్యాచ్ మొత్తంలో మనవాళ్లు 13 ఫోర్లు, 3 సిక్సులు మాత్రమే కొట్టారు. దీంతో టీమిండియా మంచి స్కోర్ సాధించలేకపోయింది.

సూర్యకుమార్ యాదవ్ స్థానంలో జడేజా

భారత జట్టు 148/4తో ఉన్న దశలో విరాట్ కోహ్లీ ఔటయ్యాక సూర్యకుమార్ యాదవ్ క్రీజులో వస్తాడని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికే రైట్ బ్యాటర్ రాహుల్ క్రీజులో ఉండడంతో జడేజాను పంపి ఉండొచ్చు. రైట్, లెఫ్ట్ కాంబినేషన్ మనకు మంచి చేస్తుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావించినట్టుంది. అప్పుడు డెత్ ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటాడని అనుకున్నట్టున్నారు. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టింది. స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తాడనుకున్న జడ్డూ 22 బంతులు ఆడి 9 పరుగులే చేశాడు. ఒకవేళ సూర్యనే ముందు పంపి ఉంటే అతను కాస్త ఎక్కువ సేపు క్రీజులో ఉండేవాడు. దీంతో మరిన్ని పరుగులు వచ్చేవి కావొచ్చు. కానీ చివర్లో సూర్య కూడా పెదగా పరుగులు చేయలేకపోయాడు. డెత్ ఓవర్లలో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తాడనుకుంటే చతికిలపడ్డాడు. కీలకమైన డెత్ ఓవర్లలో 28 బంతులు ఆడి 18 పరుగులే చేశాడు.

సిరాజ్‌‌కు కొత్త బంతి ఇవ్వకపోవడం

ఈ టోర్నీ మొత్తం కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త బంతిని జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌కు ఇచ్చాడు. వీరిద్దరితోనే టీమిండియా బౌలింగ్‌ను ప్రారంభించాడు. కానీ ఫైనల్లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా సిరాజ్ స్థానంతో మహ్మద్ షమీతో బౌలింగ్ చేయించాడు. అయితే సిరాజ్ అంతగా ఫామ్‌లో లేకపోవడం, ఈ టోర్నీలో పెదగా వికెట్లు కూడా తీయకపోవడం, గత మ్యాచ్‌ల్లో పరుగులు ఎక్కువగా ఇవ్వడం ఒక కారణమైతే.. ప్రస్తుతం షమీ సూపర్ ఫామ్‌లో ఉండడం, కాపాడుకోవాల్సిన లక్ష్యం కూడా తక్కువగా ఉండడంతో షమీ ద్వారా త్వరగా వికెట్లు తీయొచ్చని కెప్టెన్ భావించి ఉండొచ్చు. దానికి అనుగుణంగానే షమీకి ఆరంభంలోనే వికెట్ దక్కింది. కానీ అదే సమయంలో ఈ టోర్నీలో మొదటి సారి కొత్త బంతిని వేయాల్సి రావడంతో దానిని కంట్రోల్ చేయలేక ఎక్స్‌ట్రాల రూపంలో పరుగులు ఎక్కువగా ఇచ్చాడు. దీంతో సిరాజ్ స్థానంలో షమీని తీసుకురావడం ఒక రకంగా బెడిసికొట్టింది. ఒక వేళ యథావిధిగా సిరాజ్‌తో బౌలింగ్ ప్రారంభించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో.

భాగస్వామ్యాన్ని విడదీయలేకపోవడం

ఒకనొక దశలో 47 పరుగులకే 3 కీలక వికెట్లు తీసి ఆస్ట్రేలియాను కష్టాల్లోకి నెట్టిన భారత బౌలర్లు ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేశారు. ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ భాగస్వామ్యాన్ని విడదీయలేకపోయారు. వీరిద్దరు ఏకంగా 192 పరుగుల భాగస్వామాన్ని నెలకొల్పారు. ఇక్కడే మ్యాచ్ మన చేతుల్లో నుంచి జారిపోయింది. ఈ భాగస్వామ్యం రాకుండా అడ్డుకోవడం లేదా త్వరగా విడదీసి ఉంటే ఫలితం కచ్చితంగా మరోలా ఉండేది. కానీ అది జరగలేదు. భాగస్వామ్యాన్ని విడదీయడానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్ని బౌలింగ్ మార్పులు చేసినా ఫలితం లేకుండాపోయింది. ఈ తప్పిదాలన్నింటితో మొత్తంగా భారత్‌కు ఓటమి ఎదురైంది.

Updated Date - 2023-11-20T10:30:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising