Year End 2023: ఈ ఏడాది ప్రపంచకప్‌లో అహంకారానికి నిదర్శనం ఇది!
ABN, Publish Date - Dec 27 , 2023 | 02:10 PM
చూస్తుండగానే 2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. అప్పుడే 12 నెలలు గడిచిపోయాయా? అనే అనుమానం వస్తుంది. కానీ గడిచిపోయాయి. ఇది నిజం. నూతన సంవత్సరం 2024 ఆరంభానికి కూడా సమయం ఆసన్నమైంది.
చూస్తుండగానే 2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. అప్పుడే 12 నెలలు గడిచిపోయాయా? అనే అనుమానం వస్తుంది. కానీ గడిచిపోయాయి. ఇది నిజం. నూతన సంవత్సరం 2024 ఆరంభానికి కూడా సమయం ఆసన్నమైంది. 2023 సంవత్సరం మొత్తంలో క్రికెట్‌లో ఏం జరిగిందనే విషయాలను ఒకసారి నెమరువేసుకుంటే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్‌లో ఈ ఏడాది చోటుచేసుకున్న వివాదాలు మొదటగా గుర్తొస్తాయి. అందులో మరి ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ చేసిన ఉదంతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో ఆ జట్టు 6 సార్లు వన్డే ప్రపంచకప్ ట్రోఫిని కైవసం చేసుకుంది.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ప్రపంచకప్ అనంతరం ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. క్రికెటర్లతోపాటు అభిమానులు ఎంతో గొప్పగా భావించే ప్రపంచకప్ ట్రోఫీని మిచెల్ మార్ష్ దారుణంగా అవమానించాడు. కుర్చీలో దర్జాగా కూర్చొని మద్యం సేవిస్తూ ప్రపంచకప్ ట్రోఫీపై తన రెండు కాళ్లను పెట్టాడు. అంతటితో ఆగకుండా మార్ష్ చేసిన ఈ ఉదంతాన్ని ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఫోటోలు తీశారు. అదేదో గొప్ప పని అన్నట్టుగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో పెను దుమారం రేగింది.
క్రీడా అభిమానులతోపాటు సాధారణ నెటిజన్లు కూడా మిచెల్ మార్ష్ అహంకార పూరిత ధోరణిపై దుమ్మెత్తిపోశారు. క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు మిచెల్ మార్ష్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచకప్ ట్రోఫీని గెలవలేకపోయామని ఎంతో మంది క్రికెటర్లు, అభిమానులు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రపంచకప్ ట్రోఫీ పట్ల ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ దారుణంగా వ్యవహరించడం బాధాకరమని అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అతనిపై పోలీస్ కేసు నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త కేశవ్ పండిట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు మార్ష్‌పై కేసు నమోదు చేశారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా మిచెల్ తీరును తీవ్రంగా ఖండించింది. మొత్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిలో ఈ ఏడాది మార్ష్ బ్యాడ్ ప్లేయర్‌గా ముద్రవేసుకున్నాడు.
Updated Date - Dec 27 , 2023 | 02:10 PM