Year End 2023: 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాదే టైమ్‌డ్ ఔట్ వివాదం
ABN, Publish Date - Dec 27 , 2023 | 02:22 PM
2023 సంవత్సరం ముగింపునకు రోజులు మాత్రమే మిగిలాయి. చూస్తుండగానే 12 నెలలు గడిచిపోయాయి. ఇక 2024 సంవత్సరానికి స్వాగతం పలకడమే మిగిలి ఉంది. క్రికెట్ పరంగా ఈ ఏడాది అనేక అరుదైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది టైమ్‌డ్ ఔట్ వివాదం.
2023 సంవత్సరం ముగింపునకు రోజులు మాత్రమే మిగిలాయి. చూస్తుండగానే 12 నెలలు గడిచిపోయాయి. ఇక 2024 సంవత్సరానికి స్వాగతం పలకడమే మిగిలి ఉంది. క్రికెట్ పరంగా ఈ ఏడాది అనేక అరుదైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది టైమ్‌డ్ ఔట్ వివాదం. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యుస్ టైమ్‌డ్ ఔట్ కావడం తీవ్ర దుమారం లేపింది. ఈ వివాదంలో మెజారిటీ శాతం మద్దతు మాథ్యూస్‌కే దక్కింది. చాలామంది ఈ వివాదానికి కారణమైన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను తప్పుబట్టారు. షకీబ్‌కు అసలు క్రీడా స్పూర్తే లేదంటూ దుమ్మెత్తిపోశారు. ఈ క్రమంలో రెండు జట్ల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నెలకొంది. శ్రీలంక అభిమానులైతే షకీబ్ తమదేశానికి వస్తే రాళ్లు తీసుకొని కొడతామని హెచ్చరించారు.
అసలు ఏం జరిగిందంటే.. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్ 6న శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ అనూహ్యంగా టైమ్‌డ్ అవుట్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘టైమ్‌డ్ అవుట్’ అయిన తొలి ఆటగాడిగా మాథ్యూస్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఇంతకీ అతడి నిష్క్రమణకు కారణం ఏంటంటే హెల్మెట్. అవును.. హెల్మెటే! సదీర సమరవిక్రమ ఔట్ కావడంతో ఆరో నెంబర్ బ్యాటర్‌గా మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. మాథ్యూస్ తొలి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతూ హెల్మెట్ స్ట్రాప్‌ను సరిచేసుకుంటుండగా.. ఆ స్ట్రాప్ కాస్తా తెగి పోయింది. దాంతో అతడు మరో హెల్మెట్ కోసం సంజ్ఞ చేశాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన మరో బ్యాటర్ మూడు నిమిషాల్లోగా తొలి బంతిని ఎదుర్కోవాలి. లేదంటే అతడు ‘టైమ్‌డ్ అవుట్’ అవుతాడు. అయితే వరల్డ్‌కప్ కోసం ఈ నిబంధనను రెండు నిమిషాలకు తగ్గించారు.
దాంతో అప్పటికే మాథ్యూస్ వచ్చి రెండు నిమిషాలు దాటడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ‘టైమ్‌డ్ అవుట్’ కోసం అప్పీల్ చేశాడు. దానిని పరిగణనలోకి తీసుకున్న ఫీల్డ్ అంపైర్లు మాథ్యూ్‌స్‌ను అవుట్‌గా ప్రకటించారు. కానీ తన హెల్మెట్‌తో సమస్య ఎదురైందని, అందువల్లే ఆలస్యమైందని ఏంజెలో వాదించాడు. దీంతో అంపైర్లు నిర్ణయాన్ని బంగ్లా కెప్టెన్ ఇష్టానికి వదిలేశారు. అయితే అవుట్ ఇవ్వాల్సిందేనని కెప్టెన్ షకీబ్ చెప్పడంతో మాథ్యూస్ తీవ్ర అసహనంతో వెనుదిరిగాడు. మ్యాచ్ అనంతరం కూడా షకీబ్ తాను చేసిన దానిని సమర్థించుకోవడం మరింత వివాదానికి దారి తీసింది. కాగా పురుషులు, మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో టైమ్‌డ్ అవుడ్ కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఘటన క్రికెట్ స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం ఇలాంటి ఘటనలు ఆరుసార్లు చోటుచేసుకున్నాయి.
Updated Date - Dec 27 , 2023 | 02:22 PM